11వేల ఎకరాలకు అక్రమ పట్టాలు: పరారీలో అధికారులు | ACB Raids Chandampeta Revenue Office In Nalgonda District | Sakshi
Sakshi News home page

11వేల ఎకరాలకు అక్రమ పట్టాలు: పరారీలో అధికారులు

Published Tue, Oct 1 2019 8:41 AM | Last Updated on Tue, Oct 1 2019 8:41 AM

ACB Raids Chandampeta Revenue Office In Nalgonda District - Sakshi

సాక్షి, చందంపేట: చందంపేట మండలంలో గతంలో అక్రమంగా పట్టాలు చేసిన అధికారుల వ్యవహారంపై ఏసీబీ విచారణకు పూనుకుంది. ఈ నేపథ్యంలో చందంపేట రెవెన్యూ కార్యాలయంపై ఏసీబీ నిఘా పెట్టింది. దీంతో రైతు బంధు, రైతు బీమా.. వచ్చేస్తోంది.. కేవలం రూ.20వేలే..రండి బాబు రండి అంటూ అక్రమ పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారుల్లో గుబులు మొదలైంది. ఒకటి కాదు..రెండు కాదు సుమారు 11వేల ఎకరాలకు అక్రమ పట్టాలు ఇచ్చిన అధికారులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. గతంలో కేవలం సస్పెండ్‌ అయిన అధికారులపై ఇప్పుడు క్రిమినల్‌ కేసులు పెడుతున్నారు. అయితే వారంతా ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో ఆయా సెక్షన్ల కింద బెయిల్‌ రాకపోవడంతో భయాందోళన చెందుతున్నారు. చందంపేట మండలంలో 2018–19 సంవత్సరంలో విధులు నిర్వహించిన తహసీల్దార్‌ చాంద్‌పాషా, శ్రీనివాస్‌శంకర్, యూసుఫ్, ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ రవీందర్‌రాజు, వీఆర్వోలు నాగలక్ష్మి, అంజయ్య, యాదయ్య, జూనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనులపై ఇప్పటికే సెక్షన్‌ 409, 419, 420, 464, 465, 468, 34ఐపీసీ సెక్షన్ల కింద చందంపేట పోలీసులు కేసులు నమోదు చేశారు. 

ఏసీబీ విచారణ..
చందంపేట మండలంలో కొంతమంది రాజకీయ నాయకులు పేరున్న నేతలతో కలిసి రెవెన్యూ అధికారులు చేతులు కలిపారని, సుమారు 11వేల ఎకరాలు భూములు లేకున్నా నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేశారని విచారణలో తేలడంతో వారిపై సస్పెన్షన్‌ వేటు పడగా క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పటికే కలెక్టరేట్‌ నుంచి అధికారులు పలు రికార్డులను పరిశీలించారు. ఏసీబీ అధికారులు కూడా రెవెన్యూ అధికారుల నుంచి నూతనంగా పంపిణీ చేయబోయే పట్టాదారు పాస్‌పుస్తకాలను స్వాధీనం చేసుకోగా, అక్రమ పట్టాలను ఆన్‌లైన్‌ నుంచి తొలగిస్తున్నారు. ఏసీబీ అధికారులు ఇప్పటికే రెవెన్యూ అధికారులను పూర్తి నివేదికలను అందించాలని మూడు రోజుల క్రితం విచారించినట్లు తెలుస్తోంది. మంగళవారం హైదరాబాద్‌ ఏసీబీ కార్యాలయానికి హాజరు కావాలని వ్యవసాయ అధికారులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement