శిరీష మృతదేహం
సాక్షి, చందంపేట : గతంలో భ్రూణ హత్యలు.. ఆడపిల్లల అమ్మకాలకు పుట్టినిల్లుగా ఉన్న నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అందుగుల శిరీష(19) దేవరకొండ పట్టణంలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. చిన్నతనంలోనే తండ్రి పెద్ద ముత్యాలు, అంజమ్మ మృతిచెందారు. సొంత గ్రామమైన పోలేపల్లిలో నాయినమ్మ అందుగుల ఎల్లమ్మ ఇంట్లోనే శిరీష ఉంటోంది. ఈమెకు ఓ సోదరి ఉండగా ఆమెకు వివాహమైంది. శిరీష బాబాయి చిన ముత్యాలు.. భార్య రెండేళ్ల క్రితం అతడిని వదలివెళ్లడంతో హైదరాబాద్‌లో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఆరుబయట నాయినమ్మ మంచంపై నిద్రించగా.. శిరీష కింద పడుకుంది. సుమారు అర్థరాత్రి 12.30 గంటల సమయంలో అందుగుల ఎల్లమ్మ మూత్ర విసర్జనకు వెళ్తుండగా శిరీష రక్తపు మడుగులో పడిఉంది.
ఇది చూసిన ఎల్లమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. శిరీష నాయినమ్మ ఎల్ల మ్మ పేరిట ఎకరన్నర భూమి, చిన్న ఇల్లు ఉంది. ఈ ఆస్తి కోసమా.. లేక ప్రేమ వ్యవహారం కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. యువతి దారుణ హత్యకు గురికావడం గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
గ్రామంలో అర్ధరాత్రి జరిగిన యువతి హత్య జరిగిన విషయాన్ని తెలుసుకున్న దేవరకొండ డీఎస్పీ మహేశ్వర్, సీఐ శేఖర్‌రెడ్డి, చందంపేట, నేరెడుగొమ్ము ఎస్‌ఐలు రామకృష్ణ, పచ్చిపాల పరమేశ్‌తో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువతి మృతదేహంపై పదిహేను చోట్ల గొడ్డలి గాట్లు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అంతకుముందు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment