ఇది భూ యజ్ఞం | kcr meeting with ias officers over land records | Sakshi
Sakshi News home page

ఇది భూ యజ్ఞం

Published Fri, Sep 1 2017 2:06 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

ఇది భూ యజ్ఞం - Sakshi

ఇది భూ యజ్ఞం

వచ్చే మూడు నెలల పాటు రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళనకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు.

భూముల రికార్డుల ప్రక్షాళనకు ప్రాధాన్యమివ్వాలి
జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారుల భేటీలో సీఎం కేసీఆర్‌

మూడు నెలలపాటు నిబద్ధతతో కృషి చేయాలి
► పక్కాగా రైతుల భూముల వివరాల సేకరణ
► జిల్లాకో రూ.50 లక్షలు కేటాయింపు.. జీవో జారీ
►సైన్యంగా రైతు సమితులు.. మూడో వంతు మహిళలకు చోటు
► 2,600 క్లస్టర్లలో రూ.15 లక్షలతో రైతు వేదికల నిర్మాణం
► సమితుల ఏర్పాటు, రికార్డుల ప్రక్షాళన బాధ్యత కలెక్టర్లదే
► ప్రతి కలెక్టర్‌కు ఒక్కో ఎస్సీ, ఎస్టీ వాడ దత్తత
► ఒక్కో వాడకు రూ. కోటి చొప్పున నిధులిస్తామని వెల్లడి  


సాక్షి, హైదరాబాద్‌
వచ్చే మూడు నెలల పాటు రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళనకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. అంకితభావంతో చేస్తే ఎంతటి పనైనా విజయవంతం అవుతుందని... భూ రికార్డుల ప్రక్షాళనను ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా సొంత నిబద్ధతతో చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. గురువారం ప్రగతి భవన్‌లో కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఆర్డీవోలతో సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్, రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్‌ మీనా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..

రికార్డులన్నీ గందరగోళం..
భూముల రికార్డుల నిర్వహణ సరిగ్గా లేకపోవడం అనేక వివాదాలు, గందరగోళానికి, ఘర్షణలకు దారి తీస్తోంది. వచ్చే ఏడాది నుంచి రైతులకు ఎకరాకు రూ.8 వేల చొప్పున అందజేయాలని నిర్ణయించాం. అసలు భూములున్న రైతులెందరని లెక్కతీస్తే రెవెన్యూ రికార్డుల్లో ఒకతీరు, వ్యవసాయ శాఖ రికార్డుల్లో మరో తీరుగా ఉన్నాయి. అందుకే ఏ భూమి ఎవరి ఆధీనంలో ఉందో తేల్చాలి. భూమి హక్కులపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. వివిధ అభివృద్ధి పనులకు ప్రభుత్వం భూములు తీసుకుంది. అవేవీ రికార్డుల్లో నమోదుకాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

95 శాతం వివాదం లేని భూములే..
మొదటి దశలో వివాదం లేని భూములపై స్పష్టత ఇవ్వాలి. రైతులు, గ్రామస్తుల సహకారం తీసుకోవాలి. ప్రతి గ్రామంలో 80%–95% ఇలాంటి భూములున్నాయి. రెండో దశలో వివాదాస్పద భూములను గుర్తించాలి. కోర్టు తుది తీర్పులకు లోబడి వీటిపై స్పష్టత ఇస్తాం. ఇక ప్రభుత్వ భూములు, ఫారెస్ట్, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్‌ తదితర భూముల వివరాలన్నీ నమోదు చేయాలి. భూ రికార్డుల ప్రక్షాళనకు బృందాల ఎంపిక బాధ్యత పూర్తిగా కలెక్టర్లదే. అవసరమైతే కొందరిని తాత్కాలికంగా నియమించుకొండి. ఈ కార్యక్రమానికి ప్రతి కలెక్టర్‌కు రూ.50 లక్షలు అందుబాటులో ఉంచుతున్నాం. రెవెన్యూ గ్రామం యూనిట్‌గా భూముల వివరాలు సేకరించాలి.

రైతు సమితుల్లో మూడో వంతు మహిళలు
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ప్రభుత్వమే పూనుకుని అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటితం చేస్తోంది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర వర్గాల ప్రతినిధులుంటారు. మొత్తంగా మూడో వంతు మహిళా సభ్యులు ఉంటారు. మండల రైతు సమన్వయ సమితులు అడ్తిదారులతో మాట్లాడి పంటలకు గిట్టుబాటు ధర నిర్ణయిస్తాయి. మార్కెట్లలో గిట్టుబాటు ధర రాకుంటే.. రాష్ట్ర రైతు సమన్వయ సమితి నేరుగా కొనుగోలు చేస్తుంది. దీనికి రూ.500 కోట్ల నిధిని ప్రభుత్వం సమకూర్చడంతో పాటు, మరో రూ. ఐదారు వేల కోట్ల రుణం పొందేందుకు గ్యారంటీ ఇస్తుంది. పంటను కొనుగోలు చేసి, ప్రాసెసింగ్‌ చేసేందుకు రాష్ట్ర రైతు సమన్వయ సమితులకు హక్కులు కల్పిస్తుంది.

2,600 రైతు వేదికలు నిర్మించాలి
రాష్ట్రంలో 1.75 లక్షల మంది రైతు సమన్వయ సభ్యులు ఉంటారు. అదొక సైన్యం. రైతులను సంఘటిత శక్తిగా మార్చి కార్యక్రమాలను నిర్వహిస్తాం. 2,600 క్లస్టర్లలో రైతు సమావేశ మందిరాలను నిర్మించాలి. రూ.15 లక్షలతో నిర్మించే ఈ రైతు వేదికకు దాతల నుంచి స్థలాలు సేకరించాలి. రైతులు పరస్పరం చర్చించుకునేందుకు ఇవి వీలుగా ఉంటాయి.

కలెక్టర్‌కో దళిత, గిరిజన వాడ దత్తత
పేదరిక నిర్మూలన కార్యక్రమాలను కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలి. ప్రతి కలెక్టర్‌ ఒక దళిత వాడను దత్తత తీసుకోవాలి. దత్తత తీసుకున్న దళితవాడ అభివృద్ధి కోసం ప్రతి కలెక్టర్‌కు కోటి రూపాయలు ఇస్తాం. ఒక ఏడాదిలో ఆ దళిత వాడ పరిస్థితి మారాలి. అందరికీ ఇళ్లు కట్టించాలి. ఉపాధి చూపించాలి. ఆరోగ్య సమస్యలుంటే వైద్యం చేయించాలి. ప్రతీ ఇంటికి రెండు పశువులు అందించాలి. దత్తత తీసుకున్న దళితవాడను స్వర్గసీమగా మార్చాలి. ఇదే మాదిరిగా ప్రతి కలెక్టర్‌ ఒక్కో గిరిజన తండాను దత్తత తీసుకోవాలి. దీనికి మరో కోటి రూపాయలు అదనంగా ఇస్తాం. వాటిని కూడా ఆదర్శంగా ఉండేలా అభివృద్ధి చేయాలి..’’అని సీఎం పేర్కొన్నారు.

కొత్త కలెక్టర్ల పనితీరు భేష్‌
కలెక్టర్లు కొత్తవారైనా బాగా పనిచేస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకుపోతున్నారని సీఎం కేసీఆర్‌ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు పొందేందుకు ఇప్పటి మీ పనితీరు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇక భూ రికార్డుల ప్రక్షాళనను ప్రయోగాత్మకంగా కొన్ని గ్రామాల్లో చేపట్టిన రంగారెడ్డి కలెక్టర్‌ రఘునందన్‌రావు, సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, మిర్యాలగూడ ఆర్డీవో కిషన్‌రావు, ఖమ్మం కలెక్టర్‌ లోకేశ్‌కుమార్, భువనగిరి ఆర్డీవో భూపాల్‌రెడ్డిలు సమావేశంలో తమ అనుభవాలను వివరించారు.

రూ.17 కోట్లు జారీ చేస్తూ జీవో
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ ముగిసిన వెంటనే సర్వే అండ్‌ రికార్డుల ప్రక్షాళనకు రూ.17 కోట్లు మంజూరు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ మినహా ఒక్కో జిల్లాకు రూ.50 లక్షల చొప్పున కేటాయించింది. రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, ప్రాజెక్టు మిషన్‌ డైరెక్టర్ల ఆధీనంలో ఒక్కో రూ.కోటి అందుబాటులో ఉంచింది.

సీఎం చేసిన మరిన్ని సూచనలు
► రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో ఏ భూమి ఎవరిదో నిర్ధారించి గ్రామ రైతులందరి సంతకాలు తీసుకోవాలి. రైతులకు భూమి వివరాలకు సంబంధించిన పత్రాలు ఇవ్వాలి. ప్రతీ రైతుకు కొత్త పాస్‌ పుస్తకం ఇవ్వాలి. భూములు–యజమానుల వివరాలను గ్రామపంచాయితీ లేదా ప్రభుత్వ పాఠశాల గోడలకు అతికించాలి.
► పార్ట్‌ ఎ: వివాదాల్లేని భూముల వివరాల ప్రక్షాళన, పార్ట్‌ బి: వివాదాస్పద భూముల వివరాల నమోదు. కోర్టు తీర్పు తరువాతే పార్ట్‌ బి ప్రక్షాళన చేపట్టాలి. గ్రామ కంఠం పరిధి, హద్దులను నిర్ణయించాలి.
► ఐదెకరాల పైబడిన భూములకు సంబంధించిన సాదాబైనామాలను కూడా కలెక్టర్‌ అనుమతితో క్రమబద్ధీకరించాలి. పాత దరఖాస్తుదారుల నుంచి సాదాబైనామా రాసుకున్న తేదీనాటి రేటుతో రిజిస్ట్రేషన్‌ చేయాలి.
► పాస్‌ పుస్తకాల్లో, పహాణీల్లో సరళమైన తెలుగు భాషను వాడాలి. పహాణీ, సేత్వారీ, పావుతీ లాంటి పదాలు తొలగించాలి. భూమి శిస్తు రద్దు చేసినందున భూమి రకాలను వర్గీకరించాల్సిన అవసరం లేదు. గరిష్ట భూపరిమితి చట్టం ప్రకారం వర్గీకరించిన భూముల వివరాలను యధావిధిగా కొనసాగించాలి.
► అసైన్డ్‌ భూముల విషయంలో వీలైనంత గరిష్ట స్థాయిలో క్లియర్‌ చేయాలి. భూ యాజమాన్య హక్కులు కల్పించాలి. వ్యవసాయం చేసుకునేవారికి యాజమాన్య హక్కులు ఇవ్వాలి.
► కోర్‌ బ్యాంకింగ్‌ తరహాలో భూ రికార్డుల నిర్వహణ ఉండాలి. ఏటీఎంలో ఎక్కడ డబ్బులు తీసుకున్నా ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ అయిన తరహాలో... 55 లక్షల మంది రైతులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ ఉండాలి.
► భూ రికార్డుల ప్రక్షాళనలో బాగా పనిచేసిన కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో తదితరులకు ఇన్సెంటివ్‌ ఇవ్వాలి.
► పంట రుణాల కోసం రైతులు పట్టాదారు పుస్తకాలు కుదువపెట్టాల్సిన అవసరం లేదు. బ్యాంకులు అడిగితే ప్రభుత్వం దృష్టికి తేవాలి.
► అటవీ భూములను కచ్చితంగా నిర్ధారించి హద్దులు పెట్టాలి. అభివృద్ధి పనులకు తీసుకున్న అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ఇచ్చిన స్థలాల్లోనూ అడవులు పెంచాలి. హరితహారం విజయవంతం చేసినవారికి ప్రోత్సాహకాలు అందించాలి. జిల్లాల వారీగా కార్యాచరణ అమలు చేయాలి.

భూ రికార్డుల ప్రక్షాళన షెడ్యూల్‌
సెప్టెంబర్‌ 1 నుంచి 9 వరకు: రైతు సమన్వయ సమితుల ఏర్పాటు
10 నుంచి 15 వరకు: మండలాల వారీగా రైతు సమన్వయ సమితి సదస్సులు
సెప్టెంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 31: రెవెన్యూ గ్రామాల వారీగా భూ రికార్డుల ప్రక్షాళన
10,785 రెవెన్యూ గ్రామాల్లో 1,193 బృందాలు ఈ కార్యక్రమం నిర్వహిస్తాయి. ఒక్కో గ్రామంలో ఈ బృందం పది రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. జనవరి 1 నాటికి నూతన సంవత్సరం కానుకగా సవరించిన, సరళీకరించిన, ఆధునీకరించిన రికార్డులు అందుబాటులోకి వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement