నక్కపల్లి పోలీస్ పెట్రోలు బంకులో సిబ్బందికి అందిన నకిలీ ఐదువందల నోట్లు
నక్కపల్లి, అనకాపల్లి: మండల కేంద్రం నక్కపల్లి పరిసర గ్రామాల ప్రజలు ఇప్పుడు రూ.500 నోటు అంటేనే హడలిపోతున్నారు. కొద్ది రోజులుగా పరిసర ప్రాంతాల్లో దొంగనోట్ల చలామణీ జోరుగా సాగుతోంది. పెట్రోల్ బంకులను కేంద్రంగా చేసుకుని ముఠా సభ్యులు రూ.500 నకిలీ నోట్లను మారుస్తున్నారు.
మరికొందరు పశువుల మార్కెట్లలో మేకలు,గొర్రెలు, పశువులను కొనుగోలు చేసినప్పుడు దొంగనోట్లు ఇస్తున్నారు. తాజాగా ఆదివారం నక్కపల్లిలో పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న పోలీసు వెల్ఫేర్ పెట్రోల్‌బంకులో సుమారు 8 నకిలీ రూ.500 కరెన్సీ నోట్లతో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్/డీజిల్ కొనుగోలు చేశారు. ఇక్కడ పెట్రోల్‌పంపుల వద్ద పనిచేస్తున్న సిబ్బందికి నకిలీ నోట్లను గుర్తు పట్టే సామర్థ్యం లేకపోవడం, అవసరమైన తనిఖీ యంత్రాలను ఏర్పాటు చేయకపోవడంతో మోసపోతున్నారు.
పెట్రోల్‌బంకుల్లో పనిచేస్తున్న సిబ్బంది క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లి నగదు అప్పగించేటప్పుడు నకిలీ నోట్లు బయటపడడంతో బిక్కముఖం వేస్తున్నారు. ఈ నష్టం మీరే భరించాలని బంకు యాజమాన్యం చెబుతుండడంతో తాము నష్టపోతున్నామని వాపోతున్నారు. నక్కపల్లి పోలీసు పెట్రోల్‌బంకులో ఒక యువకుడికి ఏకంగా రూ.500 నోట్లు 6, మరొకరికి 2 నకిలీ నోట్లు వచ్చాయి.
మండలంలో చినదొడ్డిగల్లు, వేంపాడు, దేవవరం పెట్రోల్‌బంకుల్లో కూడా ఒక ముఠా గుట్టుచప్పుడు గాకుండా దొంగ నోట్లు చలామణీ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రతీ శుక్రవారం, బుధవారాల్లో నక్కపల్లిలో జరిగే వారపుసంతలు,పశువుల మార్కెట్లలో లావాదేవీలు జరిగినప్పుడు అసలైన రూ.500 నోట్ల మధ్య నకిలీ నోట్లను పెట్టి అమాయకులైన వారికి ఇచ్చి మోసగిస్తున్నారు. బ్యాంకుకు వెళ్లినప్పుడు కట్టలో నకిలీ నోట్లు ఉన్నాయని తెలుసుకున్న పశువుల వ్యాపారులు లబోదిబోమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment