సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, భూ వివాదాలు, పొలం గట్ల సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని 17,000 రెవెన్యూ గ్రామాల్లో 3.32 కోట్ల ఎకరాల భూమిని పూర్తిగా రీసర్వే చేసి ప్రతి సర్వే నంబరుకు పక్కాగా సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రీసర్వే కోసం రైతులపై నయాపైసా కూడా భారం మోపవద్దని, దీనికోసం అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. సర్వే నంబర్లవారీగా నాటే నంబరు రాళ్ల ఖర్చును కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.
భూముల సమగ్ర రీసర్వేపై తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సోమవారం సమీక్షించారు. నాలుగు దశల్లో రీ సర్వే పూర్తి చేద్దామని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించగా ప్రజాప్రయోజనాల రీత్యా ఇది చాలా ముఖ్యమైన, అత్యవసరమైన ప్రాజెక్టు కాబట్టి మూడు విడతలకు కుదించి త్వరగా పూర్తి చేద్దామని సీఎం పేర్కొన్నారు. సుదీర్ఘంగా సాగిన తన పాదయాత్రలో భూ వివాదాలకు సంబంధించి ప్రజల నుంచి పలు ఫిర్యాదులు అందాయని సీఎం గుర్తు చేసుకున్నారు. మొదటి విడత కింద 3,000 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే చేపట్టనున్నారు. రెండు, మూడు విడతల్లో 7 వేల చొప్పున రెవెన్యూ గ్రామాల్లో సర్వే నిర్వహిస్తారు. సమగ్ర రీసర్వే ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడానికి కారణాలు, దీనివల్లే ఒనగూరే ప్రయోజనాలు, రాష్ట్రంలో భూ రికార్డుల పరిస్థితి తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘ చర్చ సాగింది. ఇందులో ముఖ్యాంశాలు ఇవీ...
స్వాతంత్రానికి పూర్వం సర్వే,..
► 1900 – 1920 మధ్య బ్రిటీష్ హయాంలో దేశంలో భూములను సర్వే చేసి రీసర్వే సెటిల్‌మెంట్ రిజిస్టర్ (ఆర్‌ఎస్‌ఆర్) రూపొందించారు. తర్వాత భూముల క్రయ విక్రయాలు, వారసత్వ మార్పులు లక్షల సంఖ్యలో జరిగినా సరిగా నమోదు కాలేదు. కొందరు రికార్డులను ట్యాంపరింగ్ కూడా చేశారు.
► తప్పుల తడకలుగా ఉన్న రికార్డుల ప్రక్షాళన/ స్వచ్ఛీకరణ, భూముల సరిహద్దు వివాదాల పరిష్కారానికి రీసర్వే తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.
► రాష్ట్రంలో వాస్తవంగా ఉన్న భూమికి, రెవెన్యూ రికార్డుల్లో గణాంకాలకూ మధ్య భారీ వ్యత్యాసం ఉంది. రెవెన్యూ శాఖ అత్యంత ప్రామాణికంగా పరిగణించే రీసర్వే సెటిల్‌మెంట్ రిజిష్టర్ (ఆర్‌ఎస్‌ఆర్), భూ అనుభవ రిజిష్టర్ (అడంగల్) మధ్య కూడా చాలా తేడా ఉంది. భూకమతాలు, సబ్‌డివిజన్ల మధ్య కూడా వ్యత్యాసం ఉంది.
► ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించి రికార్డులను ప్రక్షాళన చేయటం కోసం రాష్ట్రంలో భూములన్నీ సమగ్రంగా రీ సర్వే చేసి భూ యజమానులందరికీ శాశ్వత హక్కులు కల్పిస్తామని వైఎస్సార్ సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. ఈ హామీ అమలులో భాగంగా శాశ్వత భూ హక్కుల చట్టాన్ని తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రీ సర్వేకు ప్రణాళిక రూపొందించింది.
భూముల సమగ్ర రీసర్వేపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
కోర్టు కేసుల్లో 60 శాతానికిపైగా భూ వివాదాలే
► భూ రికార్డులు అస్తవ్యస్తంగా మారడం, సరిహద్దులు చెరిగిపోవడంవల్ల భూ వివాదాలు భారీగా పెరిగాయి. కోర్టు కేసుల్లో 60 శాతానికిపైగా భూవివాదాలకు సంబంధించినవే ఉన్నాయి.
► ముఖ్యమంత్రి, రెవెన్యూ అధికారులు ప్రతివారం నిర్వహించే స్పందన ఫిర్యాదుల్లో అత్యధికం భూ, సర్వే సమస్యలకు సంబంధించినవే ఉంటున్నాయి.
► ప్రతి 30 ఏళ్లకు రీసర్వే చేసి సర్వే సెటిల్‌మెంట్ – ల్యాండ్ రికార్డులు స్వచ్ఛీకరించాల్సి ఉన్నా భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో ఏ ప్రభుత్వం కూడా ఇందుకు సాహసించలేదు. దీనివల్ల వివాదాలు జటిలమై సివిల్ వివాదాలు కాస్తా క్రిమినల్ కేసులుగా మారుతున్నాయి.
► వాస్తవంగా ఉన్న భూమికి, రికార్డుల్లో ఉన్న దానికి మధ్య తేడాలను పక్కాగా గుర్తించి వాస్తవ విస్తీర్ణానికి అనుగుణంగా రికార్డులను సరిచేయకుంటే వివాదాలు ఇంకా పెరుగుతాయి. అందువల్ల రీసర్వే తప్పనిసరని పేర్కొంటూ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.
► సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఇన్‌ఛార్జి కమిషనర్ సిద్ధార్థ జైన్, రాష్ట్ర భూ పరిపాలన సంయుక్త కమిషనర్ చెరుకూరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
‘కార్స్’ టెక్నాలజీని వినియోగిస్తున్న తొలి రాష్ట్రం ఏపీ...
► ఇప్పటికే ఉన్న సుమారు 2,200 మంది సర్వేయర్లతోపాటు కొత్తగా నియమించిన 11,158 మంది గ్రామ సర్వేయర్లకు అధునాతన ‘‘కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ (కార్స్)’’ టెక్నాలజీపై ప్రభుత్వం శిక్షణ కూడా ఇప్పించింది.
► ఇప్పటివరకు మలేషియా, సింగపూర్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో మాత్రమే ఈ టెక్నాలజీని వినియోగించారు.
► మన దేశంలో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం.
► రాష్ట్రంలోని మొత్తం 17,000 రెవెన్యూ గ్రామాల్లో 3.32 కోట్ల ఎకరాల భూమిని కచ్చితంగా కొలతలు వేసి సర్వే నంబర్ల వారీగా నంబరు రాళ్లు పాతుతారు. ఈ వివరాలను డిజిటలైజ్ చేసి భద్రపరుస్తారు. దీంతో ట్యాంపరింగ్ చేయడానికి వీలుకాదు.
► కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో 25 గ్రామాల పరిధిలోని 66,761 ఎకరాల రీసర్వే పైలెట్ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. దీన్ని పరిశీలించి రాష్ట్రమంతా అమలు చేస్తారు.
► భూముల అమ్మకాలు, కొనుగోళ్ల రిజిస్ట్రేషన్ల ప్రకారం నిర్దిష్ట సమయంలో మ్యుటేషన్ చేస్తారు. దీంతో ఎప్పటికప్పుడు రికార్డులు అప్‌డేట్ అవుతుంటాయి.
► గ్రామ సచివాలయాలవారీగా భూముల సమగ్ర రీసర్వే ప్రక్రియ అమలు చేస్తారు.
► సర్వే సందర్భంగా వివాదాలు తలెత్తితే పరిష్కరించేందుకు డిప్యూటీ కలెక్టర్లతో మొబైల్ కోర్టులు ఏర్పాటు చేస్తారు.
డిజిటల్ రికార్డులు....
► రికార్డుల స్వచ్ఛీకరణ/ ప్రక్షాళన సర్వే వివరాలు ఎప్పటికప్పుడు డిజిటల్ పద్ధతిలో భద్రపరిచే ఏర్పాటు చేస్తారు.
► డేటాను తారుమారు చేయడానికి వీల్లేని విధంగా మూడు నాలుగు చోట్ల భద్రపరిచే వ్యవస్థ ఏర్పాటు చేస్తారు.
► భూముల క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు జరిగిన వెంటనే నిర్దిష్ట సమయంలో ఆటో మ్యుటేషన్ (రెవెన్యూ రికార్డుల్లో మార్పులు) చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment