భూరికార్డుల పునఃపరిశీలన
నెల్లూరు(పొగతోట): భూరికార్డులను పునఃపరిశీలించాలని జాయింట్ కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ అహ్మద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. స్థానిక గోల్డన్‌జూబ్లీహాల్లో బుధవారం ఆయన ఆర్డీఓలు, తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. గతంలో ఆనక్షరీ 1, 2, 3, 4, 5 ప్రొఫార్మాలో భూరికార్డులను పరిశీలించడం జరిగిందన్నారు. పరిశీలించిన రికార్డులను సీసీఎల్‌ఏకు పంపించడం జరిగిందన్నారు. పంపించిన రికార్డులను పునఃపరిశీలించమని సీసీఎల్‌ఏ ఆదేశాలు జారీ చేసిందన్నారు. భూములకు సంబంధించిన రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలించి నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. వారం రోజుల్లో భూ రికార్డు ల పరిశీలన పూర్తి చేసి సీసీఎల్‌ఏకు నివేదిక అందజేయాలని తెలిపారు. ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అంతక ముందు 22(ఏ) రికార్డుల పరిశీలనకు సంబం«ధించి కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో రెవెన్యూ అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్వో మార్కండేయులు, గూడూరు, నెల్లూరు, ఆత్మకూరు, కావలి ఆర్డీఓలు వెంకటసుబ్బయ్య, వెంకటేశ్వర్లు, ఎంవీ రమణ, నరసింహన్, తదితరులు పాల్గొన్నారు.