‘దొంగ పాస్ పుస్తకాల’పై విచారణ
Published Wed, Nov 2 2016 11:01 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
వినుకొండ టౌన్: దొంగ పాస్ పుస్తకాల తయారీ, ఆన్‌లైన్ చేయటానికి అందినకాడికి గుంజుతున్నారన్న అరోపణలపై రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్ర దర్యాప్తు చేయనున్నారన్న సమాచారం వినుకొండ ప్రాంతంలోని రెవెన్యూ ఉద్యోగుల్లో బుధవారం కలకలం రేపింది. ఇప్పటి వరకు అప్రతిహాతంగా కొనసాగిస్తున్న అవినీతి బండారం ఎక్కడ బట్టబయలవుతుందోనని రెవెన్యూ సిబ్బందిలో ఆందోళన మొదలైంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో అవినీతి వీఆర్వోలు తమ తప్పులు కప్పి పుచ్చుకోవడానికి అప్పుడే దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ‘సాక్షి’ పత్రికలో వచ్చిన కథనం మేరకు మండల అధికారుల నుంచి ఆర్డీవో ఇప్పటికే కొంత సమాచారం సేకరించినట్లు సమాచారం. దీంతో రెవెన్యూ ఉద్యోగులు ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి తమ మీదకు ఎక్కడ వస్తుందోనని గుమ్మనంగా వ్యవహరిస్తున్నారు. పాస్ పుస్తకాలు, ఆన్‌లైన్ నమోదులో సాక్ష్యాధారాలతో సహా ఓ మహిళా వీఆర్వో అడ్డంగా బుక్కవ్వడం, బాధితులు పోలీసులను ఆశ్రయించడం పట్టణంలో చర్చనీయాంశం అయింది. ఆర్డీవో నిష్పక్షపాతంగా విచారణ చేస్తే రైతులకు మేలు చేసిన వారవుతారని అనుకుంటున్నారు. అవినీతి వీఆర్వోలు, వారికి సహకరించిన అధికారుల భరతం పట్టడం వల్ల పారదర్శకంగా ఆన్‌లైన్‌లో భూ యజమానుల పేర్లు పైసా ఖర్చు లేకుండా ఎక్కించుకోగలమని పేద రైతులు భావిస్తున్నారు.
Advertisement
Advertisement