కదిలిన యంత్రాంగం
యలమంచిలి రూరల్: యలమంచిలి మండలం రేగుపాలెం గ్రామ పరిధిలో సర్వే నెంబర్లు 167/1, 167/3లో ఉన్న 2.91 ఎకరాల ప్రభుత్వ భూమిని యలమంచిలి పూర్వ తహసీల్దార్ ఒకరు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిన వ్యవహారంపై కలెక్టర్ విజయ కృష్ణన్ శనివారం విచారణకు ఆదేశించారు. రేగుపాలెం పరిధిలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఒక రియల్టర్, సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం పేరిట మ్యుటేషన్ చేసిన వ్యవహారంపై శనివారం సాక్షిలో ‘ప్రభుత్వ భూములను రాసిచ్చారు’ శీర్షికతో సమగ్ర కథనం ప్రచురితమైంది. ప్రభుత్వ భూములను అడ్డగోలుగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన వైనం జిల్లావ్యాప్తంగా రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపింది. ప్రభుత్వ భూములతోపాటు పక్కనే ఉన్న సర్వే నెంబర్లు 164, 165లో శ్మశాన వాటిక, ఎర్రచెరువులను ఆక్రమించుకుని భారీ ప్రహరీ గోడ నిర్మిస్తున్నా అధికార యంత్రాంగం నిస్తేజంగా ఉండడంపై జిల్లా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండానే ప్రహరీ నిర్మిస్తున్నా సచివాలయ, పంచాయతీ సిబ్బంది, మండల స్థాయి అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏడేళ్లుగా రేగుపాలేనికి చెందిన రైతు రెడ్డి రమణ ఈ వ్యవహారంపై రాజీలేని పోరాటం చేస్తున్న వైనంపై కూడా జిల్లా అధికార యంత్రాంగం ఆశ్చర్యపోయినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా యలమంచిలి నియోజకవర్గంలో సామాజిక మాధ్యమాల్లో శనివారం ప్రచురితమైన సాక్షి కథనం బాగా వైరల్ అయింది. పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల మధ్య ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. జిల్లా కలెక్టర్ సమగ్ర నివేదిక కోరడంతో యలమంచిలి తహసీల్దార్ కార్యాలయంలో ఈ భూములకు సంబంధించిన ఫైళ్లను కార్యాలయం అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారంలో మ్యుటేషన్ జరగడం వెనుక అన్ని నిబంధనలు అతిక్రమించినట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. రీ సర్వేలో సైతం ఇక్కడ ప్రభుత్వ భూములకు ఎల్‌పీఎం నంబర్లు ఎలా కేటాయించారో అర్థంకాక ప్రస్తుత అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై యలమంచిలి తహసీల్దార్ కె.వరహాలును సంప్రదించగా రికార్డుల ప్రకారం వాస్తవ నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపించనున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా రేగుపాలెం గ్రామ పరిధిలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిన వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకుని, భూములను ప్రభుత్వం స్వాధీనపరచుకునే వరకు ఆందోళన చేయడానికి వామపక్షాలు, కొందరు రేగుపాలెం గ్రామస్తులు సిద్ధమవుతున్నారు.
‘ప్రభుత్వ భూమిని రాసిచ్చారు’ కథనానికి స్పందన
రేగుపాలెం భూములపై విచారణకు కలెక్టర్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment