సాక్షి, అమరావతి: పొలం గట్లు (సరిహద్దు), భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్రంలోని భూముల సమగ్ర రీ సర్వేకి రంగం సిద్ధమవుతోంది. మూడు దశల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు రెవెన్యూ శాఖ కార్యాచరణ రూపొందించింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో రీ సర్వే పైలట్ ప్రాజెక్ట్ ఇప్పటికే పూర్తయ్యింది. ఇందుకు సంబంధించిన నివేదికను రెవెన్యూ శాఖ ఈనెల 18న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పించనుంది. ప్రయోగాత్మకంగా చేసిన రీ సర్వేలో ఎదురైన అనుభవాలు, వచ్చిన ఫలితాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా కచ్చితత్వంతో రీ సర్వే చేపట్టేందుకు అధికారులు ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. దీనిపై ఈనెల 21న రెవెన్యూ అధికారులతో సీఎం సమీక్షించి మార్గనిర్దేశం చేయనున్నారు.
మూడు దశల్లో చేపడతాం
ప్రతి మండలంలో మూడోవంతు గ్రామాల్లో మూడు దశల్లో రీ సర్వే పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర రీ సర్వేకు ఎప్పుడు శ్రీకారం చుట్టాలనేది ముఖ్యమంత్రి ప్రకటిస్తారు.
– వి.ఉషారాణి, ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ
కార్స్ టెక్నాలజీతో..
► రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 1.63 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇందులో అటవీ విస్తీర్ణం పోగా రీ సర్వే చేయాల్సిన విస్తీర్ణం 1.22 లక్షల చదరపు కిలోమీటర్లు.
► ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి.. కొత్తగా నియమించిన 11,158 మంది గ్రామ సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత వీరిని రీ సర్వేకి వినియోగించుకుంటారు.
► ఇప్పటివరకూ మలేషియా, సింగపూర్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో అమల్లో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కంటిన్యూస్‌లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ (కార్స్) టెక్నాలజీతో దేశంలోనే మొదటిసారి మన రాష్ట్రంలో రీ సర్వే మహా క్రతువు నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
► ప్రతి గ్రామ సచివాలయానికి ఒకరు చొప్పున సర్వేయర్లు అందుబాటులోకి రావడంతో సమగ్ర రీ సర్వేతోపాటు గ్రామాల్లో ఎప్పుడు భూములు కొలతలు వేయాలన్నా, సబ్ డివిజన్ చేయాలన్నా ఇక సర్వేయర్ల కొరత మాటే ఉండదు.
► కోవిడ్–19 నియంత్రణ చర్యల కారణంగా నిలిచిపోయిన రికార్డుల స్వచ్ఛీకరణను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు కసరత్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment