తక్కెళ్లపాడులోని రవికుమార్ పొలంలో సీఎం జగన్ సరిహద్దు రాయి పాతనున్న ప్రాంతమిదే
సాక్షి, అమరావతి, సాక్షి, మచిలీపట్నం/జగ్గయ్యపేట: పొలం గట్ల తగాదాలు, భూ వివాదాలకు శాశ్వతంగా తెరదించేందుకు ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం’ ద్వారా భూముల సమగ్ర రీసర్వే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శ్రీకారం చుడుతోంది. పల్లె సీమల్లో శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా వందేళ్ల చరిత్రలో దేశంలోనే అతి పెద్ద రీసర్వేను తలపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు నుంచి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే రీసర్వే పూర్తయిన తక్కెళ్లపాడులో స్థిరాస్తి హక్కు పత్రాలు (క్యూఆర్ కోడ్‌తో కూడిన కార్డులు), భూమి హక్కు పత్రాలను యజమానులకు సీఎం జగన్ అందజేస్తారు.
అనంతరం ఇక్కడ సరిహద్దు రాయిని ప్రారంభించి 13 జిల్లాలకు చెందిన సర్వే బృందాలకు పచ్చజెండా ఊపడం ద్వారా రీసర్వేకి గ్రీన్‌సిగ్నల్ ఇస్తారు. మంగళవారం ప్రతి జిల్లాలో ఒక గ్రామంలో రీసర్వే పనులు ప్రారంభమవుతాయి. తదుపరి వారం రోజుల్లో ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఒక గ్రామంలోనూ, ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో ప్రతి మండలంలో ఒకటి చొప్పున 670 గ్రామాల్లో రీసర్వే ప్రారంభమవుతుంది. తదుపరి మొదటి విడత నిర్ణయించిన 5,122 గ్రామాల్లో ఈ ప్రక్రియ ఆరంభమవుతుంది. రెండో దశలో 6000, మూడో దశలో మిగిలిన గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి 2023 ఆగస్టు నాటికి రాష్ట్రమంతా రీసర్వే పూర్తి చేసేలా ప్రభుత్వం కాల వ్యవధితో ప్రణాళిక రూపొందించింది. దీర్ఘకాలంగా నెలకొన్న భూ వివాదాలను పరిష్కరించి యజమానులకు స్థిరాస్తులపై శాశ్వత హక్కులు కలి్పంచాలనే ఉదాత్త ఆశయంతో ముఖ్యమంత్రి ల్యాండ్ టైట్లింగ్ బిల్లు – 2020ని శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదింప చేశారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించగానే ల్యాండ్ టైట్లింగ్ చట్టం – 2020 గెజిట్‌లో ప్రచురిస్తారు.
1.26 కోట్ల హెక్టార్లలో ప్రతి అంగుళం కొలత
రాష్ట్రవ్యాప్తంగా అటవీ ప్రాంతం మినహా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులు (ఇళ్లు, స్థలాలు) ప్రతి అంగుళం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొలుస్తారు. 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల (1.26 కోట్ల హెక్టార్ల ) పరిధిలో ప్రతి సెంటు భూమి/ స్థలం కొలిచి సరిహద్దులు నిర్ణయిస్తారు. మ్యాపులు తయారు చేస్తారు.
రైతులకు ఎంతో మేలు: మంత్రి పెద్దిరెడ్డి
సమగ్ర భూసర్వేతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రోడ్డు మార్గం ద్వారా గరికపాడు, అనుమంచిపల్లి, షేర్‌మహ్మద్‌పేట మీదుగా జగ్గయ్యపేట చేరుకుని ఎస్‌జీఎస్ కళాశాలలో సోమవారం ఉదయం జరిగే బహిరంగసభలో పాల్గొంటారని తెలిపారు.
గట్టురాయి వివాదం పరిష్కారం
నాకు సర్వే నంబర్ 65/2లో 2.49 ఎకరాలుంది. గట్టు రాళ్లు లేకపోవడం, పాతిన రాళ్లు కదిలిపోవడం వల్ల తరచూ పొరుగు రైతులతో వివాదాలు తలెత్తేవి. పైలట్ ప్రాజెక్టుగా మా గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ సర్వేతో భూముల సరిహద్దు సమస్య పరిష్కారమైంది. నా పొలంలోనే నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సరిహద్దు రాయి ఏర్పాటు చేయనుండటం సంతోషంగా ఉంది.
– బజారు రవికుమార్, రైతు, తక్కెళ్లపాడు, కృష్ణా జిల్లా
Comments
Please login to add a commentAdd a comment