లెక్క లేనితనం! | Irregularities in the municipality of Bandar | Sakshi
Sakshi News home page

లెక్క లేనితనం!

Published Sun, Jul 20 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM

లెక్క లేనితనం!

లెక్క లేనితనం!

మచిలీపట్నం మున్సిపాలిటీలోని లొసుగులను కప్పిపుచ్చేందుకు ఆడిట్ అధికారులకు సిబ్బంది ఏ మాత్రం సహకరించడంలేదు. అరకొర సమాచారం.. అడ్డగోలు సమాధానాల వల్ల ఆడిట్ ప్రక్రియ ముందుకు సాగడంలేదు.

  •   బందరు మున్సిపాలిటీలో అవకతవకలు
  •   ఆడిట్ అధికారులకు సహకరించని సిబ్బంది
  •   15 రోజులుగా కొనసాగుతున్న ఆడిట్
  •   రూ. 70 లక్షల ఖర్చుకు లెక్కలు లేని వైనం..!
  •   లోపాలపై ప్రభుత్వానికి నివేదిక !
  • మచిలీపట్నం మున్సిపాలిటీలోని లొసుగులను కప్పిపుచ్చేందుకు ఆడిట్ అధికారులకు సిబ్బంది ఏ మాత్రం సహకరించడంలేదు. అరకొర సమాచారం.. అడ్డగోలు సమాధానాల వల్ల ఆడిట్ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. ఇప్పటి వరకు సుమారు రూ.70లక్షల ఖర్చులకు లెక్కలు లేవని గుర్తించారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మున్సిపాలిటీకి గ్రాంట్లు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
     
    మచిలీపట్నం టౌన్ : అతిపురాతన మున్సిపాలిటీగా పేరొందిన మచిలీపట్నం పురపాలక సంఘంలో అవకతవకలు కూడా అదే స్థాయిలో పేరుకుపోతున్నాయి. మున్సిపాలిటీలో లొసుగులపై పదేళ్లుగా ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకపోవటంతో సిబ్బందిని పట్ట పగ్గాల్లేవు. దీంతో జమాఖర్చులకు లెక్కా పత్రాలు కూడా లేకుండా పోయాయి. ఖర్చుల వివరాలు తెలిపే క్యాష్‌బుక్‌లు, పాస్‌బుక్‌లు, ఓచర్లు తదితర వివరాలేమీ ఇక్కడ కనిపించడంలేదు. మున్సిపాలిటీలో ఆడిట్ నిర్వహించేందుకు వచ్చిన అధికారులకు కూడా సరైన వివరాలు లేవని సిబ్బంది తెగేసి చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆడిట్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
     
    పొంతనలేని సమాచారం..
     
    మున్సిపల్ ఉద్యోగులు ఆడిట్ సిబ్బందికి అందజేస్తున్న సమాచారంలో పొంతన ఉండటంలేదు. పట్టణంలోని ఓ బ్యాంక్ ఖాతాలో ఉన్న దాదాపు రూ.70 లక్షలను వివిధ పనులకు వినియోగించినట్లు చెబుతున్నారు. మున్సిపల్ సిబ్బంది చెబుతున్న ఖర్చుకు సంబంధించిన పాస్ పుస్తకాలు, క్యాష్ పుస్తకాలు, డీడీల పుస్తకాలు లేకపోవటంతో ఆడిట్ సిబ్బంది ఏం చేయాలో అర్థంకాక అల్లాడుతున్నారు.
     
    15 రోజులుగా ఆడిట్

    మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలో 2003-04 సంవత్సరం నుంచి ఆడిట్ జరగాల్సి ఉంది. గత పదిహేను రోజులుగా 2009-10 సంవత్సరానికి సంబంధించిన ఆడిట్‌ను మాత్రమే నిర్వహిస్తున్నారు. ఆడిట్ అధికారులు ఏ రికార్డు అడిగినా మున్సిపల్ సిబ్బంది మాత్రం ఏసీబీ వారు తీసుకెళ్లారని చెప్పి తప్పించుకుంటున్నారు. జిల్లాలోని ఇతర ఏ మున్సిపాలిటీలో కూడా ఇంతగా ఆడిట్ పెండింగ్‌లు లేకపోవటం గమనార్హం.

    జమాఖర్చులకు సంబంధించి పాస్ పుస్తకాలు, క్యాష్ పుస్తకాలు, ఓచర్లు, రశీదులు ఆడిట్ అధికారులకు మున్సిపల్ సిబ్బంది ఇవ్వకపోవటంతో ఆడిట్ ముందుకు సాగటం లేదు. ఇద్దరు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు, ఏడుగురు ఆడిటర్లు ఈ పనిలో నిమగ్నమయ్యారు. అయితే మున్సిపల్ సిబ్బంది నుంచి సహాయనిరాకరణ ఎదురవుతుండటంతో ఆడిట్ ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదు. ఆడిట్ పూర్తికాకపోవటంతో ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
     
    మున్సిపల్ సిబ్బంది సహకరించడం లేదు : ఆడిట్ ఆర్జేడీ
     
    మచిలీపట్నం మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది ఆడిట్ నిర్వహణకు ఏ మాత్రం సహకరించడం లేదని స్టేట్ ఆడిట్ ఆర్జేడీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆడిట్ ప్రక్రియను పరిశీలించేందుకు శనివారం మచిలీపట్నం వచ్చిన ఆయన సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మున్సిపాలిటీల్లో పెండింగ్ ఆడిట్‌ను ఆగస్టులోపు పూర్తిచేయాల్సి ఉందన్నారు.

    అందువల్లే తాము పంచాయతీరాజ్ ఆడిట్‌ను కూడా పక్కనబెట్టి మున్సిపాలిటీల ఆడిట్‌ను పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం వేరే ప్రాంతాలకు చెందిన ఏడుగురు ఆడిటర్లను, ఇద్దరు ఏఏవోలను డెప్యూటేషన్‌పై ఇక్కడికి పంపామని తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లో అక్కడి సిబ్బంది ఆడిట్ అధికారులకు సహకరిస్తుండగా, మచిలీపట్నంలో మాత్ర పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందన్నారు.

    ఇక్కడున్న వాస్తవ పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, కమిషనర్ ఎ.మారుతిదివాకర్‌ను కలిసి ఆడిట్‌కు సహకరించాలని కోరారు. ఆర్జేడీ వెంట జిల్లా ఆడిట్ అధికారి ఎల్.ఫిరోజ్, ఏఏవోలు ఎ.వెంకన్నబాబు, ఎం.లక్ష్మీకుమార్, సీనియర్ ఆడిటర్ టీవీ రమణ, సిబ్బంది ఉన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement