‘భూ’ చరిత్రలో సువర్ణాధ్యాయం | All services within the village boundaries with a comprehensive re-survey of lands | Sakshi
Sakshi News home page

‘భూ’ చరిత్రలో సువర్ణాధ్యాయం

Published Thu, Dec 10 2020 4:09 AM | Last Updated on Thu, Dec 10 2020 9:40 AM

All services within the village boundaries with a comprehensive re-survey of lands - Sakshi

అదే ఊళ్లోనే సర్వేయర్‌ ఉంటాడు. రికార్డులన్నీ డిజిటల్‌ రూపంలోనూ భద్రంగా ఉంటాయి. యజమానికి హార్డ్‌ కాపీ ఇస్తారు. ఏవైనా వివాదాలు తలెత్తినా ప్రతి మండలంలో ఓ ట్రైబ్యునల్‌ ఉంటుంది. భవిష్యత్తులో అదే ఊళ్లోనే క్రయవిక్రయాలు జరుపుకోవచ్చు. అక్కడే రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. శాశ్వత హక్కులు కల్పించాక ఎలాంటి వివాదాలు వచ్చినా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని హక్కుదారుడికి నష్ట పరిహారం చెల్లిస్తుంది.

భూముల రీ సర్వే చరిత్రాత్మక కార్యక్రమం. ఇంటి స్థలం, పొలం.. ప్రతి స్థిరాస్తిని పక్కాగా సర్వే చేసి, రికార్డుల్లో నమోదు చేసి.. తొలుత యజమానులకు దానిపై తాత్కాలిక హక్కు (టెంపరరీ టైటిల్‌) ఇస్తాం. రెండేళ్ల పాటు ఈ రికార్డు గ్రామ సచివాలయంలో ఉంచి, ప్రజల నుంచి అభ్యంతరాలు ఆహ్వానిస్తాం. ఎవరి నుంచి అభ్యంతరాలు రానిపక్షంలో ఆ భూములపై యజమానులకు శాశ్వత హక్కులు (పర్మినెంట్‌ టైటిల్‌) ఇస్తాం. 

సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అతి పెద్ద సమగ్ర భూ రీసర్వే కార్యక్రమం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం – సర్వే ఆఫ్‌ ఇండియా కలిసి భారీ స్థాయిలో చేపడుతున్న ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు – భూరక్ష’  కార్యక్రమానికి ఈనెల 21న శ్రీకారం చుట్టనున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ అంశాలపై మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్థిరాస్తిని సర్వే చేసి, హద్దులు నిర్ణయించి.. శాశ్వత హక్కు (కంక్లూజివ్‌ టైటిల్‌) కల్పించే ఈ కార్యక్రమం ప్రతి దశలో పకడ్బందీగా జరిగేలా చూడాల్సిన కీలక బాధ్యత కలెక్టర్లపై ఉందని స్పష్టం చేశారు. రీసర్వే తర్వాత అన్ని రకాల రెవిన్యూ, రిజిస్ట్రేషన్‌ సేవలు వార్డు, గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. దేశంలో ఎక్కడా, ఎప్పుడూ ఇంత పెద్ద స్థాయిలో సర్వే జరగలేదని, గ్రామాల్లో తరతరాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు ఈ బృహత్తర కార్యక్రమంతో పరిష్కారమవుతాయని చెప్పారు. దీంతో భూ వివాదాలకు తావుండదని, ఫలితంగా గ్రామాల్లో శాంతియుత వాతావరణం ఏర్పడుతుందని వివరించారు. భూ యజమానులకు న్యాయమైన, చట్టబద్ధమైన శాశ్వత హక్కులు లభిస్తాయని, భావితరాలకు సైతం మంచి వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
 
బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ
► ఒక మంచి బృహత్తర కార్యక్రమం మొదటి దశకు మనం ఈనెల 21న శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, సర్వే ఆఫ్‌ ఇండియా కలిసి 70 బేస్‌ స్టేషన్లు పెడుతున్నాయి. సర్వే ఆఫ్‌ ఇండియా నెట్‌వర్క్‌లో ఇవి భాగంగా ఉంటాయి. కొలతల్లో అత్యంత కచ్చితత్వం వస్తుంది. (ఒక పాయింట్‌ను బేస్‌గా తీసుకుంటే ఎన్నిసార్లు మార్చినా 2 సెంటీమీటర్లు అటు ఇటుగా అనగా అతిసూక్ష్మ తేడా మాత్రమే ఉంటుంది) 
► ఇందుకోసం అత్యాధునిక కార్స్‌ టెక్నాలజీ, డ్రోన్లు, రోవర్లు వాడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేరకు సర్వే చేస్తున్నాం. 

ఈనెల 21న 5 వేల గ్రామాల్లో శ్రీకారం
► మొదటి దశ కింద ప్రతి మండలంలో కొన్ని చొప్పున రాష్ట్రంలోని 5 వేల రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 21వ తేదీన రీసర్వే ప్రారంభించి వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి చేస్తాం. 
► రెండో దశ కింద ప్రతి మండలంలో కొన్ని చొప్పున ఆగస్టు 2021న 6,500 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే ప్రారంభించి 2022 ఏప్రిల్‌ నాటికి పూర్తి చేస్తాం. 
► మిగిలిన గ్రామాల్లో మూడో విడత కింద జూలై 2022న ప్రారంభించి జూన్‌ నెలకు పూర్తి చేస్తాం. దీంతో రాష్ట్రమంతా రీసర్వే పూర్తవుతుంది.
► మొదటి విడత సర్వే పూర్తయిన గ్రామాల్లోని సచివాలయాల్లో ఈ రికార్డుల ప్రకారం రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభిస్తారు. అక్కడే రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి.

కలెక్టర్లది కీలక బాధ్యత
► ఈ కార్యక్రమంలో కలెక్టర్లపై కీలక బాధ్యత ఉంది. వీటన్నింటినీ కలెక్టర్లు దగ్గరుండి చూసుకోవాలి. సర్వేకు సన్నద్ధతపై జాగ్రత్తలు తీసుకోవాలి. ల్యాండ్‌ టైటిలింగ్‌ అథారిటీని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా స్థాయిలో ట్రైబ్యునల్స్‌ ఏర్పాటు చేయాలి. అప్పిలేట్‌ ట్రైబ్యునల్స్‌ను కూడా రిటైర్డ్‌ న్యాయమూర్తులతో ఏర్పాటు  చేస్తాం. 
► డ్రోన్ల ద్వారా సర్వే మొదలుపెట్టే సమయానికి గ్రామాల సరిహద్దులు, వాటి మార్కింగ్స్‌ను పూర్తి చేయాలి.  ప్రతి మండలంలో ఒక డ్రో¯Œన్, డేటా ప్రాసెసింగ్, రీసర్వే బృందాలను కలెక్టర్లు ఏర్పాటు చేయాలి. 
► సర్వే వల్ల జరిగే మేలు గురించి ప్రతి ఒక్కరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. భూ వివాదాలకు రీసర్వే, ల్యాండ్‌ టైట్లింగ్‌ శాశ్వత పరిష్కార మార్గాలు. వీటి వల్ల ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది.
► గ్రామ, వార్డు వాలంటీర్ల సహాయంతో ప్రతి ఒక్కరికీ ఈ విషయాలు తెలియజెప్పే కార్యక్రమాన్ని ఈనెల 11వ తేదీ వరకు కొనసాగించండి. ఈ నెల 14 నుంచి 19 వరకు గ్రామ సభలు పెట్టండి. 
► వారికి కావాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రి కాలేదన్న బాధతో ఎల్లో మీడియా సమగ్ర సర్వేకు వ్యతిరేకంగా దుష్ప్రచారం సాగిస్తోంది. రీసర్వే జరగడం, ప్రభుత్వానికి మంచిపేరు రావడం ఎల్లో మీడియాకు, విపక్షానికి ఇష్టం లేనందున ఇలా చేస్తున్నాయి. అందువల్ల ఈ పథకం ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసి, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగాలి. 
► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్‌ నీలం సాహ్ని, సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా లెఫ్టినెంట్‌ జనరల్‌ గిరీష్‌ కుమార్, వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

వివాదాల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునళ్లు
► వందేళ్ల తర్వాత రీసర్వే జరుగుతుండటం వల్ల కొన్ని చోట్ల కొన్ని వివాదాలు వస్తాయి. అందువల్ల వీటి పరిష్కారానికి ప్రతి మండలంలో ఒక మొబైల్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేస్తాం. 660 మొబైల్‌ మెజిస్ట్రేట్‌ ట్రైబ్యునల్స్‌ అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తాయి. 
► 100 ఏళ్ల తర్వాత ఈ సర్వే జరుగుతోంది. గత వందేళ్లలో జనాభా నాలుగైదు రెట్లు పెరిగింది. కుటుంబాలు విడిపోయాయి. పెద్దలు చనిపోయి వారి వారసులు భూములు అనుభవిస్తున్నారు. ఈ మేరకు రికార్డులు అప్‌డేట్‌ కాలేదు. క్షేత్ర స్థాయిలో ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. 
► రికార్డుల స్వచ్ఛీకరణ ద్వారా మొత్తం రికార్డుల్లో నమోదు చేస్తాం. సర్వే చేసి సరిహద్దు రాళ్లు నాటిస్తాం. ఆ కార్డులో క్యూర్‌ఆర్‌ కోడ్‌ ఉంటుంది. హార్డ్‌ కాపీ కూడా ఇస్తారు. ప్రతి ల్యాండ్‌ పార్సిల్‌కు ఒక నంబరు కేటాయిస్తాం. ల్యాండ్‌ పార్సిళ్లు, మ్యాపులు కూడా గ్రామంలో అందుబాటులో ఉంచుతాం.
► రికార్డులన్నింటినీ డిజిటలైజేష¯Œన్‌ చేస్తాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో స్థిరాస్తుల మ్యాపులు, డిజిటల్‌ రికార్డులు అందుబాటులో ఉంచుతాం. 
► 14 వేల మంది సర్వేయర్లును ప్రభుత్వం నియమించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న వీరందరికీ అత్యాధునిక సర్వేపై శిక్షణ కార్యక్రమం సాగుతోంది. ఇప్పటికే 9,400 మందికి శిక్షణ పూర్తయింది. మిగిలిన వారికి వచ్చే ఏడాది జనవరి 26 నాటికి శిక్షణ కార్యక్రమం పూర్తి చేస్తాం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement