AP: భూ వివాదాలకు చెక్‌ | Andhra Pradesh Govt steps for permanent settlement land disputes | Sakshi
Sakshi News home page

AP: భూ వివాదాలకు చెక్‌

Published Tue, Feb 7 2023 5:09 AM | Last Updated on Tue, Feb 7 2023 8:30 AM

Andhra Pradesh Govt steps for permanent settlement land disputes - Sakshi

రీసర్వే ప్రక్రియలో సలహాలు ఇస్తున్న జేసీ తేజ్‌భరత్‌

సాక్షి, రాజమహేంద్రవరం: భూ వివాదాల శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ‘వైఎస్సార్‌ జగనన్న భూహక్కు, భూరక్ష’ పథకం కింద మూడు దశల్లో భూముల సమగ్ర సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. తద్వారా భూ సంబంధిత సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా తొలి దశ సర్వే ప్రక్రియను అధికార యంత్రాంగం చేపట్టింది. అప్పట్లో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి, శాశ్వత భూహక్కు పత్రాలు సైతం పంపిణీ చేసింది. ప్రస్తుతం రెండో దశ సర్వే జిల్లాలో యుద్ధప్రాతిపదికన జరుగుతోంది.

రెండో దశ 50 శాతం పూర్తి
తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 272 గ్రామాల పరిధిలోని 16,52,706 ఎకరాల్లో వివిధ దశల్లో రీసర్వే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. తొలి దశలో 44 గ్రామాల్లోని 64,336 ఎకరాల్లో సర్వే పూర్తి చేశారు. రెండో దశలో జిల్లా వ్యాప్తంగా 17 గ్రామాలను ఎంపిక చేశారు. మొత్తం 47,189.2 ఎకరాల రీసర్వేకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే 10 గ్రామాల్లోని 22,223.91 ఎకరాల్లో సర్వే పూర్తి చేసి, సుమారు 50 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. మిగిలిన 7 గ్రామాల పరిధిలోని 24,965.78 ఎకరాల్లో సైతం త్వరితగతిన పూర్తి చేయనున్నారు. ఈ నెలాఖరుకు లక్ష్యాన్ని అధిగమించాల్సి ఉండగా.. కొన్ని సమస్యల కారణంగా మార్చి 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు.

పకడ్బందీగా..
రెండో దశ రీసర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ భూములు, నివాస గృహాలు, వీధులు, ప్రైవేటు భూములు, పరిశ్రమలు.. ఇలా గ్రామానికి చెందిన మొత్తం విస్తీర్ణాన్ని సర్వే చేస్తున్నారు. తొలుత గ్రౌండ్‌ ట్రూతింగ్, గ్రౌండ్‌ వాలిడేషన్‌ పూర్తి చేస్తున్నారు. సర్వే చేస్తున్న గ్రామానికి పొరుగున ఉన్న వీఆర్‌ఓలు, గ్రామ సర్వేయర్ల సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రతి గట్టూ తిరిగి సరిహద్దులు నిర్ధారిస్తున్నారు. ఫలితంగా సమయం అవుతోంది.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం
రీసర్వేలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. కంటిన్యూస్‌ ఆపరేటింగ్‌ రిఫరింగ్‌ స్టేషన్‌ నెట్‌వర్క్‌ సాయంతో ఈ ప్రక్రియ సాగుతోంది. చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద కమతాల వరకూ ప్రతీది నమోదు చేస్తున్నారు. డ్రోన్లను రంగంలోకి దింపి సర్వేలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. మొదటి రెండు దశల్లో ఇప్పటి వరకూ 1,474.629 చదరపు కిలోమీటర్ల మేర డ్రోన్లతో సర్వే నిర్వహించారు.

హద్దు రాళ్లు
సర్వే పూర్తయిన రెవెన్యూ గ్రామాల పరిధిలో ఫ్రీజోన్‌ యాక్టివిటీస్‌ కింద భూముల హద్దులకు సంప్రదాయ పద్ధతిలో సున్నం మార్కింగ్‌ చేపట్టారు. రాళ్లను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారు. రెండో దశలో 15,113 రాళ్లు పాతాల్సి ఉండగా.. ఇప్పటి వరకూ 5,522 రాళ్లు పాతారు.

కొలిక్కి వస్తున్న వివాదాలు
ఈ సర్వే పుణ్యమా అని దశాబ్ద కాలం నాటి భూ వివాదాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. దశాబ్దం క్రితం నిర్వహించిన సర్వేలో 5 శాతం అలవెన్సు అమలు చేశారు. అప్పట్లో చైన్లతో కొలతలు వే­యడంతో అటూ ఇటూ భూ విస్తీర్ణంలో 5 % సరి­హద్దులు నిర్ణయించారు. ఈ క్రమంలో రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి, భూమి మీద ఉన్న విస్తీర్ణానికి తేడాలు రావడంతో కొందరు రైతులు వాగ్వా­దాలకు దిగుతున్నారు. 1906లో నిర్వహించిన సర్వే ఆధారంగా ప్రస్తుతం భూ సంబంధిత లావా­దేవీలు కొనసాగిస్తున్నారు. ఒకే సర్వే నంబరుపై పలుమార్లు లావాదేవీలు జరిగాయి.

వారసులు పం­చుకోవడం, బహుమతిగా ఇవ్వడం, క్రయ­విక్రయాలు జరిగినా అందుకు అనుగుణంగా భూ­మి మీద సబ్‌ డివిజన్‌ జరగకపోవడంతో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. పత్రాల మీద లావాదేవీలు జరిగినా క్షేత్ర స్థాయిలో సర్వే చే­య­కుండానే నోషనల్‌ ఖాతాల వల్ల అనేక సమస్యలు మొదలయ్యాయి. తప్పుడు సర్వే నంబర్లతో భూములు రిజిస్ట్రేషన్‌ కావడం, రిజిస్ట్రేషన్‌ అ­యి­న భూమికి, వాస్తవంగా భూమి మీద ఉన్న విస్తీ­ర్ణానికి తేడాలు ఉండటం, నిషేధిత భూములు రి­జిస్ట్రేషన్‌ చేయడం వంటి కారణాలతో రెవెన్యూ స­మస్యలు నిత్యకృతమయ్యాయి. 

ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం
రీసర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాం. వారికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించి, ప్రక్రియ పర్యవేక్షిస్తున్నా. ఎలాంటి లోటుపాట్లకూ తావు లేకుండా పకడ్బందీగా సర్వే చేస్తున్నాం. రెండో దశలో ఇప్పటికే 50 శాతం లక్ష్యాలను అధిగమించాం. మిగిలిన వాటిని సైతం త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాం. నిజమైన హక్కుదారుకు న్యాయం చేయాలన్నదే లక్ష్యంగా పని చేస్తున్నాం.
– ఎన్‌.తేజ్‌భరత్, జాయింట్‌ కలెక్టర్‌

లక్ష్యాలను అధిగమిస్తాం
రెండో దశ రీసర్వే ప్రక్రియ వేగంగా చేపడుతున్నాం. వివాదాల పరిష్కారానికి సలహాలు ఇస్తున్నాం. ఇప్పటికే జిల్లాలోని 22,223.91 ఎకరాల్లో పూర్తి చేశాం. మిగిలినది సైతం త్వరలోనే పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం.
– పి.లక్ష్మణరావు, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ జిల్లా అధికారి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement