భూ రక్షకు ఢోకా లేదిక | CM YS Jagan Says That Revolutionary Changes Will Be In AP With Land Re-Survey | Sakshi
Sakshi News home page

భూ రక్షకు ఢోకా లేదిక

Published Wed, Dec 9 2020 2:53 AM | Last Updated on Wed, Dec 9 2020 11:28 AM

CM YS Jagan Says That Revolutionary Changes Will Be In AP With Land Re-Survey - Sakshi

సమగ్ర భూ సర్వే వల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుంది. ఇది విప్లవాత్మక చర్య. ప్రజలపై నయాపైసా కూడా భారం పడదు. మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. రైతుల ప్రయోజనార్థం ఈ కార్యక్రమం చేపడుతున్నాం. గత వందేళ్లలో ఎక్కడా రీసర్వే చేయలేదు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసమే సాహసోపేతంగా ఈ నిర్ణయం తీసుకున్నాం.
– సీఎం వైఎస్‌ జగన్‌

ఎన్నెన్నో ఉపయోగాలు
► ప్రస్తుతం యజమానులకు భూములపై ఊహాజనితమైన హక్కులు మాత్రమే ఉన్నాయి. రీసర్వే తర్వాత శాశ్వత హక్కులతో కూడిన (ల్యాండ్‌ టైటిలింగ్‌) కార్డు అందజేస్తారు. ఈ కార్డులో ఆధార్‌ తరహాలో విశేష గుర్తింపు సంఖ్య (యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌) ఉంటుంది. 
► ఇందులో యజమాని పేరు, ఫొటో, క్యూ ఆర్‌ కోడ్‌ ఉంటాయి. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఆయా రైతులకు సంబంధించిన ఆస్తుల (భూమి) కొలతలు, సమగ్ర సమాచారం కనిపిస్తుంది.
► సర్వే పూర్తయిన తర్వాత డిజిటలైజ్డ్‌ కెడస్ట్రల్‌ మ్యాపులు రూపొందిస్తారు. గ్రామంలోని ప్రతి కమతం, భూమి వివరాలు ఈ మ్యాప్‌లో ఉంటాయి. వీటి ప్రకారం ప్రతి సర్వే నంబరుకు సర్వే రాళ్లు నాటుతారు. 
► ప్రతి గ్రామ సచివాలయంలో ఆ గ్రామానికి చెందిన డిజిటలైజ్డ్‌ ప్రాపర్టీ (ఆస్తి), టైటిల్‌ రిజిస్టర్లతోపాటు వివాదాల నమోదుకూ రిజిస్టర్లు ఏర్పాటు చేస్తారు.

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం విప్లవాత్మక మార్పులకు నాంది కానుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సమగ్ర భూముల రీసర్వే పూర్తికాగానే భూ యజమానులకు శాశ్వత భూ హక్కులతో కూడిన డిజిటల్‌ కార్డులు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఎన్నో వివాదాలకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. భూ రికార్డులన్నీ డిజిటలైజ్‌ చేయడం వల్ల ట్యాంపరింగ్‌కు ఏమాత్రం అవకాశం ఉండదని.. పట్టణాలకు, నగరాలకు వెళ్లాల్సిన పని లేకుండా సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ సేవలను కూడా అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం’పై మంగళవారం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా సమగ్ర భూ సర్వేను ఈ నెల 21 ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. సర్వే సిబ్బందికి శిక్షణ కోసం తిరుపతిలో కనీసం 50 ఎకరాల విస్తీర్ణంలో కళాశాల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సర్వే సందర్భంలోనే ఈ కాలేజీ నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం’పై మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లకు పక్కా ఏర్పాట్లు
► ఒక గ్రామంలో సర్వే పూర్తయి కెడస్ట్రల్‌ మ్యాపులు సిద్ధం కాగానే అదే గ్రామ సచివాలయంలో ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభించాలి. ఆ మేరకు గ్రామ సచివాలయాల్లో కావాల్సిన మార్పులు చేసుకోవాలి. భూ వివాదాల పరిష్కారానికి మొబైల్‌ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. ఇందుకు అవసరమైన వాహనాలు, ఇతర మౌలిక ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి.
► సర్వేలో పాల్గొనే సిబ్బందికి మంచి శిక్షణ, ఓరియెంటేష¯Œన్‌ ఇవ్వాలి. సర్వే పూర్తయ్యాక ఆ రికార్డులను ట్యాంపర్‌ చేయడానికి వీలులేని విధంగా పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో డిజిటలైజ్‌ చేసి భద్రపరచాలి.
► ఆ మేరకు సర్వే వ్యవస్థను పటిష్టంగా, మంచి సాంకేతిక పరిజ్ఞానంతో బలోపేతం చేయాలి. భూ యజమానుల వద్ద హార్డ్‌ కాపీ ఉండేలా చూడాలి.

 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల సర్వే
► రాష్ట్రంలోని 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల (1.26 కోట్ల హెక్టార్ల ) పరిధిలో ప్రతి సెంటు భూమి/స్థలం రీ సర్వే చేస్తారు. సుమారు 90 లక్షల మందికి చెందిన 2.26 కోట్ల ఎకరాలు రీసర్వేలో భాగంగా కొలుస్తారు. 
► అటవీ ప్రాంతం మినహా గ్రామాలు, ఆవాసాలు, పట్టణాలు, నగరాల్లో ఈ పథకం కింద సర్వే నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,460 రెవెన్యూ గ్రామాలున్నాయి. మొదటి విడతలో 5,000, రెండో విడతలో 6,500, మూడో విడతలో 5,500 గ్రామాల్లో రీ సర్వే జరుపుతారు. 
► పట్టణాలు, నగరాల్లోని 3345.93 చదరపు కిలోమీటర్ల పరిధిలో 10 లక్షల ఓపెన్‌న్‌ప్లాట్లు, 40 లక్షల అసెస్‌మెంట్ల పరిధిలో సర్వే చేస్తారు. 

 సర్వే ఆఫ్‌ ఇండియా సాంకేతిక సహకారం
► భూముల రీ సర్వేకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్‌ ఇండియా పూర్తి స్థాయి సాంకేతిక సహకారం అందిస్తుంది. ఇందుకోసం సిబ్బందికి అవసరమైన శిక్షణ, సాంకేతిక నైపుణ్యం అందిస్తుంది. ఈ మేరకు సర్వే ఆఫ్‌ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల తొమ్మిదో తేదీ (బుధవారం) అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కురుర్చుకోనుంది. 
► ప్రతి మండలానికి ఒక డ్రోన్, డేటా ప్రాసెసింగ్, రీసర్వే బృందాలు ఉంటాయి. ఇప్పటికే 9,400 మంది సర్వేయర్లకు శిక్షణ ఇచ్చారు. మిగిలిన వారికి కూడా త్వరలో శిక్షణ పక్రియ పూర్తి చేయనున్నారు. 
► ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సీసీఎల్‌ఏ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ప్రజల్లో అపోహలు సృష్టించే కుట్ర 
► ప్రజలకు ఇంత మేలు చేయాలని ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభిస్తుంటే ప్రతిపక్షం, దానికి కొమ్ము కాసే మీడియా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడం ద్వారా దీనికి అవాంతరాలు కల్పించాలని కుట్ర పన్నింది. ఇందులో భాగంగానే దీనిపై విష ప్రచారానికి పూనుకుని తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. 
► ఈ కుట్రపూరిత అసత్య వార్తలు, విష ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలి. అపోహలు, అనుమానాలు సృష్టిస్తున్న అంశాలను గుర్తించి ప్రజలను చైతన్య పరుస్తూ, సమగ్ర సర్వే వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను తెలియజేయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement