
న్యాయం చేయాలని కోరుతున్న బాధితులు
కొనకనమిట్ల: చేయి తడిపితే చాలు ఎవరి పొలాలకు ఇంకెవరి పేరుతో అయినా పాస్‌పుస్తకాలు పుడతాయి. ఆ వెంటనే ఆన్‌లైన్‌లో కూడా నమోదవుతాయి. రెవెన్యూ సిబ్బంది చేస్తున్న మాయాజాలాన్ని ఆలస్యంగా గ్రహిస్తున్న అసలు భూ యజమానులు బోరుమంటున్నారు. తమ పొలాలు ఎవరి పేరుతో ఆన్‌లైన్‌లోకి ఎక్కుతున్నాయోనని ఆందోళన చెందుతున్నారు. తాజాగా కొనకనమిట్ల మండలం వాగుమడుగు పంచాయతీ బోడపాడు, వద్దిమడుగు గ్రామాలకు చెందిన పలువురు రైతులు తమ పొలాలను మరొకరి పేరిట ఆన్‌లైన్ చేశారంటూ సోమవారం విలేకరుల ఎదుట వాపోయారు.
కొనకనమిట్ల మండలం బోడపాడు గ్రామానికి చెందిన భూదాల కొండయ్య పేరు మీద సర్వే నంబరు 26–1లో 4.27 ఎకరాల భూమి ఉంది. మూడేళ్ల క్రితం కొండయ్య మృతి చెందాడు. అతడి పేరున ఉన్న భూమిని తన పేరున మార్చాలని భార్య కొండమ్మ తహసీల్దార్ కార్యాలయ అధికారులను వేడుకుంది. ఏడాదిగా తిరుగుతున్నా పట్టించుకోలేదు సరి కదా అప్పటి వరకు కొండయ్య పేరున ఉన్న భూమిలో రెండెకరాలను వాగుమడుగు గ్రామానికి చెందిన కదమ బ్రహ్మేశ్వరరావు పేరున పాసుపుస్తకం ఇచ్చి ఆన్‌లైన్ కూడా చేశారు. మిగతా భూమిని ఇతరుల కింద చూపటం జరిగింది. ఇది అన్యాయమయ్యా అని తహసీల్దార్ జ్వాలా నరసింహం, ఆర్‌ఐ పుల్లారెడ్డి, వీఆర్‌ఓ పిచ్చిరెడ్డిలను అడిగితే కన్నెత్తి చూడటం లేదని ఇంతటి దుర్మార్గపు పని చేశారని కొండమ్మ ఆవేదన వెలెబుచ్చింది.
అధికారుల నుంచి సమాధానం కరువు
బోడపాడు గ్రామానికి చెందిన చిరుగూరి మోషేకు సర్వే నంబరు 20–4లో 1–96 ఎకరాలు, 20–5లో 1–53 ఎకరాలు వెరసి 3–49 ఎకరాల భూమి ఉంది. దానికి పాసు పుస్తకం కూడా ఉంది. అయితే రెవెన్యూ అధికారులు సదరు భూమిని సాదం బాలకృష్ణ పేరున పాసు పుస్తకం ఇచ్చి ఆన్‌లైన్ కూడా చేసారు. దీని మీద గొడవలు జరిగాయని ఇదేం పనంటూ రెవెన్యూ అధికారులను అడిగితే సమాధానం చెప్పటం లేదని మోషే వాపోయాడు.
అంబాపురంలో భూ మాయ..
వాగుమడుగు పంచాయతీ అంబాపురం రెవెన్యూ ఇలాకలో మాన్యం భూమి సర్వే నంబరు 229–2లో 6–10 ఎకరాల భూమిని వద్దిమడుగు గ్రామానికి చెందిన ఆళ్లచెరువు శ్రీను, మూర్తెయ్య, బట్టు పెదకృష్ణయ్య, చినకృష్ణయ్యలు వారి పూర్వికుల నుంచి ఉన్న భూమిలో బోర్లు వేసుకొని పంటలు సాగు చేసుకుంటున్నారు. ఈ భూమి మాన్యం భూమిగా ఉంటడంతో రెవెన్యూ అధికారులు , పలువురు మధ్యవర్తులు ద్వారా రూ. సుమారు రూ.15 లక్షల వరకు తీసుకొని ఆ భూమిని అంబాపురం గ్రామానికి చెందిన కందుకూరు రాజయ్య పేరున పాసు పుస్తకం ఇచ్చారు. అదే భూమిని రాజయ్య వేరొకరికి అమ్మకం పెట్టాడు. ఇదంతా తెలుసుకున్న బాధితులు ఏడాదిగా కార్యాలయం చుట్టూ తిరిగి జరిగిన మోసాన్ని రెవెన్యూ అధికారులను అడిగితే పట్టించుకోవటం లేదని భాధితులు వాపోయారు. డబ్బులకు అమ్ముడుపోయిన అధికారులు మండలంలో ఒకరి భూమిని మరొకరికి పాసు పుస్తకాలు పుట్టిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని భాదితలు ఆరోపించారు. మేమే కాదు మాలాంటి బాధితులు మండలంలో ఇంకా ఉన్నారని తెలిపారు. జిల్లా ఉన్నతాధికారులకు తమ సమస్య విన్నవించామని, తమ భూములను తమకు దక్కేలా చూడాలని లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
సీబీఐతో విచారణ చేయించాలి..
మండల రెవెన్యూ కార్యాలయంలో అవినీతి పెచ్చు మీరింది. సీబీఐ చేత విచారణ చేపడితే వారి బాగోతాలు బయట పడతాయి. వాగుమడుగు, అంబాపురం, కాట్రగుంట, తువ్వపాడు, నాగంపల్లి, బచ్చలకూరపాడు, వద్దిమడుగు, వాగుమడుగు గ్రామాల్లో భూముల రికార్డులు తారుమారవుతున్నాయి. వీటన్నింటికి కారణం ప్రస్తుత రెవెన్యూ అధికారుల పనితీరే. డబ్బులకు అమ్ముడు పోయిన అధికారులు పేదల భూములను తారు మారు చేస్తూ వారికి అన్యాయం చేస్తున్నారు. వాగుమడుగులో పశువుల మేత, కొండ పోరంబోకుల భూములు సుమారు 500 ఎకరాలకు పైగా ఉంది. ఆ భూమిపై రెవెన్యూ అధికా రుల కన్న పడింది. దానిని మాయ చేసేస్తారు. ఈ భూ మాయపై త్వరలో ధర్నా చేస్తాం. – పి.జయదేవకుమార్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment