ప్రభుత్వానికి కమిటీ సిఫారసు
కమ్యూనిటీ, ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయించాలని సూచన
పోర్టల్‌లో అనధికారికంగా మార్పులు జరిగాయేమో తేలుతుందని స్పష్టికరణ!
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌ను థర్డ్ ఫార్టీతో ఆడిటింగ్ (మదింపు) చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసు చేసింది. ఫోరెన్సిక్‌తో పాటు కమ్యూనిటీ ఆడిటింగ్ చేయించడం ద్వారా ఈ పోర్టల్‌లో భూముల రికార్డులు ఏమైనా తారుమారయ్యాయేమో గుర్తించాలని సూచించింది. ఈ పోర్టల్ ద్వారా భూముల రికార్డుల నిర్వహణ గత నాలుగేళ్లుగా ప్రైవేటు కంపెనీ చేతుల్లో ఉన్నందున అనధికారికంగా రికార్డుల మార్పు జరిగిందేమో పరిశీలించాలని ఇటీవల ప్రభుత్వానికి ఇచి్చన నివేదికలో కోరినట్టు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చిన ఈ పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని వేలాది ఎకరాల భూముల రికార్డులు మారిపోయాయని, అర్ధరాత్రి రికార్డుల మార్పిడి జరిగిందన్న రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ధరణి పోర్టల్ పునరి్నర్మాణ కమిటీ చేసిన సిఫారసు ప్రాధాన్యత సంతరించుకుంది.
రెండు పద్ధతుల్లోనూ చేయడం మంచిది
ఆడిటింగ్‌ను రెండు పద్ధతుల్లోనూ నిర్వహించాలని కమిటీ ప్రభుత్వానికి సూచించినట్టు తెలిసింది. ఫోరెన్సిక్‌తో పాటు కమ్యూనిటీ ఆడిటింగ్ చేపట్టాలని, ఫోరెన్సిక్ ఆడిటింగ్‌లో భాగంగా ధరణి పోర్టల్‌లో రికార్డుల నమోదుతో పాటు మారి్పడి లావాదేవీలను సాఫ్ట్‌వేర్, సైబర్ క్రైమ్ నిపుణులతో మదింపు చేయించాలని సూచించినట్టు సమాచారం. ఇక, గ్రామాలకు వెళ్లి కమ్యూనిటీ ఆడిటింగ్ చేయాలని, ప్రతి రైతు యాజమాన్య హక్కుల రికార్డులను మాన్యువల్ పద్ధతిలో సరిచూడాలని సిఫారసు చేసింది.
ఇందుకోసం మూడు, నాలుగు నెలల కార్యాచరణ రూపొందించుకోవాల్సి ఉంటుందని భూ నిపుణులు చెపుతున్నారు. కమ్యూనిటీ ఆడిటింగ్ నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో రైతులు ధరణి పోర్టల్ ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వస్తా యని, అదే విధంగా ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న భూసమస్యల దరఖాస్తులకు కూడా పరిష్కారం లభిస్తుందని కమిటీ పేర్కొన్నట్టు తెలిసింది. భూరికార్డులు అనధికారికంగా మార్చి ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశముందనే కోణంలో కమిటీ ఈ ఆడిటింగ్‌లకు సిఫారసు చేసినట్టు సమాచారం.
ఆ మూడు రికార్డులు చూడండి
ఆడిటింగ్‌లో భాగంగా మూడు రికార్డులను పరిశీలించాలని ధరణి కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాక ముందు భూ యాజమాన్య హక్కుల రికార్డు డేటా, 2017లో నిర్వహించిన భూరికార్డుల ప్రక్షాళన ద్వారా వచ్చిన రికార్డుల డేటా, ఆ తర్వాత ధరణి పోర్టల్‌లో నమోదు చేసిన డేటాలను పరిశీలించాలని, అప్పుడే అనధికారిక మార్పులు జరిగాయో లేదో తేలుతుందని స్పష్టం చేసినట్లు సమాచారం. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచి్చన తర్వాత జరిగిన రికార్డుల మారి్పడి లావాదేవీలను కూడా పరిశీలించాల్సి ఉంటుందని, గతంలో ఏడాదికోమారు జమాబందీ ప్రక్రియ ద్వారా భూమి రికార్డులను పరిశీలించే వారని, ఇప్పుడు ఆ పద్ధతి అమల్లో లేనందున ఆడిటింగ్ నిర్వహించడం ద్వారా జమాబందీ నిర్వహించినట్టు కూడా అవుతుందని ఆ నివేదికలో కమిటీ అభిప్రాయపడ్డట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment