రాష్ట్రంలో 'భూభారతి'నత్తకు నడకలు నేర్పుతోంది.
* పదేళ్లుగా కొనసాగుతున్నా కొలిక్కిరాని ప్రక్రియ
* రికార్డుల ఆప్‌డేషన్‌లో న్యాయపరమైన చిక్కులు
* రూ.28 కోట్లు ఖర్చయినా.. ప్రయోజనం శూన్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 'భూభారతి'నత్తకు నడకలు నేర్పుతోంది. పదేళ్లు దాటినా ఈ ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. ఈ ప్రాజెక్టు అమలులో రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, సర్వే విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం ప్రధాన ఆటంకం. అస్తవ్యస్తంగా ఉన్న భూమి రికార్డులను సమూలంగా ప్రక్షాళన చేయడం భూభారతి ఉద్దేశం. సర్వే, ల్యాండ్ రికార్డ్స్ విభాగం నిజామాబాద్ జిల్లాలో భూభారతి కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన సంగతి తెలిసిందే. 2005లో అప్పటి ప్రభుత్వం భూభారతి కార్యక్రమాన్ని చేపట్టింది. భూభారతి కార్యక్రమ నిర్వహణను చేపట్టిన సర్వే విభాగాన్ని కొన్నేళ్లుగా సర్వేయర్ల కొరత వెంటాడుతోంది. రెవెన్యూ యంత్రాంగంపై సర్వే అధికారులకు అజ మాయిషీ లేకపోవడం, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్లిప్తంగా ఉండడం భూభారతి నత్తనడకన సాగడానికి ప్రధాన కారణాలని అధికారులు చెబుతున్నారు.
న్యాయపరమైన చిక్కులు
న్యాయపరమైన చిక్కులు భూభారతిని ముందుకు వెళ్లనీయకుండా చేస్తున్నాయి. జియోగ్రాఫికల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్), ఏరియల్ ఫొటోగ్రఫీ సర్వే ద్వారా సర్వే ప్రక్రియను కొంత మేరకు పూర్తి చేసినా భూమి యజమానులు న్యాయస్థానాల నుంచి స్టే ఉత్తర్వులు తీసుకురావడంతో సర్వే ప్రక్రియను నిలిపేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా..
నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన భూభారతి నమూనాను కర్ణాటక, మహరాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని భూమి రికార్డుల ఆధునీక రణను పూర్తి చేశాయి. కానీ, రాష్ట్రంలో మాత్రం ఒక్క జిల్లానే భూభారతి ఇంకా కుంటుతోంది. జాతీయ భూమి రికార్డుల ఆధునీకరణ ప్రోగ్రామ్(ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ) కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రానికి రూ.275 కోట్లు మంజూరు చేసింది. మొత్తం రూ.600 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా, మిగిలిన మొత్తాన్ని దశలవారీగా మంజూరు చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. భూభారతిలో ఎదురవుతున్న అవాంతరాలను తొలగించే నిమిత్తం సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల విభాగం కమిషనర్ మంగళవారం సమీక్షించనున్నట్లు తెలిసింది.