అపురూపమైన దృశ్యాలకు కేరాఫ్‌ చందంపేట | Outstanding scenes c/o chandampeta | Sakshi
Sakshi News home page

అపురూపమైన దృశ్యాలకు కేరాఫ్‌ చందంపేట

Published Mon, Aug 8 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

అపురూపమైన దృశ్యాలకు కేరాఫ్‌ చందంపేట

అపురూపమైన దృశ్యాలకు కేరాఫ్‌ చందంపేట

చందంపేట అంటేనే గుర్తుకొచ్చేది.. మారుమూల అటవీ ప్రాంతమని..! సామాజిక వెనుకబాటుకు, శిశు విక్రయాలకు కేరాఫ్‌ అని. అత్యధిక గిరిజనులున్న మండలం అని..!! కానీ, బాహ్య ప్రపంచానికి తెలియని రహస్యాలున్నాయని, చిత్రవిచిత్రమైన దృశ్యాలున్నాయని కొందరికే ఎరక. ఒళ్లు గగుర్పొడిచే గుహలు, అరకును తలపించే అందాలు, ఆధ్మాత్మికతకు నెలవైన ఆలయాలు, అలరించే కోటి తాటివనాలు, బృహత్‌కాలం నాటి సమాధులు.. ఇలా మరెన్నో ఈ పేటకు మరో కోణంగా ఉన్నాయని ఇప్పుడిప్పుడే తెలుసు. పుష్కరాల నేపథ్యంలో ప్రత్యేకతను సంతరించుకోనున్నాయి.. ఆయా అంశాలు. 
–దేవరకొండ
దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో విస్తరించి ఉన్న చందంపేట మండలం అన్ని విధాలా వెనుకబడిన ప్రాంతం. సామాజిక వెనుకబాటుకు గురైన ఈ మండంలో గిరిజనులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ శిశు విక్రయాలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. ఇదంతా ఒక ఎత్తయితే ఈ మండలం కృష్ణా పరివాహక ప్రాంతంలో సుమారు 50 కిలో మీటర్ల మేర ఉండడం మరో ఎత్తు. నక్కలగండి ప్రాజెక్టు పురుడు పోసుకుంటున్న చందంపేట మండలంలో మరో కోణం కూడా ఉంది.  గాజుబిడం గుహలు, దేవరచర్ల మునిస్వామి ఆలయంతో పాటు ఆశ్చర్యం కొలిపే దృశ్యాలు అనేకం ఉన్నాయి.  ఈనెల 12 నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు జరగనున్న కృష్ణా పుష్కరాల కోసం మండలంలోని కాచరాజుపల్లి, పెద్దమునిగల్‌ బ్యాక్‌ వాటర్‌ ప్రాంతంలో రెండు పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడికి వచ్చే భక్తులకు అనేక దృశ్యాలు కనువిందు చేయనున్నాయి
తెలంగాణలో వైజాగ్‌  
తెలంగాణలో వైజాగ్‌ ఏంటి అనుకుంటున్నారా ? కాచరాజుపల్లి ఘాట్‌ సమీపంలో ఈ కాలనీ ఉంది. వైజాగ్‌ ప్రాంతానికి చెందిన కొన్ని కుటుంబాలు చేపల వేటలో భాగంగా దాదాపు యాబై ఏళ్ల క్రితం సాగర్‌ బ్యాక్‌ వాటర్‌ ప్రాంతానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. అందుకే ఈ కాలనీకి వైజాగ్‌ కాలనీ అని పేరొచ్చింది. తాజా చేపలు కావాలన్నా, చేపల పులుసు తినాలన్నా ఇక్కడకు వెళ్లాల్సిందే. ఈ కాలనీ నుంచి ఇతర ప్రాంతాలకు చేపలు ఎగుమతి చేస్తుంటారు. వీరు తెలంగాణలో ఉన్న ఆంధ్రా ప్రాంతంతో మంచి సంబంధాలున్నాయి. 
కోటి తాటి వనాలు..
చందంపేట మండలంలో అటవీ ప్రాంతమే కాదు తాటి వనాలు కూడా అలరిస్తాయి.  చిత్రియాల పరిధిలో సుమారు 500 ఎకరాల పరిధిలో చుట్టూ గుట్టల నడుమ తాటి వనమే ఉంది. ఇక్కడ కోటి తాటి చెట్లు ఉన్నట్లు ఇక్కడి గ్రామస్తులు చెబుతుంటారు. అందుకే  ఈ వనాన్ని కోటి తాటి అంటారు. 
వందల ఏళ్ల మామిడి..
చిత్రియాల అటవీ ప్రాంతంలో ఉన్న ఓ మామిడి చెట్టుకు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఈ చెట్టు వయస్సు కచ్చితంగా తెలియకపోయినా శతాబ్దాలనాటిదని పూర్వీకులు చెబుతుంటారు. దీని ఎత్తు, వ్యాసార్థం ఎంతో తెలుసా? సుమారు 100 మీటర్ల ఎత్తు, ఏడు మంది దాని చుట్టూ చేతులు చాచి నిలబడినా అందనంత వ్యాసార్థం. అంటే దాదాపు 14 మీటర్ల వెడల్పు ఉంటుంది.  
నక్కలగండి టన్నెల్‌ 
దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీశైలం నుంచి జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో చేపట్టిందే నక్కలగండి టన్నెల్‌. శ్రీశైలం నుంచి నక్కలగండి వరకు సుమారు 43 కిలో మీటర్ల మేర అటవీ మార్గం నుంచి ఈ సొరంగాన్ని తవ్వుతున్నారు. సుమారు 28 కిలో మీటర్ల మేర ఈ టన్నెల్‌ పూర్తి కాగా, టన్నెల్‌–2  ఏడు కిలో మీటర్లు పూర్తయింది. 
బృహత్‌ కాలం నాటి సమాధులు 
ఇటీవల చందంపేట మండలంలో పర్యటించిన పురావస్తుశాఖ అధికారులు ఇక్కడ బృహత్‌ కాలం నాటి సమాధులు ఉన్నట్లు గుర్తించారు. వందల ఏళ్ల కాలం నాటి ఈ సమాధులు ప్రస్తుతం పుష్కర ఘాట్లు నిర్మిస్తున్న పెద్దమునిగల్, కాచరాజుపల్లి, వైజాగ్‌ కాలనీ పరిధిలో ఉన్నాయి.   
 చిత్రవిచిత్రాల భద్రగిరి బానాలపట్నం 
చిత్రియాల గ్రామానికి మరో పేరు చిత్రవిచిత్రాల భద్రగిరి బానాలపట్నం. ఇక్కడ కోట బురుజుతో పాటు రాజులు పరిపాలించిన ఆనవాళ్లు చాలా ఉన్నాయి. ఇక్కడ గుప్త నిధుల కోసం చాలా చోట్ల తవ్వకాలు జరిపారు. ఈ ప్రాంతం నుంచి ఓ బావి ద్వారా శ్రీశైలానికి సొరంగమార్గం ఉన్నట్లు గ్రామస్తులు చెబుతుంటారు. ఇక్కడి అటవీ ప్రాంతాల్లో వందల ఏళ్ల కాలం నాటి పురాతన ఆలయాలతో పాటు అక్కడక్కడా దేవతల విగ్రహాలు, పెద్దపెద్ద బండలపై చెక్కిన చిత్రాలు కనిపిస్తుస్తాయి. వీటి ఆధారంగా ఈ ప్రాంతానికి ప్రాచీన నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది.
 
 
 
  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement