‘ప్రక్షాళన’ ఏది? | CM KCR Fires On Collector Over Land Records Issues | Sakshi
Sakshi News home page

‘ప్రక్షాళన’ ఏది?

Published Wed, Aug 21 2019 1:46 AM | Last Updated on Wed, Aug 21 2019 4:27 AM

CM KCR Fires On Collector Over Land Records Issues - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ–రికార్డుల ప్రక్షాళనలో భారీగా అవకతవకలు చోటుచేసుకుంటుంటే ఎందుకు ప్రేక్షక పాత్ర వహించారని ముఖ్యమంత్రి కేసీఆర్‌.. జిల్లాల కలెక్టర్లపై మండిపడ్డారు. క్షేత్ర స్థాయిలో వీఆర్‌ఓలు, తహసీల్దార్లు అక్రమాలకు పాల్పడుతుంటే మీరెందుకు చర్యలు తీసుకోలేకపోయారని కలెక్టర్లను సూటిగా ప్రశ్నించారు. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన చిన్న జిల్లాలపైనా కలెక్టర్లు పట్టు సాధించలేకపోతే ఎలాగంటూ కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ ప్రక్షాళనపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులొస్తున్నా.. మీరేం చేస్తున్నారంటూ కలెక్టర్లకు క్లాస్‌ పీకారు. మంగళవారం ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్లతో సుదీర్ఘంగా సమావేశమైన సీఎం.. కొత్త రెవెన్యూ చట్టం తయారీపై సలహాలను స్వీకరించడంతో పాటు కొత్త పంచాయతీరాజ్, మునిసిపల్‌ చట్టాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఉదయం 11.45 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దాదాపు 8 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో కేసీఆర్‌ పలుమార్లు కలెక్టర్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. క్షేత్రస్థాయి అధికారుల పనితీరుపై కలెక్టర్ల పర్యవేక్షణ లోపించిందని, పంచాయతీరాజ్‌ చట్టం తీసుకొచ్చి 50 రోజులైనా అమలు చేయడంలో ఎలాంటి ప్రగతీ లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి సంబంధించి సీఎంవో ఎలాంటి ప్రకటనా జారీ చేయలేదు. 

వీఆర్‌ఓ, తహసీల్దార్ల అధికారాలకు చెక్‌ 
గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), తహసీల్దార్ల అధికారాలకు కత్తెర పడడం ఖాయంగా కనబడుతోంది. పట్టాదారు పాస్‌ పుస్తకాలు, మ్యుటేషన్లు, విరాసత్‌ వంటి అవసరాల కోసం వచ్చే రైతులు, సామాన్య ప్రజలను.. క్షేత్ర స్థాయిలో వీఆర్‌ఓలు, తహసీల్దార్లు లంచాల కోసం తీవ్ర వేధింపులకు గురిచేయడం నిత్యకృత్యంగామారిన నేపథ్యంలో ప్రభుత్వం తీవ్ర నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలిసింది. కొత్త రెవెన్యూ చట్టం లక్ష్యాలు, ప్రాధాన్యతపై సీఎం కేసీఆర్‌.. కలెక్టర్లసమావేశంలో వివరిస్తున్న సందర్భంగా ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. గ్రామ రెవెన్యూ రికార్డుల సంరక్షకులుగా ఉండాల్సిన వీఆర్వోలే వాటిని తారుమారు చేసి ఒకరి భూములను మరొకరికి కట్టబెట్టుతున్న వైనంపై ఆయనఆగ్రహం వ్యక్తం చేశారు. భూ–రికార్డుల పరిరక్షణతో పాటు భూములకు సంబంధించిన అన్ని రకాల బాధ్యతల నుంచి వీఆర్‌ఓలను తప్పించాలనే నిర్ణయానికి సీఎం వచ్చినట్లు సమాచారం. కొత్త రెవెన్యూ చట్టం వచ్చాక వీఆర్‌ఓలు భూమియేతర వ్యవహారాలకే పరిమితం కానున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, కుల, ఆదాయ తదితర ధ్రువీకరణ పత్రాల జారీకి విచారణ జరిపే బాధ్యతలను మాత్రమే వీఆర్వోలకు కట్టబెట్టాలని సర్కారు యోచిస్తోంది. తహశీల్దార్ల అధికారాలకు సైతం ప్రభుత్వం కోత పెట్టి జాయింట్‌ కలెక్టర్లకు కీలక అధికారాలను అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. 

 మంగళవారం ప్రగతిభవన్‌లోముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిగిన సమావేశానికి హాజరైన కలెక్టర్లు, అధికారులు 

సెప్టెంబర్‌ 10న మళ్లీ పిలుస్తా 
కొత్త పంచాయతీరాజ్, మునిసిపల్‌ చట్టాలు, హరితహారం కార్యక్రమం అమలు పురోగతిని సమీక్షించేందుకు సెప్టెంబర్‌ 10న జిల్లా కలెక్టర్లతో మరోసారి సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలిసింది. ఆలోగా మంచి పురోగతి సాధించి రావాలని కలెక్టర్లకు ఆదేశించినట్లు సమాచారం. 

నేడు కోమటిబండకు సీఎం,కలెక్టర్లు 
సాక్షి, హైదరాబాద్‌: గజ్వేల్‌ నియోజకవర్గంలోని కోమటిబండను సీఎం కేసీఆర్‌తోపాటుగా అన్ని జిల్లాల కలెక్టర్లు సందర్శిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సీఎం నియోజకవర్గంలో గజ్వేల్‌లో హరితహారం కింద చేపట్టిన కార్యక్రమాలను జిల్లాల కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులతో కలిసి సీఎం పరిశీలిస్తారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి అధికారుల బృందం బయలుదేరి గజ్వేల్‌ నియోజకవర్గంలోని కోమటిబండ సహా వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి సాయంత్రానికి ఈ బృందం నగరానికి చేరుకుంటుందని అధికారవర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 60రోజుల పచ్చదనం, పరిశుభ్రత కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా హరితహారం కింద సీఎం నియోజకవర్గంలో అమలుచేసిన కార్యక్రమాలు, సాధించిన ఫలితాలను గురించి ఈ పర్యటనలో వివరిస్తారు. గజ్వేల్‌లో గత మూడు, నాలుగేళ్లలో సహజ అడవి పునరుద్ధరణ (అటవీ భూముల సంరక్షణ) చర్యలు విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని గ్రామాల్లో హరితహారం కింద చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వడం, దాదాపు మూడేళ్ల క్రితం కోమటిబండ వద్ద మిషన్‌ భగీరథ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసినపుడు ‘అవెన్యూ ప్లాంటేషన్‌’కింద రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరగడంతో వాటిని ఈ బృందం పరిశీలించనుంది. గతంలోనూ సీఎం సూచనల మేరకు కలెక్టర్ల బృందం కోమటిబండను సందర్శించి అక్కడ హరితహారం, ఇతర కార్యక్రమాలను పరిశీలించి వచ్చిన సంగతి విదితమే.

ఇక సత్వర రెవెన్యూ సేవలు 
కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో భాగంగా అంశాలవారీగా కలెక్టర్ల నుంచి అభిప్రాయాలు, సలహాలను సీఎం స్వీకరించారు. అవినీతి లేకుండా రెవెన్యూ వ్యవహారాలు ఎలా నడపాలి? రైతులకు సత్వర సేవలు ఎలా అందించాలి? భూ రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత 24 గంటల్లోపే రైతు ఇంటికి పాస్‌బుక్‌ వెళ్లాలంటే ఏం చేద్దాం? అన్న అంశాలపై కలెక్టర్ల అభిప్రాయాలను సేకరించారు. ఈ క్రమంలో రెవెన్యూకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ల చేతికి ప్రశ్నావళిని ఇచ్చి సమాధానాలను రాబట్టుకున్నట్లు తెలిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement