
వాట్ ఎన్ ఐడియా!
పాఠశాలలో కంప్యూటర్లు చోరీ
‘ఆధార్’ వెలిముద్ర లతో పట్టుకుంటామని దండోరా
భయంతో కంప్యూటర్లను పాఠశాలలో ఉంచిన దొంగలు
లింగంపేట : దొంగిలించిన కంప్యూటర్లను ఎలా రప్పించాలనీ ఆలోచించారు మండలంలోని మెంగారం గ్రామస్తులు. ఆధార్ కార్డు నంబర్ల ఆధారంగా వేలిముద్రలనుసేకరించి దొంగతనాన్ని బయట పె డతామనీ పాఠశాల ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్ కుంటరాజు దండోరా వేయించడంతో భయపడ్డ దొం గలు తాము దొంగిలించిన కంప్యూటర్లను తిరిగి పాఠశాలలో వదిలిపెట్టి వెళ్లిన ఘటన గ్రామంలో శనివారం జరిగింది.
గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో ఈనెల 3న గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల తరగతి గది తాళం పగుల గొట్టి నాలుగు కంప్యూటర్లను, ఒక సీపీఎస్‌ను, స్పీకర్‌బాక్స్‌లను దొంగిలించారు. 4వ తేదీన పాఠశాల తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన గ్రామస్తులు పాఠశాలలో కంప్యూటర్లు చోరీకి గురైన విషయాన్ని ప్రధానోపాధ్యాయుడికి సమాచారం అందించారు. ఎస్‌ఎంసీ చైర్మన్‌తో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. అంతటితో ఆగకుండా చైర్మన్ రాజు గ్రామస్తులతో చర్చిం చారు.
దొంగతనం జరిగినందున తలుపులు,కంప్యూటర్ డెస్క్‌లపై గల వేలిముద్రలను పోలీసులు సేకరించారు. మరి ఆధార్ కార్డు నంబర్ల ఆధారంగా గ్రామస్తులందరి వేలిముద్రలను సేకరిస్తామనీ, దాంతో కంప్యూటర్లు దొంగిలించిన వ్యక్తులను ఈజీ గా పట్టుకోవచ్చని భావించి ఈనెల 6న రాత్రి గ్రామంలో దండోరా వేయించారు. దాంతో భయాం దోళనకు గురై కంప్యూటర్ల చోరీకి పాల్పడిన వారు వాటిని పాఠశాల ఆవరణలో పెట్టివెళ్లిపోయారు.
నాలుగు కంప్యూటర్లు చోరీకి గురికాగా దొంగలు మూడు కంప్యూటర్లను మాత్రమే పాఠశాలలో పెట్టారు. మరో కంప్యూటర్, సీపీఎస్,స్పీకర్ బాక్స్‌లు దొంగల వద్దనే ఉన్నాయి. పాఠశాలలో కంప్యూటర్లు ఉన్నట్లు గమనించిన ఓ రైతు విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా పెద్ద ఎత్తున పాఠశాలకు చేరుకున్నా రు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.