మంత్రి కేటీఆర్(ఫైల్ ఫొటో)
సాక్షి, రాజన్న సిరిసిల్ల: మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్ కుమార్ జిల్లాలోని బోయినపల్లి మండలం విలాసాగర్‌లో మంగళవారం రైతు బంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, టీడీపీ పాలన రైతులకు చుక్కలు చూపిస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం చెక్కులు ఇస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ళు అధికారంలో ఉండి రైతులకు ఐదు రూపాయల సహాయం చేయలేదని, కానీ నాలుగేళ్ళ టీఆర్ఎస్ పాలనలో నాలుగు వేల చెక్కు ఇస్తున్నామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ పెద్దలు జానారెడ్డి మాటలు వింటే బాదేస్తుందని, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిలా గడ్డం పెంచుకుంటే సన్నాసుల్లో కలుస్తారు తప్ప సమస్యలు పరిష్కారం కావని తెలిపారు. రెండు లక్షల వరకు పంట రుణం మాఫీ చేస్తామంటున్న కాంగ్రెస్ నాయకులకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు. రైతు మోహంలో ఎప్పూడూ సంతోషం ఉండడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
రైతు బంధు పథకంతో దేశానికే తెలంగాణ ఆదర్శంగా మారిందని కేటీఆర్ అన్నారు. దేశంలో హరిత విప్లవానికి తెలంగాణా కేంద్ర బిందువు అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 46 వేల చెరువులు నింపేందుకు మిషన్ కాకతీయ ద్వారా కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 86 ఏళ్ల తర్వాత భూ రికార్డుల ప్రక్షాళన చేసి 60 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్న నాయకుడని కొనియాడారు. తెలంగాణలో కోటి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేసే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment