Andhra Pradesh: పాలనలో నయా పంథా | Andhra Pradesh Govt services and schemes for rural and urban people | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: పాలనలో నయా పంథా

Published Mon, May 29 2023 4:15 AM | Last Updated on Mon, May 29 2023 7:44 AM

Andhra Pradesh Govt services and schemes for rural and urban people - Sakshi

సాక్షి, అమరావతి: కేవలం నాలుగేళ్లలోనే సంస్క­రణల ద్వారా పరిపాలన వ్యవస్థలో విప్లవాత్మక మార్పు­­లకు రాష్ట్రం చిరునామాగా మారింది. సామా­జిక బాధ్యతగా విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో అందించాల్సిన సేవల్లో ప్రభుత్వం తీసు­కొచ్చిన మార్పులు, సంస్కరణలు సత్ఫలితాలి­స్తున్నాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాలనా వ్యవస్థల్లో మార్పులు కొట్టొచ్చినట్లు కనిపించేలా చేసిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌ సర్కారుకే దక్కు­తుంది. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరా­జ్యాన్ని, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకే అధికారాలు, విధులు అప్పగించాలనే మాట­లను సాక్షాత్కరింప చేసిన ఏకైక రాష్ట్రంగా నిలిచింది ఏపీనే.

గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలు, పథకాలను అందిస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే (2019) కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేసి, చేతులు దులుపుకోకుండా.. వాటి ద్వారా ప్రభుత్వ సేవలు, పథకాలు అందించడానికి అవస­రమైన మౌలిక సదుపాయా­లతో పాటు ఉద్యోగులు, సిబ్బందిని భర్తీ చేసింది. దేశ చరిత్రలోనే తొలి­సారిగా 15,004  గ్రామ, వార్డు సచివాల­యా­లతో పక్కా వ్యవస్థ ఏర్పాటు చేసింది.

వీటిలో 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను సృష్టించి.. భర్తీ చేసింది. ప్రతి 50 ఇళ్లకు వలంటీర్‌ చొప్పున ప్రజల చేయి పట్టుకుని నడిపించే సేవా వ్యవస్థను తెచ్చింది. సచివాల­యా­లతో అనుసంధానమై 2.65 లక్షల మంది వలంటీర్లుగా పనిచేస్తున్నారు. తద్వారా 600 పౌర సేవలు  లంచాలు, వివక్షకు తావు లేకుండా అందుతున్నాయి. మారుమూల పల్లెల్లో సైతం ఎక్కడ చూసినా పౌర సేవల్లో గొప్ప విప్లవం కనిపిస్తోంది.

రేషన్‌ డోర్‌ డెలివరీతో రోల్‌ మోడల్‌ 
పేదల ఇంటి వద్దకే రేషన్‌ డోర్‌ డెలివరీ చేయడంలో ఏపీ రోల్‌ మోడల్‌గా నిలిచింది. ఏ పల్లెలో అయినా, పట్టణంలో అయినా రేషన్‌ బియ్యం మన వీధికి, మన ఇంటి ముంగిటకే అందించే వ్యవస్థ దేశంలో ఏపీలోనే అమల్లో ఉంది. మిగతా రాష్ట్రాలు ఈ వ్యవస్థను అమలు చేసేందుకు యత్నిస్తున్నాయి. రేషన్‌ షాపుల దగ్గర గంటల తరబడి క్యూలో నిల­బడే దుస్థితిని నివారించి రాష్ట్ర వ్యాప్తంగా  9,260 డెలివరీ వ్యాన్‌లతో నాణ్యమైన సార్టెక్స్‌ బియ్యాన్ని  డెలివరీ చేస్తున్న ప్రభుత్వం దేశంలో ఏపీ ఒక్కటే.  

అవ్వాతాతల ఇంటికే ప్రతి నెలా పెన్షన్‌
దేశంలో ఎక్కడా లేని విధంగా పేద అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు, దీర్ఘ వ్యాధిగ్రస్తుల ఇంటికే ప్రతి నెలా పెన్షన్‌ను వలంటీర్ల ద్వారా అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ప్రతీ నెలా ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే వలంటీర్‌ ఇంటింటికీ వచ్చి లబ్ధిదారుల చేతిలో పెన్షన్‌ సొమ్ము పెట్టే కార్యక్రమం సజావుగా సాగుతోంది. 

‘ఫ్యామిలీ డాక్టర్‌’తో ఆరోగ్యానికి భరోసా 
రాష్ట్రంలో 10,592 గ్రామ, పట్టణ హెల్త్‌ క్లినిక్స్‌ ద్వారా ఆయా గ్రామాల్లోని ప్రజలకు ఉచితంగా వైద్య చికిత్సలను అందుబాటులోకి తెస్తూ ప్రభుత్వం ఈ రంగంలో గొప్ప మార్పులు తెచ్చింది. ఈ క్లినిక్స్‌ల్లో  కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ 24 గంటలూ అందుబాటులో ఉంటారు. 105 రకాల మందులు ఉంటున్నాయి. 14 రకాల పరీక్షలు చేస్తూ.. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో అనుసంధానమై అక్కడే సేవలందిస్తూ కనిపిస్తున్నారు. గతానికి ఇప్పటికి వ్యవస్థలో ఇదో స్పష్టమైన మార్పు.  

కొత్తగా మరో 13 జిల్లాలు 
రాష్ట్రంలో 2019 నాటికి 13 జిల్లాలు ఉంటే జిల్లా పాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వం కొత్తగా మరో 13 జిల్లాల ఏర్పాటు ద్వారా మొత్తం 26 జిల్లాలను చేసింది. 51 డివిజన్లను 78కి, 679 మండలాలను 691కి పెంపు ద్వారా మరింతగా పాలనను వికేంద్రీకరణ చేసింది. ఆఖరికి చంద్రబాబు నియోజకవర్గం కేంద్రమైన కుప్పంను రెవెన్యూ డివిజన్‌గా చేసింది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమే. ప్రజలకు జిల్లా, డివిజన్, మండల పాలన సేవలను మరింత చేరువ చేయడంలో భాగంగా వికేంద్రీకరణ చేపట్టింది. ఇది పరిపాలన రంగంలో గొప్ప సంస్కరణగా నిలుస్తోంది. 

సమగ్ర భూ సర్వేతో వివాదాలకు స్వస్తి
భూ వివాదాలకు శాశ్వత ముగింపు దిశగా వందేళ్ల తర్వాత సమగ్ర భూ సర్వే చేపట్టి గ్రామ స్థాయిలో గొప్ప మార్పునకు నాంది పలికింది. సమగ్ర భూ సర్వే కోసం గ్రామాలు, పట్టణాల్లో ఏకంగా 10,185 మంది సర్వేయర్లను నియమించింది. 40 డ్రోన్లు కొను­గోలు చేసింది. కబ్జాలకు, భూ వివాదాలకు శాశ్వతంగా స్వస్తి పలుకుతూ.. ప్రజల భూములపై శాశ్వత భూ హక్కును కల్పిస్తూ స్పష్టమైన భూ రికార్డులకు ప్రభుత్వం నాంది పలికింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల అమలుకు శ్రీకా­రం చుట్టడం ద్వారా గొప్ప మార్పులను చేపట్టింది. 

టెండర్ల విధానంలో పారదర్శకత
జ్యుడిషియల్‌ ప్రివ్యూతో పాటు రివర్స్‌ టెండర్‌ ద్వారా టెండర్ల విధానంలో పారదర్శకతకు పెద్ద పీట వేసింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా తొలిసారి జ్యుడిషియల్‌ ప్రివ్యూను ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌ మౌలిక సదుపా­యా­లు (తొలుత న్యాయ పరమైన సమీక్ష ద్వారా పారదర్శకత) చట్టం–2019ను అమల్లోకి తెచ్చింది. రూ.100 కోట్లు పైబడిన పనుల టెండర్లన్నీ జ్యుడిషియల్‌ ప్రివ్యూకు వెళ్తున్నాయి. రివర్స్‌ టెండర్‌ విధానం ద్వారా ప్రజా ధనం ఆదాకు పెద్ద పీట వేస్తూ టెండర్ల రంగంలో చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. 

‘స్పందన’తో ప్రజా సమస్యల పరిష్కారం
అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల, గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో ప్రజా సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారా­నికి ‘స్పందన’ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో సంబంధిత ఉన్నతాధికారులు స్వయంగా నిర్వహిస్తు­న్నారు.

1902కు ఫోన్‌ చేసి సమస్యను చెబితే.. దాన్ని నమోదు చేసుకుని నిర్ణీత సమయంలోగా పరిష్కరించే ఏర్పాటు చేశారు. దీన్ని మరింత నాణ్యతతో అమలు చేయడంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగనన్నకు చెబుదాం కార్యక్రమంగా మార్చారు. దీన్ని జిల్లా కలెక్టర్లతో పాటు నేరుగా సీఎం కార్యాలయం పర్యవేక్షిస్తోంది. ఇది ప్రజల సమస్యల పరిష్కారానికి వ్యవస్థలో తీసుకొచ్చిన గొప్ప మార్పుగా నిలుస్తోంది. 

వ్యవసాయం పండుగైంది
దేశంలోనే తొలిసారిగా రైతుల కోసం 10,778 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తు­న్నాయి. ఈ కేంద్రాలు విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి సేవలోనూ రైతన్నకు తోడుగా ఉంటూ, వారి చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. ఆర్బీకేలలో 10,778 మంది అగ్రికల్చర్, హార్టికల్చర్‌ గ్రాడ్యుయేట్లు పని చేస్తూ రైతులకు తోడుగా ఉన్నారు. 

ఉన్న ఊరిలోనే ప్రభుత్వ సేవలు
ప్రజలు పనుల నిమిత్తం మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలకు తిరగాల్సిన అవసరం లేకుండా ఉన్న ఊరిలోనే ప్రభుత్వ సేవలు, పథకాలు అందుతున్నాయి. దీంతో గతంలో ఎక్కడకో వెళ్లి దరఖాస్తు చేయడం, రాజకీయ నేతల చుట్టూ తిరగడం, లంచాలు ఇవ్వడం.. ఇలాంటి కష్టాలన్నింటికీ బ్రేక్‌ పడింది. ఉన్న ఊరిలో గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే అర్హత ఉంటే చాలు.. ఎవరి సిఫార్సు లేకుండానే సేవలు, పథకాలు అందుతున్నాయి.

గతంలో రూపాయి ఇస్తే పావలా మాత్రమే లబ్ధిదారులకు చేరేది. ఇప్పుడు నేరుగా నగదు బదిలీ ద్వారా రూపాయి ఇస్తే రూపాయి లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళుతోంది.  గత నాలుగేళ్లలో నవరత్నాల పథకాల ద్వారా రూ.2.11 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు జమ అయింది. రేషన్‌ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు, పెన్షన్, ఇంటి జాగా ఇలా ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా.. లేదా ఏ ప్రభుత్వ సేవలు కావాలన్నా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందుతున్నాయి. గతానికి, ఇప్పటికీ ఇదో గొప్ప మార్పు.

చేతల్లో సుపరిపాలన 
గత ప్రభుత్వాలు ఏవీ కూడా అధికా­రాలను, విధులను స్థానిక సంస్థలకు అప్పగించడానికి ఇష్టపడలేదు. తొలిసారిగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ, వార్డు సచివా­ల­యాల వ్యవస్థను ఏర్పాటు చేసి.. ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన, పౌర సేవలను ధైర్యంగా తీసుకువెళ్లారు. గత ప్రభుత్వాలు విద్య, వైద్య రంగాలను ప్రైవేట్‌కు అప్పగించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తే.. సీఎం జగన్‌.. ప్రభుత్వ రంగంలో విప్లవాత్మక మార్పులు తేవ­డం ద్వారా ఆ రంగాలపై ప్రత్యే­కంగా దృష్టి సా­రిం­చి బలోపేతం చేశారు. సమగ్ర భూ సర్వే అనేది మరో విప్లవాత్మక చర్య. కరణం, మున­సబుల వ్యవస్థను రద్దు చేశాక గ్రామాల్లో భూ రికార్డుల నిర్వ­హణ అస్తవ్యస్తంగా తయా­రైంది.

భూముల లిటిగేషన్లతో చాలా మంది ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. దీనికి పరిష్కారంగా వందేళ్ల తర్వాత తొలిసారిగా సమగ్ర భూ సర్వే చేపట్టారు. విద్యుత్‌ రంగంలో రెన్యువబుల్‌ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని వల్ల కొంత కాలం తర్వాత ఉత్పత్తి వ్యయం తగ్గి, ప్రజలకు మేలు చేకూరుతుంది.  పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధికి చర్యలు తీసు­కున్నారు. మొత్తంగా వేగవంతమైన అభి­వృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు.
    – అజేయ కల్లం, సీఎం ముఖ్య సలహాదారు  

మహిళా సాధికారత దిశగా అడుగులు
మహిళలకు ప్రభుత్వ నామినేట్‌ పనులు, నామినేట్‌ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టాలు చేసి, అమలు చేస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ మహిళల కోసం ఇలాంటి చట్టాలు చేసిన దాఖలాల్లేవు. జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌ పేరుతో మహిళలకు, పిల్లలకు బడ్జెట్‌ ప్రత్యేక కేటాయింపులు చేస్తోంది. 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను మహిళల పేరిట ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఇదే. మహిళా సాధికారత దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో స్థాపించే పరిశ్రమలు, కంపెనీల్లో స్థానిక యువతకు ఉద్యోగాల్లో 75 శాతం ఇవ్వాలని ప్రత్యేకంగా చట్టం చేసి, అమలు చేస్తోంది. స్థానికంగా యువతకు ఎక్కువగా ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈ రంగాలను ప్రోత్సహిస్తోంది. 

మారిన విద్య, వైద్య రంగాల ముఖ చిత్రం
ప్రజలకు విద్య, వైద్యం అందించాల్సిన కనీస సామాజిక బాధ్యత రాష్ట్ర ప్రభు­త్వాలకు ఉంటుంది. ఈ రెండు రంగాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ భారీ మార్పు­లకు శ్రీకారం చుట్టడంతో ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలోని విద్య, వైద్య సంస్థలను వేగంగా బలోపేతం చేస్తున్నారు. మారు­తున్న సాంకేతికతతో పాటు భవిష్యత్‌లో అవసరమైన రంగాల్లో మానవ వనరు­లను అభివృద్ధి చేసేందుకు బోధనా పద్ధతుల్లో, పాఠ్యాంశాల్లో మార్పులు తెచ్చారు.

నైపుణ్యాలతో కూడిన యువతను తయారు చేయడానికి బాటలు వేశారు. వైద్య రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మార్పులు తె­చ్చారు. గత రెండేళ్లలోనే 48,639 మంది వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించడం ద్వారా అన్ని స్థాయి వైద్య సంస్థల్లో మెరుగైన వైద్య చికిత్సలను అందుబాటులోకి తీసుకు వచ్చారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement