
సాక్షి, హైదరాబాద్: కొత్త పాస్ పుస్తకాల జారీ కోసం ఆధార్ నంబర్ ఇచ్చేందుకు కొందరు రైతులు వెనుకాడుతున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం రైతు ఖాతాల్లో కేవలం 75 శాతం మాత్రమే ఖాతాలు ఆధార్‌తో అనుసంధానమయ్యాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మరో 10 శాతం వరకు ఆధార్ వివరాలు వచ్చే అవకాశముందని, మిగిలిన 15 శాతం మేర అనుసంధానం కష్టమేనని క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు. అంటే ఆధార్ నమోదు చేయని 15 శాతం రైతు ఖాతాలకు పెట్టుబడి సాయం అందదన్నమాట.
వెనుకంజ ఎందుకో..
ఆధార్ వివరాలు ఇచ్చేందుకు నిరాకరించడం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తమ భూమికి సంబంధించిన రికార్డులను నమోదు చేయించుకునేందుకు ఆసక్తి చూపిన స్థానికేతర రైతులు ఆధార్ వివరాలు ఇవ్వడం లేదని రెవెన్యూ సిబ్బంది అంటున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో తమ భూమి ఉన్న గ్రామానికి వచ్చి వెళ్లిన రైతులు ఆ తర్వాత కనిపించడం లేదని పేర్కొంటున్నారు.
పెట్టుబడి సాయం వద్దనుకునే వారు.. ఆధార్ నంబర్ ఇస్తే తమ ఆస్తులన్నీ ఎక్కడ బయటపడి పోతాయనే భయంతో కూడా అనుసంధానానికి వెనుకంజ వేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నల్లధనంతో భూములు కొనుగోలు చేసిన వారు మాత్రం ఆధార్ ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారని రెవెన్యూ యంత్రాంగం అంటోంది. ఒక్కసారి ప్రభుత్వానికి ఆధార్ నంబర్ ఇస్తే, తర్వాత కొనుగోలు చేసే ఆస్తుల వివరాలన్నీ తెలుస్తాయనే ఆలోచనతో కొంత మంది ఆధార్ ఇవ్వడానికి వెనుకాడుతున్నారని సమాచారం.
ఆధార్ నమోదు సమయంలోనే కొందరు తమ వివరాలను ఎలాంటి ఇతర కార్యక్రమాల కోసం వాడకూడదనే ఆప్షన్‌ను ఎంచుకున్నారు. అలాంటి వారి వివరాల కోసం రెవెన్యూ సిబ్బంది వారి ఇళ్లకు వెళుతున్నామని చెబుతున్నారు. భూ రికార్డుల నమోదుకు కనిపించిన ఆసక్తి ఆధార్ అనుసంధానం విషయంలో కనపడకపోవడం గమనార్హం.
పాస్‌పుస్తకం–ఆధార్ గణాంకాలివే..
రాష్ట్రంలోని మొత్తం రైతు ఖాతాలు: 72,11,511
ఇప్పటివరకు ఆధార్ అనుసంధానం అయినవి: 53,34,769
ఆధార్ కార్డులివ్వని ఖాతాలు: 18,76,742
ఆధార్ ఇచ్చినా ఫొటోలు కనిపించని ఖాతాలు: 2,65,600
ఆధార్ ఆమోదం లభించని ఖాతాలు: 1,36,849
Comments
Please login to add a commentAdd a comment