సాక్షి, అమరావతి: బ్రిటీష్ కాలం నాటి రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి వివాదాలకు శాశ్వతంగా తెరదించే లక్ష్యంతో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా భూముల రీ సర్వే కార్యక్రమాన్ని శరవేగంగా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ ముద్రించనుంది. దీన్ని స్కాన్ చేయడం ద్వారా భూ కమతం, విస్తీర్ణం, ఎలాంటి భూమి, మ్యాప్ తదితర వివరాలన్నీ తెలుసుకోవచ్చు. రీ సర్వేలో ఆక్షాంశాలు, రేఖాంశాలతో (జియో కో–ఆర్డినేట్స్) భూమి హద్దులను నిర్ధారిస్తున్నారు.
భూమికి నలువైపులా వీటిని సూచించడం ద్వారా విస్తీర్ణాన్ని కచ్చితంగా తెలుసుకోవచ్చు. వీటి ఆధారంగా రైతుల పట్టాదార్ పాస్ పుస్తకంలో క్యూఆర్ కోడ్ ముద్రిస్తారు. ప్రస్తుతం ఒక సర్వే నంబర్‌కి ఒక ఎఫ్‌ఎంబీ ఉండగా, నలుగురైదుగురు భూ యజమానులుంటే ఉమ్మడిగా ఒక మ్యాప్ కేటాయిస్తున్నారు.
రీ సర్వే తర్వాత ప్రతి భూమిని (సెంటు భూమి విడిగా ఉన్నా సరే) సర్వే చేసి ప్రత్యేకంగా రాళ్లు పాతుతారు. దానికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్ ఇస్తారు. ఆ సర్వే నంబర్‌లో ఎంత మంది ఉంటే అందరి మ్యాప్‌లు విడివిడిగా పొందుపరుస్తారు. ప్రతి భూ యజమానికి తమ భూములపై ఎవరూ సవాల్ చేయడానికి వీలు లేని శాశ్వత హక్కులు లభిస్తాయి.
70 బేస్ స్టేషన్లతో కార్స్ నెట్‌వర్క్
జీపీఎస్ కార్స్ నెట్‌వర్క్ (కంటిన్యుస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ నెట్‌వర్క్) ద్వారా భూములను కొలుస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 బేస్ స్టేషన్లు శాటిలైట్ రేడియో సిగ్నళ్లను స్వీకరించి కచ్చితమైన అక్షాంశ, రేఖాంశాలను సెంట్రల్ కంట్రోల్ స్టేషన్‌కు పంపుతాయి. కార్స్, డ్రోన్, రోవర్ సహాయంతో భూములను కచ్చితంగా కొలుస్తారు. తద్వారా ప్రతి స్థిరాస్తి కొల తలు, హద్దులు, విస్తీర్ణం, భూ కమత పటం ల్యాండ్ రిజిస్టర్‌లో డిజిటల్ రూపంలో నమోదవుతాయి. వీటితో మ్యాప్‌లో క్యూఆర్ కోడ్ రూపంలో పొందుపరుస్తారు.
నకిలీలు, ట్యాంపరింగ్‌కు తెర
ప్రతి భూమికి (ల్యాండ్ పార్సిల్) ఒక విశిష్ట సంఖ్య కేటాయించి భూమి వివరాలతోపాటు భూ యజమాని ఆధార్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ సేకరించి భూ రికార్డులో భద్రపరుస్తారు. భూ యజమానికి తెలియకుండా రికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. డూప్లికేట్ రికార్డులు, ట్యాంపరింగ్‌కు అవకాశం ఉండదు.
ఆయా భూముల క్రయ విక్రయాలు జరిగిన వెంటనే రికార్డుల్లో ఆటోమేటిక్‌గా మారిపోతాయి. తద్వారా భూ సమాచారాన్ని ఎవరైనా, ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కంప్యూటర్ ఆధారిత భూ సమాచార వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దీనిద్వారా ఎవరైనా తమ భూమిని మ్యాప్‌తో సహా చూసుకోవడానికి వీలుంటుంది.
సర్వేతో ఇవీ ప్రయోజనాలు..
► ప్రతి ఆస్థికి యజమాని గుర్తింపు
► రికార్డుల్లో పదిలంగా ఆస్తి హక్కులు
► ఆ ఆస్తిని మరొకరు ఇతరులకు విక్రయించే అవకాశం ఉండదు
► పకడ్బందీగా హద్దులు, కొలతలు
► క్షేత్రస్థాయిలో భూమి ఏ ఆకారంలో ఉందో రికార్డుల్లో అలాగే ఉంటుంది
► ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఆస్తి వివరాలు తెలుసుకోవచ్చు
► హద్దు రాళ్లు తొలగించినా, గట్టు తెగ్గొట్టినా మీ ఆస్తి డిజిటల్ రికార్డుల్లో భద్రంగా ఉంటుంది.
► భూమికి సంబంధించిన సమగ్ర సమాచారం, సంపూర్ణ హక్కుతో ఉంటుంది.
సంపూర్ణ హక్కులు, రక్షణే లక్ష్యం
స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం చేయని విధంగా భూముల రీ సర్వే నిర్వహిస్తున్నాం. రీ సర్వేతో అస్తవ్యస్థంగా ఉన్న రికార్డుల ప్రక్షాళన జరుగుతుంది. వాస్తవంగా ఉన్న భూముల విస్తీర్ణం ప్రకారం డిజిటల్ రికార్డులు తయారవుతాయి. దళారీ వ్యవస్థకు ఆస్కారం ఉండదు. ప్రస్తుతం సర్వే నెంబర్ల వారీగా హద్దు రాళ్లు లేకపోవడంతో సరిహద్దు వివాదాలు తలెత్తుతున్నాయి. రీ సర్వేలో ప్రతి సర్వే నెంబరును ఉచితంగా సర్వే చేస్తున్నాం. వైఎస్సార్ జగనన్న హద్దురాళ్లు ఏర్పాటు చేస్తాం. ప్రతి భూమిపై సంబంధిత యజమానికి సంపూర్ణ హక్కు, రక్షణ కల్పించడమే రీ సర్వే ఉద్దేశం.
– సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ
Comments
Please login to add a commentAdd a comment