నల్లమలలో అరుదైన చింకారా | A rare Chinkara in Nallamala | Sakshi
Sakshi News home page

నల్లమలలో అరుదైన చింకారా

Published Thu, Sep 5 2024 4:26 AM | Last Updated on Thu, Sep 5 2024 4:26 AM

A rare Chinkara in Nallamala

అంతరించిపోయే దశలో ఉన్న ఇండియన్‌ గజల్‌ 

మనుషులు కన్పిస్తేనే హడలిపోయే చింకారా 

మానవ సంచారం, వేటతో అతిచిన్న జింక జాతి మనుగడకు ముప్పు 

నల్లమల అడవిలో వదులుతున్న పశువుల మందతోనూ పొంచి ఉన్న ప్రమాదం

సాక్షి, నాగర్‌కర్నూల్‌: నాజూకైన శరీరం, బెదురు కళ్లు, రింగులు తిరిగిన కొమ్ములతో కృష్ణజింకలను పోలి ఉండే చింకారా అరుదైన వన్యప్రాణుల్లో ఒకటి. దేశంలో అరుదుగా కన్పి0చే ఈ ఇండియన్‌ గజల్‌ ఎక్కువగా గుజరాత్‌లో కొంతభాగం విస్తరించిన థార్‌ ఎడారితో పాటు కర్ణాటకలోని యాడహల్లి అభయారణ్యంలో మాత్రమే కన్పిస్తాయి. 

ఇలాంటి అరుదైన చింకారాల గెంతులకు నల్లమల అటవీప్రాంతం నెలవైంది. నల్లమలలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలోని మద్దిమడుగు రేంజ్‌లో పదుల సంఖ్యలో చింకారాలు ఉన్నాయి. అయితే అతి సున్నితమైన చింకారాల మనుగడకు వేట, మానవసంచారం రూపంలో ముప్పు పొంచి ఉంది.  

అంతరించిపోతున్న దశలో చింకారా జాతి 
దేశంలోనే అరుదైన చింకారా జాతి జింకలు అంతరించిపోతున్న దశలో ఉన్నాయి. దట్టమైన అడవిలో కాకుండా పూర్తిగా గడ్డి మైదానాలు, పొదలతో కూడిన అడవుల్లో నివసించేందుకే చింకారాలు ఇష్టపడతాయి. జనావాసాలు, మనుషులకు ఇవి దూరంగా ఉంటాయి. మనుషులు కన్పిస్తే చాలు భయంతో బెదిరిపోతాయి. 

చిన్నచిన్న శబ్దాలకు కూడా గజగజ వణికిపోతాయి. అతి సున్నితమైన ఈ జీవులకు వేట, మానవ సంచారం, ఇతర జంతువులతో ముప్పు ఉందని అటవీ అధికారులు చెబుతున్నారు. పులుల సంతతి పెరిగేందుకు, జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో చింకారాలు కీలకంగా పని చేస్తాయి. ఈ ప్రాంతాల్లో మానవ సంచారాన్ని తగ్గించేందుకు, వేటను నివారించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

చింకారాలు అతి సున్నితమైనవి 
దేశంలో అరుదైన చింకారాలు నల్లమలలో ఉన్నాయి. జింక జాతికి చెందిన ఈ ప్రాణులు అతి సున్నితమైనవి. మనుషులు కని్పస్తే బెదిరిపోతాయి. పులుల సంతతి పెరిగేందుకు, జీవవైవిధ్యంలో వీటి పాత్ర కీలకం. నల్లమలలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో వీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం.  – రోహిత్‌ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్‌కర్నూల్‌ జిల్లా

జనసంచారం, ఆవుల మందలతో ముప్పు
నల్లమలలోని మద్దిమడుగు అటవీరేంజ్‌ పరిధిలో చింకారాల ఉనికి కన్పిస్తుండగా, ఈ ప్రాంతంలో జనసంచారం క్రమంగా పెరుగుతోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం పబ్బతి ఆంజనేయస్వామి ఆలయానికి ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువగా భక్తుల తాకిడి ఉంటుంది. 

నల్లమలలో వేలసంఖ్యలో వదులుతున్న ఆవుల మందలతో కూడా చింకారాలకు ముప్పు పొంచి ఉంది. చిన్నచిన్న మొక్కలు, నేలపై తక్కువ ఎత్తులో ఉండే గడ్డి మాత్రమే చింకారాల ఆహారం కాగా, ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో సంచరిస్తున్న ఆవుల మందలతో ఆహారపు పోటీ నెలకొంది. ఆవులను మేపేందుకు స్థానిక గ్రామాల నుంచి కాకుండా నల్లగొండలోని కంబాలపల్లి, చందంపేట పరిసర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో ఆవుల మందలను కృష్ణాతీరంలోని నల్లమలలో వదులుతున్నారు. 

జంతువుల నుంచి వన్యప్రాణులకు సంక్రమించే జూనోసిస్‌ వ్యాధులకు చింకారాలు లోనయ్యే అవకాశం ఉంది. అరుదైన చింకారాల సంరక్షణకు అటవీశాఖ, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement