మరోసారి భూ రికార్డుల వడపోత | Clear details of pass book issuance | Sakshi
Sakshi News home page

మరోసారి భూ రికార్డుల వడపోత

Published Fri, Feb 9 2018 1:42 AM | Last Updated on Fri, Feb 9 2018 1:42 AM

Clear details of pass book issuance - Sakshi

రెవెన్యూ ఉన్నతాధికారులు

సాక్షి, హైదరాబాద్‌: భూ రికార్డుల ప్రక్షాళన గణాంకాలను ప్రభుత్వం మరో సారి వడపోస్తోంది. రైతులకు పాసు పుస్తకాలు జారీ చేసేందుకు గాను ప్రామాణికంగా ఉండేలా రాష్ట్రంలోని భూముల వివరాలను మరోసారి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తోంది. ఇందుకోసం ల్యాండ్‌ రికార్డ్స్‌ అప్‌గ్రెడేషన్‌ ప్రోగ్రామ్‌ (ఎల్‌ఆర్‌యూపీ) వెబ్‌సైట్‌లోనే కొత్త విభాగంలో భూముల వివరాలను ప్రత్యేకంగా గుర్తిస్తోంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను గ్రామాల వారీగా ఈ కొత్త మాడ్యుల్‌లో నమోదు చేయాలని, వారంలోగా ఈ పనిని పూర్తి చేయాలని రెవెన్యూ ఉన్నతాధికారుల నుంచి అన్ని జిల్లాలకు ఆదేశాలు వెళ్లాయి.  
స్పష్టతకోసం మరోసారి..  
భూ రికార్డుల ప్రక్షాళనలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సర్వే నంబర్ల వారీగా రికార్డుల పరిశీలన, తప్పొప్పుల సవరణ జరిగాయి. ఈ వివరాలన్నింటినీ క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తోంది. ఇందులో భూములను రెండు కేటగిరీలుగా విభజించి 24 కాలమ్‌ల ఫార్మాట్‌లో వివరాలు పొందుపరుస్తోంది. ఈ రెండు కేటగిరీల్లో ఒకటి ఎలాంటి వివాదాలు లేని భూములు కాగా, మరోటి వివాదాల్లో ఉన్న భూములు. ఈ 24 కాలమ్‌ల ఫార్మాట్‌లో కూడా ప్రభుత్వం అసైన్‌చేసిన భూములు, భూసేకరణ జరిపిన భూములు, అటవీ, వాటర్‌ బాడీస్, కోర్టు కేసుల్లో ఉన్న భూములు, రోడ్లు, ప్రభుత్వ కార్యాలయ భవనాలున్న భూములు, వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలోని భూములు, వక్ఫ్, దేవాదాయ, సాదా బైనామాలు... ఇలా పలు రకాలుగా నమోదు చేస్తున్నారు. వీటితో పాటు ప్రత్యేకంగా మళ్లీ వ్యవసాయేతర భూములను కూడా పొందుపరుస్తున్నారు. ఇన్నిరకాల భూముల నేపథ్యంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలను ఎల్‌ఆర్‌యూపీ ద్వారా గుర్తించి పాసు బుక్కులు జారీ చేయడం కొంత ఇబ్బందిగా ఉండే అవకాశాలున్నాయి.

దీంతో మరోసారి స్పష్టంగా భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలిచ్చినట్టు రెవెన్యూ ఉన్నతాధికారులు చెబుతున్నా రు. కేవలం వ్యవసాయ, వ్యవసాయే తర కేటగిరీల్లో రాష్ట్రంలోని అన్ని రకాల భూముల వివరాలను నమోదు చేయిస్తున్నామని, తద్వారా వ్యవసా య భూములకు పాసు పుస్తకాల జారీ ప్రక్రియ సులభమవుతుందని వారంటున్నారు. ఇటీవల జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇచ్చిన ఆదేశాల మేరకు గురువారం నుంచే కొత్త మాడ్యూల్‌లో భూముల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభమయినట్టు సమాచారం. మరోసారి ఆన్‌లైన్‌లో నమోదు చేసే కార్యక్రమం మరోవారం రోజుల్లో ముగుస్తుందని, ఈ వివరాలనే పాసు పుస్తకాల జారీకి ప్రామాణికంగా తీసుకుంటామని రెవెన్యూ అధికారులు చెపుతుండడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement