శరవేగంగా సర్వే | Revenue Department Is Rapidly Making Arrangements For A Comprehensive Land Resurvey Across AP | Sakshi
Sakshi News home page

శరవేగంగా సర్వే

Published Sun, Dec 6 2020 3:12 AM | Last Updated on Sun, Dec 6 2020 8:16 AM

Revenue Department Is Rapidly Making Arrangements For A Comprehensive Land Resurvey Across AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు– భూరక్ష పథకం’ కింద రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ రీసర్వేకి రెవెన్యూ శాఖ శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమం సాగుతోంది. కంటిన్యుయస్లీ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్స్‌ (కార్స్‌) టెక్నాలజీ, డ్రోన్‌ కెమెరాలతో రీసర్వే చేసేందుకు వీలుగా సర్వే సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 21.21 కోట్లు విడుదల చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వందేళ్ల తర్వాత భూముల సమగ్ర రీసర్వే చేపడుతున్నందున దీనిపై గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికి తగ్గట్లు అధికారులు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. రీసర్వే సందర్భంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం మొబైల్‌ కోర్టులను కూడా ప్రభుత్వంఏర్పాటు చేయనుంది. 

ఎన్నో ఉపయోగాలు
– ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు – భూరక్ష పథకం’తో భూ యజమానులకు తమ భూములపై వేరొకరు సవాల్‌ చేయడానికి వీలులేని శాశ్వత హక్కులు లభిస్తాయి. దీనివల్ల భూ వివాదాలు తగ్గిపోతాయి. 
– అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను స్వచ్ఛీకరిస్తున్నారు. దీంతో చనిపోయిన వారి పేర్లతో ఉన్న భూములు వారి వారసుల పేర్లతో రికార్డుల్లో నమోదు అవుతాయి. 
– వాస్తవంగా ఉన్న భూముల విస్తీర్ణం ప్రకారం రికార్డులు సవరిస్తారు. 
– భూములు తమ పేర్లతో రికార్డుల్లోకి ఎక్కడంవల్ల వడ్డీలేని పంట రుణాలకు అవకాశం కలుగుతుంది. 
– రాష్ట్రంలో ప్రస్తుతం సర్వే నంబర్ల వారీగా హద్దు రాళ్లు లేవు. దీంతో సరిహద్దుల తగాదాలు ఎక్కువగా ఉన్నాయి. రీసర్వేతో ప్రతి సర్వే నంబరుకు హద్దులు నిర్ధారణ అవుతాయి. 
– గత పాలకుల హయాంలో రైతులు భూమిని కొలత వేయించుకోవాలంటే నిర్దిష్ట రుసుం చెల్లించడంతోపాటు ముడుపులివ్వాల్సి వచ్చేది. ప్రస్తుతం ప్రభుత్వమే ఉచితంగా భూమిని కొలత వేసి సరిహద్దు రాళ్లు నాటిస్తుంది. 
– ప్రజలకు ఆధార్‌ ఉన్నట్లే ప్రతి భూభాగానికి భూధార్‌ అనే విశిష్ట గుర్తింపు సంఖ్యను ప్రభుత్వం కేటాయిస్తుంది.
– ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రకారమే క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల్లో అప్‌డేట్‌ (మార్పులు) చేస్తారు. దీంతో మోసపూరిత రిజిస్ట్రేషన్లకు, రికార్డుల ట్యాంపరింగ్‌కు అవకాశం ఉండదు. ఒకరి భూమిని మరొకరు రిజిస్ట్రేషన్‌ చేయడానికి ఏమాత్రం ఆస్కారం ఉండదు. 
– ప్రతి సర్వే నంబర్‌ను డ్రోన్‌ కెమెరాతో ఫొటో తీసి సర్వే రికార్డులతో మ్యాచ్‌ చేస్తారు. వీటిని డిజిటలైజ్‌ చేస్తారు. దీంతో రికార్డులు భద్రంగా ఉంటాయి. 
– కొన్ని చోట్ల కొందరికి సంబంధించి రికార్డుల్లో భూమి ఒకచోట ఉంటే అనుభవిస్తున్న భూమి మరోచోట ఉంది. ఇలాంటివి కూడా బయటకు వస్తాయి. 
– ఆక్రమణల్లోని ప్రభుత్వ భూములు బయటపడతాయి.  

ఇదో సాహసోపేత నిర్ణయం
– ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌
భూవివాదాల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమగ్ర భూసర్వే చేయాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దేశంలో వందేళ్ల తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వమే ఈ యజ్ఞం లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దీనిని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేస్తున్నాం. దీని కోసం రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమం సాగుతోంది. రెవెన్యూ కోర్టుల్లో ఉన్న 52,866 కేసులు, వెబ్‌ల్యాండ్‌లో సవరణలో కోసం వచ్చిన 79,405 అర్జీలను స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా పరిష్కరిస్తాం. 

మూడు దశల్లో..
► ఈనెల 21వ తేదీన భూముల సమగ్ర రీసర్వే కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. 
► దేశంలోనే మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో కార్స్‌ టెక్నాలజీని వినియోగించనున్నారు.
► రాష్ట్రంలో 90 లక్షల మంది పట్టాదారులు ఉన్నారు. వారికి చెందిన 1.96 కోట్ల సర్వే నంబర్ల పరిధిలో 2.26 కోట్ల ఎకరాల భూమిని రీసర్వే చేయాల్సి ఉంది. మూడు దశల్లో దీనిని పూర్తి చేస్తారు.
► మొదటి దశలో 5 వేల గ్రామాల్లోనూ, రెండో దశలో 6,500, మూడో దశలో 5,500 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ చేపడతారు. 
► 2023 ఆగస్టు నాటికి మొత్తం సర్వే ప్రక్రియ పూర్తి చేస్తారు. రీసర్వే కోసం రాష్ట్ర వ్యాప్తంగా 4,500 బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement