సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే నేపథ్యంలో భూ రికార్డుల స్వచ్ఛీకరణ (ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్) కార్యక్రమం వేగంగా జరుగుతోంది. వైఎస్సార్ జగనన్న భూరక్ష, శాశ్వత భూ హక్కు పథకం కింద వందేళ్ల తర్వాత నిర్వహిస్తున్న రీ సర్వేలో రికార్డుల స్వచ్ఛీకరణ అత్యంత కీలకం కావడంతో ప్రభుత్వం దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తయితేనే ఆయా గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే రీ సర్వే ప్రారంభానికి ముందే గ్రామాల్లో భూ రికార్డులను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
వెబ్‌ల్యాండ్ అడంగల్స్‌ను ఆర్‌ఎస్‌ఆర్‌తో పోల్చి చూడటం, అడంగల్‌లో పట్టాదారుని వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసి సరిచేయడం వంటి పనులు పక్కాగా చేయాలి. ఈ పనిని కింది స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం చేయాలి. రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తయిన గ్రామాల్లోనే రీ సర్వేలో మొదట నిర్వహించే డ్రోన్ ఫ్లైయింగ్‌ను సర్వే బృందాలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం రికార్డుల స్వచ్ఛీకరణపై ఫోకస్ పెట్టింది. మొత్తంగా 17,564 గ్రామాలను మూడు కేటగిరీలుగా విభజించి స్వచ్ఛీకరణ చేయిస్తున్నారు.
అనంతపురంలో నూరు శాతం పూర్తి
అనంతపురం జిల్లాలోని మొత్తం 504 గ్రామాల్లోనూ రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తయింది. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 315 గ్రామాలకు గాను.. 314 గ్రామాల్లో స్వచ్ఛీకరణను పూర్తి చేశారు. చిత్తూరు జిల్లాలో 846 గ్రామాలకు గాను 835 గ్రామాల్లోను, సత్యసాయి జిల్లాలో 461 గ్రామాలకు గాను 455 గ్రామాల్లో స్వచ్ఛీకరణ పూర్తయింది. విశాఖ, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో స్వచ్ఛీకరణ నెమ్మదిగా జరుగుతుండటంతో వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
రీ సర్వే షెడ్యూల్‌కు అనుగుణంగా భూ రికార్డుల స్వచ్ఛీకరణను పూర్తి చేసేందుకు గడువును నిర్దేశించారు. దాని ప్రకారం ఆరు రకాల సర్క్యులర్ ప్రకారం రికార్డులను అప్‌డేట్ చేసే పని వేగంగా జరుగుతోంది. తద్వారా రీ సర్వే కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం సర్వే బృందాలు వడివడిగా నిర్వహిస్తున్నాయి.
ప్రతి నెలా సమీక్ష
స్వచ్ఛీకరణ ఎలా చేయాలనే దానిపై రెవెన్యూ శాఖ ఆరు సర్క్యులర్లు జారీ చేసింది. ఒక్కో సర్క్యులర్ ప్రకారం ఒక్కో దశను పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటి ప్రకారం స్వచ్ఛీకరణ ఎంత మేరకు జరిగిందనే దానిపై ప్రతి నెలా కలెక్టర్లు, జేసీలతో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా ఎన్ని గ్రామాల్లో ఆరు రకాల సర్క్యులర్‌ల ప్రకారం పని జరిగిందో పరిశీలిస్తూ తగిన సూచనలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment