యువకుడి దారుణ హత్య
స్వల్ప వివాదమే కారణం
పోలీసుల అదుపులో పలువురు నిందితులు?
నెల్లూరు(క్రైమ్): స్వల్ప వివాదం పెద్దదిగా మారి ఓ యువకుడి దారుణ హత్యకు దారి తీసింది. ఈ ఘటన నెల్లూరు కొండాయపాళెంలో జరిగింది. సోమవారం పోలీసులు వివరాలు వెల్లడించారు.. కొండాయపాళేనికి చెందిన గంట ఉదయ్ కుమార్, అభిషేక్ (23)లు అన్నదమ్ములు. అదే ప్రాంతానికి చెందిన దాసు వారికి దూరపు బంధువు. దాసు మద్యానికి బానిసయ్యాడు. మత్తులో ఇష్టానుసారం ప్రవర్తించేవాడు. అసభ్యకర పదజాలంతో దూషించేవాడు.
ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాసు తన ఇంటికి సమీపంలో గట్టిగా కేకలు వేస్తుండటంతో ఉదయ్ వారించాడు. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఉదయ్ అతడిపై చేయి చేసుకోవడంతో దాసు వెళ్లిపోయాడు. జరిగిన విషయాన్ని పడారుపల్లిలో ఉంటున్న తన భార్య, అత్త, బావమరుదులు శ్రీకాంత్, శ్రీనివాసులు, స్నేహితుడు సూర్యకు చెప్పాడు. అందరూ కలిసి సోమవారం తెల్లవారుజామున కొండాయపాళేనికి చేరుకుని ఉదయ్‌తో ఘర్షణకు దిగారు. అక్కడే ఉన్న అభిషేక్, ఉదయ్ స్నేహితుడు ప్రవీణ్ అలియాస్ చింటూ అడ్డుకున్నారు.
దీంతో మరింతగా రెచ్చిపోయిన వారు తమ వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో విచక్షణారహితంగా ఈ ముగ్గురిపై దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో అభిషేక్‌కు తీవ్రగాయాలై మృతిచెందగా, ఉదయ్ స్వల్పంగా గాయపడ్డాడు. ప్రవీణ్‌కు తీవ్రగాయాలు కావడంతో ప్రస్తుతం నారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న నగర డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి, వేదాయపాళెం ఇన్‌స్పెక్టర్ వి.శ్రీనివాసరెడ్డిలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఉదయ్ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేశారు. మృతుడు ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment