పాత రూ.500 నోటు ఇస్తే రూ.50 వేలు.. | Old Note Fraud Case in Hyderabad | Sakshi
Sakshi News home page

రూ.500 ఇస్తే.. రూ.50 వేలట!

Published Sat, Aug 24 2019 8:22 AM | Last Updated on Mon, Sep 2 2019 12:15 PM

Old Note Fraud Case in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: డీమానిటైజేషన్‌కు ముందు అమలులో ఉన్న పాత రూ.500 నోట్లలో ఓ సిరీస్‌కు చెందిన ఒక నోటు ఇస్తే రూ.50 వేలు వస్తాయంటూ నమ్మబలికిన ముఠా రూ.12 లక్షలు కాజేసింది. ఆలస్యంగా ఫిర్యాదు అందినప్పటికీ సైదాబాద్‌ పోలీసులు 48 గంటల్లో కేసు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు రూ.12 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. ఈస్ట్‌జోన్‌ డీసీపీ ఎం.రమేష్, మలక్‌పేట ఏసీపీ ఎం.సుదర్శన్‌లతో కలిసి శుక్రవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. నగరానికి చెందిన రాజ్‌కుమార్‌ బగాడియా పుత్లిబౌలిలోని రంగ్‌మహల్‌ రోడ్‌లో శ్రీ సంతోషి ఫిల్లింగ్‌ స్టేషన్‌ పేరుతో ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రకాష్‌నగర్‌కు చెందిన సంబరం రాజేష్‌ పని చేస్తున్నాడు. బండ్లగూడకు చెందిన ఏఎం మెటల్‌ స్టోర్‌ నిర్వాహకుడు అబేద్‌ మొహియుద్దీన్, తలాబ్‌కట్టకు చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి షేక్‌ అబ్దుల్‌ బాసిత్‌ రాజేష్‌కు స్నేహితులు. తన యజమాని బగాడియాకు ఆశ ఎక్కువని, గతంలోనూ అనేక చిన్న చిన్న వ్యవహారాలు నడిపాడని అతడి ద్వారా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో పథకం ప్రకారం వారిద్దరూ రాజేష్‌తో కలిసి వెళ్లి బగాడియాను పరిచయం చేసుకున్నారు. అదును చూసుకుని బగాడియా వీక్‌నెస్‌పై కొట్టాలని ముగ్గురూ నిర్ణయించుకున్నారు. ఈ త్రయం ఇటీవల బగాడియాను కలిసి తేలిగ్గా డబ్బులు సంపాదించే మార్గం ఉందని చెప్పింది.

2002లో ముద్రితమైన పాత రూ.500 నోట్లలో ఓ సిరీస్‌కు ఇప్పుడు మంచి డిమాండ్‌ వచ్చిందని, ఆ కరెన్సీ దొరికితే ఒక్కో నోటుకు రూ.50 వేలు ఇవ్వడానికి కొందరు సిద్ధంగా ఉన్నట్లు బగాడియాతో చెప్పారు. తేలిగ్గా డబ్బు వస్తుందనడంతో ఆశపడిన అతను అందుకు అంగీకరించాడు. అయితే ఇప్పుడు పాత నోట్లు ఎక్కడ దొరుకుతాయంటూ ప్రశ్నించగా, సైదాబాద్‌లోని ఓ వ్యక్తి వద్ద రూ.2 కోట్ల పాత కరెన్సీ ఉందని చెప్పారు. అడ్వాన్స్‌గా కొంత మొత్తం ఇస్తే ఆ నోట్లు ఇచ్చేస్తాడని, వాటిలో తమకు కావాల్సిన సిరీస్‌ పాత నోట్లు ఎంచుకుని మిగిలినవి తిరిగి ఇచ్చేదామని గత శనివారం చెప్పారు. దీంతో ఆదివారానికి రూ.12 లక్షలు సిద్ధం చేసిన బగాడియా ఆ మొత్తం తీసుకుని అబేద్, బాసిత్‌లతో కలిసి బయలుదేరాడు. ఇతడిని సైదాబాద్‌లోని ఎస్బీఐ కాలనీ పార్క్‌ వరకు తీసుకువెళ్లిన నిందితులు అక్కడ దృష్టి మళ్ళించారు. సదరు వ్యక్తి అందరినీ ఇంట్లోకి రానీయడని, ముందు తాము వెళ్ళి డబ్బు చూపిస్తామని, ఆపై నమ్మకం కలిగి మిమ్మల్నీ లోపలకు అనుమతిస్తాడని చెప్పారు. అందకు అంగీకరించిన బగాడియా రూ.12 లక్షలు ఇచ్చి వారిని పంపాడు. కొద్దిదూరం వెళ్లిన ఇరువురూ ఆ మొత్తం తీసుకుని ఉడాయించారు. కాస్సేపు అక్కడే వేచి చూసిన బగాడియా తిరిగి తన బంకుకు వచ్చేసి ఆ ఇద్దరి విషయం రాజేష్‌ను అడిగాడు. ఎంత ప్రయత్నించినా తనకూ వారి ఫోన్‌ నెంబర్లు కలవట్లేదని చెప్పిన అతగాడు బహుశా పోలీసులు పట్టుకుని ఉంటారని, ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తారని చెప్పాడు.  రెండు రోజులు వేచి చూసిన బగాడియా తాను మోసపోయినట్లు గుర్తించి సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్‌ కస్తూరి శ్రీనివాస్‌ నేతృత్వంలో రంగంలోకి దిగిన డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.సురేష్‌ తదితరులు కేసు దర్యాప్తు చేశారు. రాజేష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా విషయం బయటపడింది. దీంతో మిగిలిన ఇద్దరినీ పట్టుకుని రూ.12 లక్షలు రికవరీ చేశారు. ముగ్గురినీ అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.    

మూడింతలు చేస్తానని ముంచేశాడు..ఓ డ్రైవర్‌కు నకిలీబాబా బురిడీ
బంజారాహిల్స్‌: యంత్ర తంత్రాలు, పూజలతో మూడింతల డబ్బును చేస్తానంటూ నగరానికి చెందిన ఓ డ్రైవర్‌ను మహారాష్ట్ర బురిడీ బాబా నిండా ముంచాడు. బాధితుడి ఫిర్యాదుతో బంజారాహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..  ఎల్‌ఎన్‌ నగర్‌కు చెందిన బండారు రత్నయ్య డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తన స్నేహితుడు జాఫర్‌ కోసం అతను తరచూ మంచిర్యాల వెళ్లేవాడు. ఇటీవల మంచిర్యాలకు వెళ్ళినప్పుడు జాఫర్, ప్రభాకర్‌ అనే వ్యక్తిని పరిచయం చేశాడు. జాఫర్, ప్రభాకర్‌ ఇద్దరూ కలిసి తమకు మహారాష్ట్రలో మౌలాలా మహ్మద్‌ ఇర్ఫాన్‌ అనే బాబా తెలుసని రూ. లక్ష ఇస్తే మంత్రాలు, పూజలు చేసి రూ. మూడు లక్షలు చేస్తాడని నమ్మించాడు.రూ. 12 లక్షలు సర్ధితే ’ 36 లక్షలు తీసుకోవచ్చని చెప్పడంతో రత్నయ్య ఈ ఏడాది మే 2న విడతల వారిగా వారికి డబ్బులు ఇచ్చాడు. గత మే నెలలో ఎల్‌ఎన్‌ నగర్‌లోని రత్నయ్య ఇంటికి బాబా మౌలాలా మహ్మద్‌ ఇర్ఫాన్‌ వచ్చాడు.

డబ్బును ఓ బ్యాగులో పెట్టి పూజల అనంతరం రూ. 50 లక్షలు అయ్యిందంటూ ఓ బ్యాగును రత్నయ్యకు ఇచ్చి 15 రోజుల పాటు పూజలు చేసిన అనంతరం బ్యాగ్‌ను తెరవాలని చెప్పి వెళ్లిపోయాడు. బాబా చెప్పినట్లుగానే రత్నయ్య, జయ దంపతులు పూజలు నిర్వహించి బ్యాగు తెరిచి చూడగా అందులో తెలుపు, నలుపు పేపర్ల బండిళ్లు కనిపించాయి. వెంటనే బాబాకు ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పగా, పూజల్లో ఏదో లోపం జరిగిందని వెంటనే ఆ బ్యాగు తీసుకొని మహారాష్ట్రకు రావాలని సూచించాడు. దీంతో భార్యతో కలిసి కారులో అక్కడికి వెళ్ళాడు. ఇంకో పూజ చేయాల్సి ఉంటుందని చెప్పి రూ. 60 వేలు వసూలు చేశాడు. తాను కొద్దిసేపట్లో వస్తానని ఇక్కడే ఉండాలని చెప్పి వెళ్ళిపోయాడు. రోజులు గడిచినా బాబా రాకపోవడంతో రత్నయ్య దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు. జాఫర్, ప్రభాకర్, బాబా ఇర్ఫాన్‌ ముగ్గురూ కలిసి తనను మోసం చేశారని తెలుసుకొని నిలదీయగా,  బాబా వారిని చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ బాబాతో పాటు జాఫర్, ప్రభాకర్‌లపై పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement