నాడు వైఎస్సార్‌.. నేడు నేను.. ఇది దేవుడి రాసిన స్క్రిప్ట్‌: సీఎం జగన్‌ | CM YS Jagan Prakasam And Veligonda Tour Live Updates | Sakshi
Sakshi News home page

వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్‌

Published Wed, Mar 6 2024 9:07 AM | Last Updated on Wed, Mar 6 2024 1:04 PM

CM YS Jagan Prakasam And Veligonda Tour Live Updates - Sakshi

Live Updates..

వెలిగొండ ప్రాజెక్ట్‌ ప్రారంభం అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్ట్‌తో దశాబ్ధాల కల నెరవేరింది. టన్నెల్‌లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించింది. అద్భుతమైన ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది. 

మహానేత వైఎస్సార్‌ వెలిగొండ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. ఆయన కుమారుడిగా ఈ ప్రాజెక్ట్‌ను నేనే పూర్తి చేయడం గర్వంగా ఉంది. ఇది దేవుడి రాసిన స్క్రిప్ట్‌. ఈ ప్రాజెక్ట్‌తో 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాం. ఈ టెన్నల్‌ వల్ల ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. వెలిగొండ ప్రాజెక్ట్‌తో నాలుగు లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. 

నెరవేరిన 20 ఏళ్ల కల

  • నాడు తండ్రి వైఎస్సార్‌ శంకుస్థాపన..
  • నేడు కొడుకుగా సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌ ప్రారంభోత్సవం

వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్‌

  • యుద్ధ ప్రాతిపదికన వెలిగొండ ప్రాజెక్ట్‌ జంట సొరంగాలు పూర్తి
  • ఆసియాలోనే  అత్యంత పొడవైన సొరంగాలను పూర్తి చేసిన ప్రభుత్వం
  • ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్‌

♦ వెలిగొండ చేరుకున్న సీఎం జగన్‌

♦ వెలిగొండ ప్రాజెక్ట్‌ వద్దకు బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. 

♦ కాసేపట్లో వెలిగొండ ప్రాజెక్ట్‌ టెన్నెన్‌ను జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్‌. 

♦ సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌ను సీఎం జగన్‌ జాతికి అంకితం చేస్తారు.

♦ మొదట దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లికి సీఎం జగన్‌ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్ర­మాల్లో పాల్గొని పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం వ్యూ పాయింట్‌ నుంచి వెలిగొండ ప్రాజెక్ట్‌ను, రెండో టన్నెల్‌ను పరిశీలి­స్తారు. 

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్‌..
♦ 2019లో వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి  నుంచి వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయడంపై ప్రత్యేక  దృష్టిపెట్టారు. గత 58 నెలల పాలనలో దాదాపు రెండేళ్లు కరోనావల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినాసరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిమీల పనులను 2019, నవంబరులో ప్రారంభించి.. 2021, జనవరి 13 నాటికి పూర్తిచేయించారు. 2014–19 మధ్య టీడీపీ సర్కార్‌ హయాంలో మొదటి సొరంగంలో రోజుకు సగటున 2.41 మీటర్ల మేర తవ్వితే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవ్వడం గమనార్హం. అలాగే, శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి మొదటి సొరంగం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదలచేసే హెడ్‌ రెగ్యులేటర్‌ పనులను అదే ఏడాది పూర్తిచేయించారు. 

♦ ఇక రెండో సొరంగం మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు సీఎం రమేష్‌కు కట్టబెట్టి, ప్రజాధనాన్ని దోచిపెట్టారు. వాటిని రద్దుచేసిన సీఎం జగన్‌.. రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి టీడీపీ సర్కార్‌ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తిచేసేందుకు ముందుకొచ్చిన ‘మేఘా’ సంస్థకు 7.698 కి.మీ.ల సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు.  

♦రెండో సొరంగంలో టీబీఎంకు కాలం చెల్లడంతో.. రోజుకు ఒక మీటర్‌ పని జరగడం కూడా కష్టంగా మారింది. దాంతో 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికా­రులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద సొరంగాలను తవ్వి.. అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్వించేలా పనులు చేపట్టారు.

మంగళవారం నాటికి రెండో సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయి. 7.685 కి.మీల పొడవున తవ్వకం పనులు, హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు కూడా పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చేలోగా టీబీఎంను సొరంగం నుంచి బయటకు తీయనున్నారు. మరోవైపు.. 2014–19 మధ్య చంద్ర­బాబు సర్కార్‌ హయాంలో రెండో సొరంగం రోజుకు సగటున 1.31 మీటర్ల మేర తవ్వితే.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రోజుకు 7.25 మీటర్లు (టీబీఎం ద్వారా 1.45, మనుషుల ద్వారా 6.80 మీటర్లు) తవ్వడం గమనార్హం. 

♦ఇక టీడీపీ సర్కార్‌ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన తీగలేరు హెడ్‌ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ పనులను చేపట్టిన సీఎం వైఎస్‌ జగన్‌ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయిస్తున్నారు. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించనున్నారు.

♦ ప్రాజెక్టు పనులకు ఇప్పటివరకూ రూ.978.02 కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌ ఖర్చుచేశారు. ప్రాజెక్టు పనులకు పెట్టిన ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని.. శరవేగంగా పూర్తిచేయించారు. 

నల్లమలసాగర్‌.. ఓ ఇంజినీరింగ్‌ అద్భుతం
ప్రకాశం జిల్లాలో విస్తరించిన నల్లమల పర్వత శ్రేణులకు సమాంతరంగా వెలుపల ఉన్న కొండలను వెలిగొండలు అంటారు. వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియ వద్ద కొండల మధ్య ఖాళీ ప్రదేశాల (గ్యాప్‌)ను కలుపుతూ 373.5 మీటర్ల పొడవు, 63.65 మీటర్ల ఎత్తు (సుంకేశుల డ్యామ్‌)తో.. 587 మీటర్ల పొడవు, 85.9 మీటర్ల ఎత్తు (గొట్టిపడియ డ్యామ్‌)తో 356 మీటర్ల పొడవు, 57 మీటర్ల ఎత్తు (కాకర్ల డ్యామ్‌)తో మూడు డ్యామ్‌లు నిర్మించడంతో నల్లమల పర్వత శ్రేణులు, వెలిగొండ కొండల మధ్య 62.40 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో 53.85 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నల్లమలసాగర్‌ సహజసిద్ధంగా రూపుదిద్దుకుంది.

ఇదో ఇంజినీరింగ్‌ అద్భుతమని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. నల్లమలసాగర్‌ పనులను మహానేత వైఎస్‌ పూర్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొల్లంవాగు ద్వారా రోజుకు 11,583 క్యూసెక్కులు తరలించేలా కొల్లంవాగు కుడి వైపునున్న కొండను తొలచి, రెండు సొరంగాలు (టన్నెల్‌–1 ద్వారా 3,001 క్యూసెక్కులు, టన్నెల్‌–2 ద్వారా 8,582 క్యూసెక్కులు) తవ్వి.. ఫీడర్‌ ఛానల్‌ ద్వారా నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను తరలిస్తారు. వెలిగొండ ప్రాజెక్టులో 18.8 కి.మీ.ల పొడవున తవ్విన రెండు సొరంగాలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద నీటిపారుదల సొరంగాలు కావడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement