సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని భూములు, స్థిరాస్తుల రీసర్వే అత్యంత క్లిష్టమైన పని. రాష్ట్రంలో 17,460 రెవెన్యూ గ్రామాలు, 47,861 ఆవాసాలు, 110 పట్టణ, నగరపాలక సంస్థల పరిధిలోని భూములు, స్థలాలు, ఇళ్లు సర్వేచేసి హద్దులు నిర్ణయించి హక్కుపత్రాలు ఇవ్వడమనేది ఆషామాషీ వ్యవహారం కాదు. అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డులు, నకిలీ రికార్డులు వంటి ఎన్నో చిక్కుముళ్లున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక పరిజ్ఞానం వినియోగించినా కొలతల్లో వచ్చే అతిసూక్ష్మ తేడా, వాస్తవ భూమికి, రికార్డుల్లోని గణాంకాలకు మధ్య ఉన్న భారీ తేడా, డ్యూయల్ రిజిస్ట్రేషన్లు, ట్యాంపరింగైన రికార్డులు వంటి సమస్యల్ని రీసర్వే క్రతువులో అధిగమించాల్సి ఉంటుంది. అందుకే రీసర్వేని రెవెన్యూ నిపుణులు మహాయజ్ఞంగా అభివర్నిస్తున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విషయంలో దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుంది.
ఈ మహాక్రతువులో భాగస్వామ్యం కల్పించినందుకు వ్యక్తిగతంగా, సంస్థ తరఫున సీఎం జగన్‌కు, ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని దేశంలోనే అతి పురాతన, ప్రపంచంలోనే అతిపెద్ద సర్వే సంస్థ.. సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గిరీష్కుమార్ బహిరంగంగానే చెప్పారంటే ఈ సర్వేకి ఎంత ప్రాధాన్యం ఉందో అర్థమవుతోంది. క్లిష్టమైన సమస్యలను అధిగమించి రీసర్వే పూర్తిచేస్తే గోల్డెన్ రికార్డులు రూపుదిద్దుకుంటాయి. భూతగాదాలు, పొలం గట్ల వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. తర్వాత క్రయవిక్రయాలు, చట్టబద్ధమైన వారసత్వం ప్రకారం కేవలం మ్యుటేషన్లు చేసుకుంటూ వెళితే వచ్చే 40 నుంచి 50 ఏళ్లపాటు ఈ రికార్డులు అద్భుతంగా ఉంటాయి. ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రకారం భూ యజమానులకు శాశ్వత భూహక్కులు కల్పించిన మొదటి రాష్ట్రంగా ఏపీ చరిత్రలో నిలుస్తుంది. రికార్డుల స్వచ్చికరణ, రీసర్వే ప్రక్రియలను అంకితభావంతో పూర్తిచేయాల్సిన గురుతర బాధ్యత రెవెన్యూ సిబ్బందిపై ఉంది.
కొలతల్లో తేడాలు
దుకాణానికి వెళ్లి బంగారం కొని వెంటనే పక్క షాపునకు వెళ్లి తూకం వేయిస్తే 10 నుంచి 20 మిల్లీగ్రాముల వరకు తేడా వస్తుంది. దీన్ని తప్పుగా పరిగణించడానికి వీలులేని అతిసూక్ష్మ తేడా అంటారు. తూకాల్లో లాగే భూమి కొలతల్లో కూడా అతిసూక్ష్మ తేడాలు వస్తాయి. ప్రపంచంలోనే అత్యాధునిక కార్స్ టెక్నాలజీతో సర్వేచేసినా ఇవి వస్తాయి. ఒక పాయింట్‌ను బేస్‌గా తీసుకుని కొలత వేసిన తర్వాత మరోసారి అలాగే తీసుకుని చూస్తే గరిష్టంగా ఐదు సెంటీమీటర్ల వరకు ఎక్కువ లేదా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే సర్వే పరిభాషలో ప్లస్ ఆర్ మైనస్ 5 సెంటీమీటర్ల ఎర్రర్ అని అంటారు. సాధారణంగా రెండు సెంటీమీటర్లు మించి తేడా రాదు. కొన్నిచోట్ల ఐదు సెంటీమీటర్ల వరకు రావచ్చని సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఇది పరిగణనలోకి తీసుకోవాల్సిన దానికంటే తక్కువని అర్థం. ఇలాంటి తేడాలను కూడా అంగీకరించనివారికి వాస్తవాలు వివరించడం, ప్రత్యామ్నాయ మార్గాల్లోనూ కొలిచి చూపడం ద్వారా ఒప్పించాల్సి ఉంటుంది.
తక్కెళ్లపాడులో నాలుగెకరాల తేడా
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో పైలెట్ ప్రాతిపదికన నిర్వహించిన రీసర్వేలో ఆర్‌ఎస్‌ఆర్‌కు, వాస్తవ కొలతలకు మధ్య నాలుగెకరాల తేడా వచ్చింది. తమ భూముల కొలతల విషయంలో 35 మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు వాస్తవాలు వివరించడం ద్వారా వారిని ఒప్పించారు.
నేటి నుంచి అవగాహన
రీసర్వేని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం బ్లూప్రింట్ సిద్ధం చేసింది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 14 వేల మంది సర్వేయర్లను నియమించారు. వీరిలో 9,400 మందికి శిక్షణ ఇవ్వగా మిగిలిన వారికి వచ్చేనెల 26 నాటికి శిక్షణ పూర్తి చేయనున్నారు. రీసర్వేపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం నుంచి గ్రామసభలు నిర్వహించనున్నారు. డ్రోన్ సర్వేలో తేడా వచ్చిందని యజమానులు భావిస్తే రోవర్‌తో చేస్తారు. అందులోనూ సంతృప్తి చెందకపోతే చెయిన్‌తో మాన్యువల్ విధానంలో కొలిపించి హద్దులు నిర్ణయిస్తారు. దీన్ని కూడా అంగీకరించని పక్షంలో సివిల్ ఇంజినీరింగ్ విధానంలో కొలుస్తారు. వివాదాలను పరిష్కరించేందుకు మండలానికి ఒకటి చొప్పున 660 మొబైల్ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఇది గొప్ప సంస్కరణ
ప్రజలకు మేలు చేయాలని ఏ కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టినా కొన్ని సమస్యలు వస్తాయి. రీసర్వేలోనూ ఇలాంటి సమస్యలుంటాయి. ఏయే సమస్యలు వస్తాయో లిస్టు రూపొందించుకున్నాం. ఏయే అంశాల్లో ఎలా ముందుకెళ్లాలో ఇప్పటికే నాలుగు సర్క్యులర్లు పంపించాం. మరోదాన్ని పంపనున్నాం. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక విధానంలో సర్వే చేయడమే కాకుండా స్థిరాస్తుల యజమానులకు శాశ్వత హక్కులతో కూడిన డిజిటల్ కార్డులు ఇచ్చే దిశగా ప్రభుత్వం ముందుకెళుతోంది. ఇది దేశంలో ఎక్కడా లేని గొప్ప సంస్కరణ. ప్రజలపై నయాపైసా భారం పెట్టకుండా ప్రభుత్వమే భరించి సర్వే చేయడంతోపాటు శాశ్వత హక్కు పత్రాలు ఇవ్వాలని సీఎం జగన్ ఎంతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దీని అమలుకు సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
– నీరబ్‌కుమార్‌ప్రసాద్, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ)
Comments
Please login to add a commentAdd a comment