chandampeta
-
కళ్ల ముందే అగ్గి భగ్గుమంటోంది. ఏమిటీ మాయా, ఎవరు చేస్తున్నారు?
మిట్ట మధ్యాహ్నం 12 గంటలు దాటిందంటే చాలూ ఆ తండావాసులకు గుండెల్లో దడ మొదలవుతుంది. ఎవరింట్లో దుస్తులు కాలిపోతాయో.. గడ్డివాములు, పశువుల కొట్టాలు తగలబడతాయోనని. సాయంత్రం నాలుగు గంటల వరకు ఇదే తంతు. కంటికి కనిపించరు.. ఇంట్లో మనుషులు ఉన్నా దస్తులు వాటంతట అవే కాలిపోతాయి.. ఊరంతా కాపలాగా ఉన్నా కళ్ల ముందే అగ్గి భగ్గుమంటోంది. ఏమిటీ మాయా..? ఎవరు చేస్తున్నారు..? ఎందుకు చేస్తున్నారు..? ఇది ఎలా సాధ్యం. కేవలం దుస్తులు, గడ్డివాములు, పశువుల కొట్టాలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.? ఇలా ఎన్నో ప్రశ్నలు గిరిజనుల మధిని తొలిచేస్తున్నాయి. సాక్షి, నల్గొండ: నల్లగొండ జిల్లా చందంపేట మండల పరిధిలోని ముర్పుతల గ్రామపంచాయతీ పరిధిలోని పాతఊరితండా మారుమూల ప్రాంతం. సుమారు 200 జనాభా కలిగిన ఈ తండాలో వ్యవసాయమే జీవనాధారం. 22రోజులుగా.. గడిచిన 22 రోజులుగా రోజూ తండాలోని ఒకటి, లేదా రెండు ఇళ్లలో దస్తులు, గడ్డివాములు, పశువుల కొట్టాలు కాలిపోవడం పరిపాటిగా మారింది. మొదట్లో ప్రమాదం అనుకున్నా.. నిత్య ఘటనలతో తండావాసులు ఆందోళన చెందుతున్నారు.పోలీసులను ఆశ్రయించినా.. ఊరంతా కాపలాగా ఉన్నా.. ప్రమాదాలకు ఆగడం లేదు. రెండు, మూడు సందర్భాల్లో పోలీసులు నిఘా ఏర్పాటు చేసినా ఘటనలు ఆగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మంత్రగాడిని పిలిపించి.. గిరిజనులు మాత్రం తండాకు ఎవరో ఏమో చేశారని, అందుకే ఈ అరిష్టాలు జరుగుతున్నాయని బలంగా నమ్ముతున్నారు. ఇటీవల తండాకు ఓ మంత్రగాడిని పిలిపించి రూ.70 వేలు, మూడు యాటపోతులు ముట్టచెప్పి బాగు చేయించాలని కోరారు. అయితే, ఆ మంత్రగాడు చేసిన పూజల రోజు మినహా మిగతా రోజుల్లో ప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాగా, మరో పెద్ద మంత్రగాడిని తీసుకువచ్చి బాగు చేయించుకోవాలనే ఆలోచనలో గిరిజనం ఉన్నట్లు తెలిసింది. కాగా, పోలీసులు మాత్రం ఇదీ.. కావాలనే ఎవరో చేస్తున్నారని, మిస్టరీని త్వరలోనే ఛేదిస్తామని అంటున్నారు. భయం..భయంగా ఉంది రోజు ఏదో ఓ ఇంట్లో బట్టలు కాలిపోతున్నాయి.. ఈ ఘటనలో భయం..భయంగా గడుపుతున్నాం. కొందరు బట్టలు ఇంటిబయట వేసి కాపలా ఉంటున్నారు. మనుషులు చేస్తున్నారా లేదా మరేదైనా కారణం ఉందా అని అధికారులు తేల్చాలి. – మూనావత్ శిరీషా, తండావాసి ఏ క్షణం.. ఏం జరుగుతుందోనని గడ్డివాములు తగలబడుతుండడం, ఏదో ఓ చోట మంటలు వ్యాపించడం లాంటి ఘటనలతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. పోలీసు అధికారులు నిఘా పెట్టి తండావాసుల్లో ధైర్యం నింపాలి. – మూనావత్ లాలు, తండావాసికాపలా ఉంటున్నాం వింత ఘటనతో తండావాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఎవరైనా వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఘటనలకు పాల్పడుతూ భయాందోళనకు గురి చేస్తున్నారా అనే కోణంలో విచారణ జరపాలి. ఇప్పటికే తండాలో కాపలా కాస్తున్నాం. అయినా ఈ వింత ఘటనలు ఆగడం లేదు. – బొల్లు అలివేలు, సర్పంచ్ -
11వేల ఎకరాలకు అక్రమ పట్టాలు: పరారీలో అధికారులు
సాక్షి, చందంపేట: చందంపేట మండలంలో గతంలో అక్రమంగా పట్టాలు చేసిన అధికారుల వ్యవహారంపై ఏసీబీ విచారణకు పూనుకుంది. ఈ నేపథ్యంలో చందంపేట రెవెన్యూ కార్యాలయంపై ఏసీబీ నిఘా పెట్టింది. దీంతో రైతు బంధు, రైతు బీమా.. వచ్చేస్తోంది.. కేవలం రూ.20వేలే..రండి బాబు రండి అంటూ అక్రమ పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారుల్లో గుబులు మొదలైంది. ఒకటి కాదు..రెండు కాదు సుమారు 11వేల ఎకరాలకు అక్రమ పట్టాలు ఇచ్చిన అధికారులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. గతంలో కేవలం సస్పెండ్ అయిన అధికారులపై ఇప్పుడు క్రిమినల్ కేసులు పెడుతున్నారు. అయితే వారంతా ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో ఆయా సెక్షన్ల కింద బెయిల్ రాకపోవడంతో భయాందోళన చెందుతున్నారు. చందంపేట మండలంలో 2018–19 సంవత్సరంలో విధులు నిర్వహించిన తహసీల్దార్ చాంద్‌పాషా, శ్రీనివాస్‌శంకర్, యూసుఫ్, ఇన్చార్జ్ తహసీల్దార్ రవీందర్‌రాజు, వీఆర్వోలు నాగలక్ష్మి, అంజయ్య, యాదయ్య, జూనియర్ అసిస్టెంట్ శ్రీనులపై ఇప్పటికే సెక్షన్ 409, 419, 420, 464, 465, 468, 34ఐపీసీ సెక్షన్ల కింద చందంపేట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏసీబీ విచారణ.. చందంపేట మండలంలో కొంతమంది రాజకీయ నాయకులు పేరున్న నేతలతో కలిసి రెవెన్యూ అధికారులు చేతులు కలిపారని, సుమారు 11వేల ఎకరాలు భూములు లేకున్నా నూతన పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేశారని విచారణలో తేలడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడగా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పటికే కలెక్టరేట్ నుంచి అధికారులు పలు రికార్డులను పరిశీలించారు. ఏసీబీ అధికారులు కూడా రెవెన్యూ అధికారుల నుంచి నూతనంగా పంపిణీ చేయబోయే పట్టాదారు పాస్‌పుస్తకాలను స్వాధీనం చేసుకోగా, అక్రమ పట్టాలను ఆన్లైన్ నుంచి తొలగిస్తున్నారు. ఏసీబీ అధికారులు ఇప్పటికే రెవెన్యూ అధికారులను పూర్తి నివేదికలను అందించాలని మూడు రోజుల క్రితం విచారించినట్లు తెలుస్తోంది. మంగళవారం హైదరాబాద్ ఏసీబీ కార్యాలయానికి హాజరు కావాలని వ్యవసాయ అధికారులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. -
అర్ధరాత్రి యువతి దారుణ హత్య
సాక్షి, చందంపేట : గతంలో భ్రూణ హత్యలు.. ఆడపిల్లల అమ్మకాలకు పుట్టినిల్లుగా ఉన్న నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అందుగుల శిరీష(19) దేవరకొండ పట్టణంలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. చిన్నతనంలోనే తండ్రి పెద్ద ముత్యాలు, అంజమ్మ మృతిచెందారు. సొంత గ్రామమైన పోలేపల్లిలో నాయినమ్మ అందుగుల ఎల్లమ్మ ఇంట్లోనే శిరీష ఉంటోంది. ఈమెకు ఓ సోదరి ఉండగా ఆమెకు వివాహమైంది. శిరీష బాబాయి చిన ముత్యాలు.. భార్య రెండేళ్ల క్రితం అతడిని వదలివెళ్లడంతో హైదరాబాద్‌లో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఆరుబయట నాయినమ్మ మంచంపై నిద్రించగా.. శిరీష కింద పడుకుంది. సుమారు అర్థరాత్రి 12.30 గంటల సమయంలో అందుగుల ఎల్లమ్మ మూత్ర విసర్జనకు వెళ్తుండగా శిరీష రక్తపు మడుగులో పడిఉంది. ఇది చూసిన ఎల్లమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. శిరీష నాయినమ్మ ఎల్ల మ్మ పేరిట ఎకరన్నర భూమి, చిన్న ఇల్లు ఉంది. ఈ ఆస్తి కోసమా.. లేక ప్రేమ వ్యవహారం కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. యువతి దారుణ హత్యకు గురికావడం గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ గ్రామంలో అర్ధరాత్రి జరిగిన యువతి హత్య జరిగిన విషయాన్ని తెలుసుకున్న దేవరకొండ డీఎస్పీ మహేశ్వర్, సీఐ శేఖర్‌రెడ్డి, చందంపేట, నేరెడుగొమ్ము ఎస్ఐలు రామకృష్ణ, పచ్చిపాల పరమేశ్‌తో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువతి మృతదేహంపై పదిహేను చోట్ల గొడ్డలి గాట్లు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అంతకుముందు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. -
ఎన్నికల ప్రకటనే మిగిలింది..
సాక్షి, చందంపేట : ఈనెల 11న లోక్‌సభ ఎన్నికలకు నిర్వాహణకు ఈసీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు మండల పరిషత్ ఎన్నికల పక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఉమ్మడి చందంపేట మండలంలోని నేరెడుగొమ్ము మండల కేంద్రంగా కొత్త మండల పరిషత్ ఏర్పాటుకు ప్రకటన విడుదలైన విషయం తెలిసింది. దీంతో చందంపేట, నేరెడుగొమ్ము మండలాల్లోని 47 పంచాయతీల్లో ఎక్కడ చూసినా లోక్‌సభతో పాటు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల చర్చే గ్రామాల్లో సాగుతోంది. చందంపేట మండల పరిషత్ పరిధిలో రిజర్వేషన్ల పక్రియ ఇప్పటికే పూర్తయింది. కాగా మండలంలో 9 ఎంపీటీసీల పరిధిలో తుది జాబితాను అధికారులు ప్రకటించారు. చందంపేట మండలంలో 43 పోలింగ్ కేంద్రాలు ఉండగా 14,454 మంది పురుషులు, 13,517 మంది స్త్రీలు మొత్తం 27,971 మంది ఓటర్లు ఉన్నారు. నేరెడుగొమ్ము మండలంలో 6 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 25 పోలింగ్ కేంద్రాలు, 9077 మంది పురుషులు 8,717 మంది మంది మహిళలు ఉన్నారు. మొత్తం 17,794 మంది ఓటర్లున్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు.. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం సన్నాహాలు చేస్తున్న అధికారులు తదనుగుణంగా ప్రతిపాదనలు సైతం సిద్ధం చేస్తున్నారు. ప్రతి పంచాయతీలో కనీసం ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఒక్కో బూత్‌లో 600 మంది ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని, ప్రత్యేక అధికారి ఖాసీం వెల్లడించారు. చందంపేట మండలంలో 43, నేరెడుగొమ్ము మండలంలో 25 పోలింగ్ కేంద్రాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఉన్నతాధికారులు సమీక్షించి ఫైనల్ చేయడమే మిగిలింది. -
నిన్న కాంగ్రెస్.. నేడు బీజేపీ
సాక్షి, చందంపేట : లాలునాయక్... పదిహేను రోజుల్లో రెండు కండువాలు మార్చేశారు. మూడు పార్టీలు మారారు. లాలునాయక్ 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి దేవరకొండ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి టికెట్ రాకపోవడంతో అక్టోబర్ 29న జానారెడ్డి, కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక్కడ పరిస్థితి ఆశాజనకం లేదని గ్రహించిన ఆయన గురువారం హైదరాబాద్‌లో ముఖ్యనాయకులతో కలిసి కాశాయం కండువా కప్పుకున్నారు. -
మరో ప్రాణం పోయింది!
ఈ గ్రామ దయనీయ పరిస్థితిని వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ ⇒ కిడ్నీ వ్యాధులతో సంభవిస్తున్న మరణాలపై కథనాలు ⇒ అయినా పట్టించుకోని అధికార యంత్రాంగం ⇒ ఇప్పుడు బాలుడి మృతితో కదలిక ⇒ బుధవారం గువ్వలగుట్టను సందర్శించనున్న అధికారులు ⇒ కిడ్నీ బాధితులపై ఆరా.. నీటి శాంపిళ్లను పరీక్షించాలని నిర్ణయం చందంపేట (దేవరకొండ): కన్న తల్లి దండ్రుల వేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది.. వారి కళ్ల ముందే కొడుకు ప్రాణం గాలిలో కలసిపోయింది.. ఎంత మొరపెట్టుకున్నా.. పత్రికల్లో కథనాలు వచ్చినా.. స్పందించని ప్రభుత్వ యంత్రాంగానికి ఆ చిన్నారి ప్రాణం బలైపోయింది.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్టకు చెందిన మేరావత్ లక్ష్మణ్ (12) మంగళవారం కన్నుమూశాడు. గువ్వలగుట్టలో జనం కిడ్నీ వ్యాధుల కారణంగా వరుసగా మృతి చెందుతున్న వైనంపై, చావు బతుకుల్లో ఉన్న లక్ష్మణ్ పరిస్థితిపై ‘జనం పరిస్థితి అధ్వానం.. ఇది మన ఉద్ధానం’పేరిట పక్షం రోజుల కింద ‘సాక్షి’మాన వీయ కథనాన్ని ప్రచురించింది. అక్కడి జనం పడుతున్న బాధలను వివ రించింది. కానీ అధికార యంత్రాంగంలో స్పందన కనిపించలేదు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న లక్ష్మణ్ మంగళవారం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న వైద్యారోగ్య శాఖ బృందం బుధవారం గువ్వలగుట్టను సందర్శించాలని నిర్ణయించింది. ఎన్నిసార్లు గోడు వెళ్లబోసుకున్నా..గువ్వలగుట్ట రోగాల పుట్టగా మారి పోతోంది. కిడ్నీ వ్యాధులు మెల్లమెల్లగా ఆ గ్రామాన్నే కబళించేస్తున్నాయి. ఇక్కడి నీటిలోని రసాయనాల కారణంగా ఈ దుస్థితి తలెత్తిందని ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. కానీ ఫలితం కనిపించలేదు. ఈ గ్రామం దుస్థితిపై ‘సాక్షి’ఎన్నో కథనాలను ప్రచు రించింది. ఆరు నెలల క్రితం ‘గువ్వలగుట్ట.. రోగాల పుట్ట’అన్న శీర్షికన గువ్వలగుట్టలో కిడ్నీ వ్యాధి మరణాలు, బాధితుల దీన స్థితిపై కథనాన్ని ప్రచురించింది. కిడ్నీ వ్యాధుల బారినపడి జనం పిట్టల్లా రాలిపోతున్న వైనాన్ని వివరించింది. వ్యాధులతో బాధపడుతూ, లక్షలకు లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించుకున్నా ఫలితం లేనివారి ఆందోళనను తెలిపింది. వారితోపాటు లక్ష్మణ్ పరిస్థితిని, తల్లి దండ్రుల ఆవేదనను కూడా వివరించింది. అయినా అధికార యంత్రాంగంలో స్పందన కానరాలేదు. సురక్షిత నీరు అందేదెన్నడు? గువ్వలగుట్టకు అతి సమీపంలోనే ఉన్న కృష్ణా బ్యాక్‌వాటర్ నుంచి మంచినీటిని ఈ గ్రామానికి అందించేందుకు చేపట్టిన పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. ట్యాంకులు నిర్మించి, పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసే పను లను మొదలుపెట్టి.. అర్ధంతరంగా వదిలే శారు. దాదాపు ఏడాదిగా కదలిక లేదు. నేడు గువ్వలగుట్టకు వైద్యారోగ్య శాఖ బృందం నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని గువ్వలగుట్టను బుధవారం వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధి బృందం సందర్శించనుంది. కిడ్నీ వ్యాధులతో ఇక్కడి జనం అవస్థలపై కథనాలు, మంగళవారం లక్ష్మణ్ అనే బాలుడి మృతి నేపథ్యంలో.. అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. వైద్యారోగ్య శాఖ బృందం బుధవారం గువ్వలగుట్టకు చేరుకుని కిడ్నీ వ్యాధుల బాధితులతో మాట్లాడతారు. వారి సమస్యలు తెలుసుకుని.. ఇక్కడి బోరుబావులు, నీటి పంపులను పరిశీలిస్తారు. నీటి శాంపిళ్లను సేకరించి ప్రయోగశాలకు పంపుతారు. చీఫ్ వాటర్ అనలిస్ట్ డాక్టర్ ఆంజనేయులు, సీనియర్ అనాలసిస్ట్ డాక్టర్ కిరణ్మయి ఈ బృందంలో ఉంటారు. -
అపురూపమైన దృశ్యాలకు కేరాఫ్ చందంపేట
చందంపేట అంటేనే గుర్తుకొచ్చేది.. మారుమూల అటవీ ప్రాంతమని..! సామాజిక వెనుకబాటుకు, శిశు విక్రయాలకు కేరాఫ్ అని. అత్యధిక గిరిజనులున్న మండలం అని..!! కానీ, బాహ్య ప్రపంచానికి తెలియని రహస్యాలున్నాయని, చిత్రవిచిత్రమైన దృశ్యాలున్నాయని కొందరికే ఎరక. ఒళ్లు గగుర్పొడిచే గుహలు, అరకును తలపించే అందాలు, ఆధ్మాత్మికతకు నెలవైన ఆలయాలు, అలరించే కోటి తాటివనాలు, బృహత్కాలం నాటి సమాధులు.. ఇలా మరెన్నో ఈ పేటకు మరో కోణంగా ఉన్నాయని ఇప్పుడిప్పుడే తెలుసు. పుష్కరాల నేపథ్యంలో ప్రత్యేకతను సంతరించుకోనున్నాయి.. ఆయా అంశాలు. –దేవరకొండ దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో విస్తరించి ఉన్న చందంపేట మండలం అన్ని విధాలా వెనుకబడిన ప్రాంతం. సామాజిక వెనుకబాటుకు గురైన ఈ మండంలో గిరిజనులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ శిశు విక్రయాలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. ఇదంతా ఒక ఎత్తయితే ఈ మండలం కృష్ణా పరివాహక ప్రాంతంలో సుమారు 50 కిలో మీటర్ల మేర ఉండడం మరో ఎత్తు. నక్కలగండి ప్రాజెక్టు పురుడు పోసుకుంటున్న చందంపేట మండలంలో మరో కోణం కూడా ఉంది. గాజుబిడం గుహలు, దేవరచర్ల మునిస్వామి ఆలయంతో పాటు ఆశ్చర్యం కొలిపే దృశ్యాలు అనేకం ఉన్నాయి. ఈనెల 12 నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు జరగనున్న కృష్ణా పుష్కరాల కోసం మండలంలోని కాచరాజుపల్లి, పెద్దమునిగల్ బ్యాక్ వాటర్ ప్రాంతంలో రెండు పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడికి వచ్చే భక్తులకు అనేక దృశ్యాలు కనువిందు చేయనున్నాయి తెలంగాణలో వైజాగ్ తెలంగాణలో వైజాగ్ ఏంటి అనుకుంటున్నారా ? కాచరాజుపల్లి ఘాట్ సమీపంలో ఈ కాలనీ ఉంది. వైజాగ్ ప్రాంతానికి చెందిన కొన్ని కుటుంబాలు చేపల వేటలో భాగంగా దాదాపు యాబై ఏళ్ల క్రితం సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. అందుకే ఈ కాలనీకి వైజాగ్ కాలనీ అని పేరొచ్చింది. తాజా చేపలు కావాలన్నా, చేపల పులుసు తినాలన్నా ఇక్కడకు వెళ్లాల్సిందే. ఈ కాలనీ నుంచి ఇతర ప్రాంతాలకు చేపలు ఎగుమతి చేస్తుంటారు. వీరు తెలంగాణలో ఉన్న ఆంధ్రా ప్రాంతంతో మంచి సంబంధాలున్నాయి. కోటి తాటి వనాలు.. చందంపేట మండలంలో అటవీ ప్రాంతమే కాదు తాటి వనాలు కూడా అలరిస్తాయి. చిత్రియాల పరిధిలో సుమారు 500 ఎకరాల పరిధిలో చుట్టూ గుట్టల నడుమ తాటి వనమే ఉంది. ఇక్కడ కోటి తాటి చెట్లు ఉన్నట్లు ఇక్కడి గ్రామస్తులు చెబుతుంటారు. అందుకే ఈ వనాన్ని కోటి తాటి అంటారు. వందల ఏళ్ల మామిడి.. చిత్రియాల అటవీ ప్రాంతంలో ఉన్న ఓ మామిడి చెట్టుకు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఈ చెట్టు వయస్సు కచ్చితంగా తెలియకపోయినా శతాబ్దాలనాటిదని పూర్వీకులు చెబుతుంటారు. దీని ఎత్తు, వ్యాసార్థం ఎంతో తెలుసా? సుమారు 100 మీటర్ల ఎత్తు, ఏడు మంది దాని చుట్టూ చేతులు చాచి నిలబడినా అందనంత వ్యాసార్థం. అంటే దాదాపు 14 మీటర్ల వెడల్పు ఉంటుంది. నక్కలగండి టన్నెల్ దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీశైలం నుంచి జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో చేపట్టిందే నక్కలగండి టన్నెల్. శ్రీశైలం నుంచి నక్కలగండి వరకు సుమారు 43 కిలో మీటర్ల మేర అటవీ మార్గం నుంచి ఈ సొరంగాన్ని తవ్వుతున్నారు. సుమారు 28 కిలో మీటర్ల మేర ఈ టన్నెల్ పూర్తి కాగా, టన్నెల్–2 ఏడు కిలో మీటర్లు పూర్తయింది. బృహత్ కాలం నాటి సమాధులు ఇటీవల చందంపేట మండలంలో పర్యటించిన పురావస్తుశాఖ అధికారులు ఇక్కడ బృహత్ కాలం నాటి సమాధులు ఉన్నట్లు గుర్తించారు. వందల ఏళ్ల కాలం నాటి ఈ సమాధులు ప్రస్తుతం పుష్కర ఘాట్లు నిర్మిస్తున్న పెద్దమునిగల్, కాచరాజుపల్లి, వైజాగ్ కాలనీ పరిధిలో ఉన్నాయి. చిత్రవిచిత్రాల భద్రగిరి బానాలపట్నం చిత్రియాల గ్రామానికి మరో పేరు చిత్రవిచిత్రాల భద్రగిరి బానాలపట్నం. ఇక్కడ కోట బురుజుతో పాటు రాజులు పరిపాలించిన ఆనవాళ్లు చాలా ఉన్నాయి. ఇక్కడ గుప్త నిధుల కోసం చాలా చోట్ల తవ్వకాలు జరిపారు. ఈ ప్రాంతం నుంచి ఓ బావి ద్వారా శ్రీశైలానికి సొరంగమార్గం ఉన్నట్లు గ్రామస్తులు చెబుతుంటారు. ఇక్కడి అటవీ ప్రాంతాల్లో వందల ఏళ్ల కాలం నాటి పురాతన ఆలయాలతో పాటు అక్కడక్కడా దేవతల విగ్రహాలు, పెద్దపెద్ద బండలపై చెక్కిన చిత్రాలు కనిపిస్తుస్తాయి. వీటి ఆధారంగా ఈ ప్రాంతానికి ప్రాచీన నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. -
భార్యను కొట్టాడని..
చందంపేట : భార్యను చిత్రహింసలు పెడుతున్నాడని, భార్య తరఫు బంధువులు ఆ భర్తను చితకబాదారు. ఈ ఘటన చందంపేట మండలం తెల్దేవర్పల్లి గ్రామపంచాయతీ పరిధి నక్కలగండితండాలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నక్కలగండితండాకు చెందిన మోతీలాల్, తెల్దేవర్పల్లి గ్రామానికి చెందిన సునిత దంపతులు. వీరికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. నక్కలగండితండాలో ఉంటూ రోజూ వారీ కూలీగా చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా మద్యానికి బానిసైన మోతీలాల్ ఇటీవల తరచూ భార్యను వేధిస్తుండేవాడు. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి భార్య సునితపై చేయిచేసుకున్నాడు. దీంతో విషయం తెలిసిన సునిత తరఫు బంధువులు ఆగ్రహించి మోతీలాల్పై దాడిచేసి చితకబాదారు. గాయపడిన మోతీలాల్‌ను చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.ఇరువర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు