సమగ్ర భూ సర్వేపై గ్రామ సచివాలయాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలి. ప్రతి గ్రామ సచివాలయంలో భూ సర్వే ప్రయోజనాలపై పోస్టర్లు అతికించాలి. 1930 తర్వాత చేపడుతున్న తొలి భూముల రీసర్వే అయినందున గ్రామ సభల ద్వారా ప్రజలు, రైతుల్లో అవగాహన కల్పించాలి. ప్రజలకు సమగ్ర సమాచారం అందించడంతో పాటు, రీసర్వే వల్ల భూ యజమానులకు కలిగే మేలు గురించి అవగాహన కల్పించాలి. సమగ్ర భూ సర్వే చేసిన తర్వాత నాటే నంబరు రాళ్లన్నీ వెంటనే గుర్తించడానికి వీలుగా ఒకే డిజైన్‌లో ఉండాలి.
అర్బన్ ప్రాంతాల్లో కూడా సర్వే చేయాలి. అందువల్ల ప్రస్తుతమున్న 4,500 సర్వే బృందాలను పెంచుకోవాలి. సర్వే చేస్తున్న సమయంలో వచ్చే వివాదాలను వెంటనే పరిష్కరించేలా యంత్రాంగాన్ని క్రియాశీలకంగా రూపొందించుకోవాలి. సర్వే ప్రారంభం అయ్యే నాటికే మొబైల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన పరికరాలు, డ్రోన్లు, రోవర్లు, బేస్ స్టేషన్లు, సర్వే బృందాలకు అవసరమైన వాహనాలు సమకూర్చుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై సర్వేయర్లకు, అవసరమైన అంశాలపై గ్రామ సచివాలయాల సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వాలి.
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీన ప్రారంభించి 2023 ఆగస్టు నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం తన అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో జరిగిన రెవెన్యూ శాఖ ఉన్నత స్థాయి సమీక్షలో భూముల సమగ్ర రీసర్వేపై సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించాలని, పట్టణ ప్రాంతాలకు కూడా సమగ్ర రీసర్వేను అమలు చేసేందుకు వీలుగా సర్వే బృందాలను పెంచాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించడం వల్ల రికార్డులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతాయని, ఎక్కడా పొరపాట్లకు తావు ఉండదని సీఎం వివరించారు. భూ సర్వే కోసం కొనుగోలు చేసిన పరికరాలన్నీ గ్రామ సచివాలయాల్లో ఉంచాలని ఆదేశించారు. దీనివల్ల ఎప్పుడు ఎలాంటి అవసరమున్నా వినియోగించుకోవడానికి వీలవుతుందన్నారు. సమగ్ర రీసర్వేకు అత్యుత్తమ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సమీక్షలో అధికారులు సీఎంకు వివరించిన అంశాలు ఇలా ఉన్నాయి.
సమగ్ర భూ సర్వేపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రి ధర్మాన తదితరులు
ఎక్కడికక్కడ వివాదాలు పరిష్కరించేలా చర్యలు
► సర్వే సందర్భంగా వచ్చే వివాదాలను ఎక్కడికక్కడే పరిష్కరించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ప్రయోగాత్మకంగా భూ సర్వే పూర్తి చేశాం. ఈ గ్రామంలో గతంలో 182 కమతాలు ఉండగా, నేడు వీటి సంఖ్య 631కి చేరింది. ఇప్పుడు కూడా కమతాల కంటే సర్వే నంబర్లు ఎక్కువగా ఉన్నాయి. 631 కమతాలు ఉండగా 829 సర్వే నంబర్లు ఉన్నాయి.
► రికార్డుల స్వచ్ఛీకరణ వల్ల రైతులకు మేలు జరుగుతుంది. దశాబ్దాలుగా ఉన్న సమస్యలు తొలగిపోవడంతోపాటు భూ యజమానులు/ రైతులకు ప్రస్తుతమున్న ఊహాజనిత హక్కుల స్థానే శాశ్వత హక్కులు లభిస్తాయి.
► సర్వే సందర్భంగా తలెత్తే సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించేందుకు మొబైల్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. వివాదాలకు తావు లేకుండా భూ సమస్యలను పరిష్కరించడానికి ఇవి సహాయ పడతాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమగ్ర భూ సర్వే చేస్తున్న తొలి రాష్ట్రం మనదే.
► భూ సర్వే చేయగానే రోవర్ నుంచి నేరుగా ఆన్‌లైన్ పద్ధతుల్లో కంప్యూటర్లో పూర్తి వివరాలు నమోదవుతాయి. మధ్యలో ఏ వ్యక్తీ వాటిలో మార్పులు చేర్పులు చేయలేరు.
► ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. రెవెన్యూ కోర్టుల్లో 52,866 వివాదాలు ఉన్నాయి. వెబ్ ల్యాండ్ పొరపాట్లకు సంబంధించిన 79,405 రికార్డుల స్వచ్ఛీకరణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం.
► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నీరబ్ కుమార్ ప్రసాద్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ సిద్ధార్థ జైన్, పలువురు అధికారులు పాల్గొన్నారు. (ఇతర రాష్ట్రాల్లో ఆస్తి పన్ను విధానాలపై అధ్యయనం)
Comments
Please login to add a commentAdd a comment