కూకట్‌పల్లి ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు
♦ రూ. 2.9 కోట్ల విలువజేసే ఆస్తులున్నట్లు గుర్తింపు
♦ ఏసీపీ సంజీవరావు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కూకట్‌పల్లి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజీవరావును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఆయన కార్యాలయంతో పాటు బంధువుల ఇళ్లలో శనివారం ఏకకాలంలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు 2.9 కోట్ల విలువైన ఆస్తులున్నట్టుగా గుర్తించారు. బాలానగర్ హస్మత్‌పేటలోని సంజీవరావు నివాసంతో పాటు హైదరాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలోని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే కూకట్‌పల్లిలోని ఏసీపీ కార్యాలయంలోనూ దాడులు చేశారు.
ఈ సోదాల్లో బాలానగర్‌లోని హస్మత్‌పేటలో కమర్షియల్ కాంప్లెక్స్, సికింద్రాబాద్ కార్ఖానాలోని ఓల్డ్ వాసవి కాలనీలో మూడు ఫ్లాట్‌లు, మెదక్ జిల్లాలోని ములుగు మండలం కొత్యాల గ్రామం ఆలీనగర్‌లో 36.09 ఎకరాల వ్యవసాయ భూమి, రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలోని కేశవరంలో తొమ్మిది ఎకరాల 18 గుంటల వ్యవసాయ భూమితో పాటు ఓ ఫామ్‌హౌస్, వరంగల్ జిల్లాలోని బచ్చన్నపేటలో 44.12 ఎకరాల వ్యవసాయ భూమి, ఏపీ10 ఏఎం 2277 నంబర్ గల స్విఫ్ట్ కారు, టీఎస్03 ఏడీ 3366 నంబర్ గల హోండా సిటీ కారు, 750 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.3.29 లక్షల నగదు ఆస్తులున్నట్లు గుర్తించామని ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే ఈ ఆస్తుల విలువ మార్కెట్లో రూ.13 కోట్లపైనే ఉంటుందని అంటున్నారు.
అక్రమార్జనలో ఈ ఏసీపీ తీరే వేరు....
అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఎస్‌హెచ్‌ఓల పరిధిలోని కేసుల్లోనూ తలదూర్చడమే కాకుండా ఇష్టారాజ్యంగా అక్రమార్జనకు పాల్పడినట్లు కూకట్‌పల్లి ఏసీపీ సంజీవరావుపై ఎన్నో ఆరోపణలున్నాయి. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని వివాదాస్పద నిర్మాణాల్లో తలదూర్చి అందిన కాడికి దండుకునేవాడని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ ఏసీపీ పరిధిలోనిది కావడంతో అనేక కేసుల్లో డబ్బులు డిమాండ్ చేసి రాజీకుదిర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు కేసుల్లో ఈయనకు చెందిన ఓ బినామీ పాత్ర కీలకంగా ఉండటం గమనార్హం.
ఫాంహౌస్‌లోనూ సోదాలు...
శామీర్‌పేట్: మండల పరిధి కేశవరంలో సంజీవరావుకు సంబంధించిన ఓ ఫాంహౌస్‌లో ఏసీబీ రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ప్రభాకర్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. కూకట్‌పల్లి ఏసీపీకి సంబంధించిన భూములు బినామీ పేర్ల మీద కేశవరంలో ఉన్నాయని తెలిపారు. గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 29లో సంజీవరావుకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలోని గెస్ట్‌హౌస్‌లో సోదాలు చేసి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. సర్వే నంబర్ 29లో సుమారు 10 ఎకరాల భూమి గుర్తించామన్నారు. సదరు భూమి సంజీవరావు అత్త శశికళ, కుమారుడు సుశాంత్ పేర్లమీద ఉన్నాయని తెలిపారు. సోదాల్లో ఏసీబీ సీఐ వెంకట్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.
అల్వాల్‌లోనూ...
అల్వాల్ : అలాగే ఏసీబీ డీఎస్పీ సునీత ఆధ్వర్యంలో శనివారం అల్వాల్‌లోని సంజీవరావు నివాసంలో సోదాలు నిర్వహించారు. అల్వాల్‌లోని జి+1 ఇంటితో పాటు కమర్షియల్ కాంప్లెక్స్, 75 తులాల బంగారు నగలు, 3 లక్షల 29 వేల నగదు, 18 విదేశీ మద్యం బాటిళ్లు ఇంట్లో లభించాయని ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా సంజీవరావు 1979లో ఎస్‌ఐగా పోలీసు విధులలో చేరి సీఐ, ఏసీపీగా విధులు నిర్వహించినట్లు తెలిసింది.
మూట పడేశారు....
ఒక వైపు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా, సంజీవరావు కుటుంబ సభ్యులు ఇంట్లో కిటికీ నుంచి ఓ మూట బయట పడేశారు. ఈ విషయాన్ని పాత్రికేయులు ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మూటను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాసు బుక్కులు, ఇతరులకు సంబంధించిన స్థలాల పత్రాలు అందులో ఉన్నట్లు తెలిసింది.