పార్ట్‌ B ఓ ట్విస్ట్‌  | Part B is a twist | Sakshi
Sakshi News home page

పార్ట్‌ B ఓ ట్విస్ట్‌ 

Published Thu, Dec 20 2018 2:18 AM | Last Updated on Thu, Dec 20 2018 7:40 AM

Part B is a twist - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వివాదాస్పద భూముల పరిష్కారంపై కొత్త మెలిక పడింది. భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా పార్ట్‌–బీలో చేర్చిన ఈ భూరికార్డులను వారంలో క్లియర్‌ చేసి అర్హులైన రైతులకు పాసు పుస్తకాలు అందజేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినా ఈ ప్రక్రియ సజావుగా జరిగేటట్లు లేదు. పార్ట్‌–బీ భూములపై గతంలో విచారణ జరిపిన తహసీల్దార్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో వేరే మండలాలకు బదిలీ అయ్యారు. అయితే, ఈ భూములపై మళ్లీ విచారణ జరిపితేనే నిర్ధారిస్తామని కొత్త తహసీల్దార్లు మెలిక పెడుతున్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల పని ప్రారంభం కావడంతో తహసీల్దార్ల బదిలీలపై సస్పెన్స్‌ నెలకొంది.

పెండింగ్‌లో 12.71 లక్షల ఎకరాలు 
రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ప్రారంభమైన భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా మొత్తం 2.38 కోట్ల ఎకరాలకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించి 2.25 కోట్ల ఎకరాల రికార్డులను రెవెన్యూ యంత్రాంగం సరిచేసింది. వివాదాస్పద భూములు, అటవీ, దేవాదాయ, కోర్టు కేసులు, అన్నదమ్ముల పంచాయితీలు, సరిహద్దు వివాదాలు, సివిల్‌ తగాదాలు, నిషేధిత జాబితా(22ఏ)లో ఉన్న 12.71 లక్షల ఎకరాల భూములను పార్ట్‌–బీలో చేర్చింది. ఇందులో కొన్ని సర్వే చేయాల్సి రావడం, మరికొన్ని తీవ్ర వివాదాల్లో ఉండటంతో ఎన్నికలకు ముందు తహసీల్దార్లు పకడ్బందీగా విచారణ జరిపారు. దరఖాస్తులను పరిశీలించి స్పాట్‌ వెరిఫికేషన్‌ చేయడంతోపాటు పంచనామాలు నిర్వహించారు. అన్నదమ్ముల మధ్య పంచాయితీలున్న భూముల్లో ఇరుపక్షాలను పిలిపించి విచారించారు. అటవీ, దేవాదాయ శాఖలతో లింకు ఉన్న భూముల విషయంలో ఆయా శాఖల నుంచి సర్వే నంబర్లవారీగా నివేదికలు తెప్పించుకున్నారు. అయితే, ఈ నివేదికలకు, రెవెన్యూ రికార్డులకు సరిపోలకపోవడంతో ఆ భూములను సర్వే చేయాలని నిర్ణయించారు. ఈ అంశాలన్నింటి నేపథ్యంలో పార్ట్‌–బీ భూములను సజావుగా పార్ట్‌–ఏలో చేర్చాలంటే గతంలో ఆయా భూములపై విచారణ జరిపిన తహసీల్దార్లు ఉంటేనే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

ఎన్నికల పనులు షురూ..
ఎన్నికల ముందు వేరే స్థానాలకు బదిలీ చేసిన తహసీల్దార్లను పాత స్థానాలకు బదిలీ చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తహసీల్దార్లకు ఎన్నికల పని ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల కోసం పోలింగ్‌స్టేషన్లను హేతుబద్ధీకరించాలని, గ్రామీణ ప్రాంతాల్లో 1,100, పట్టణ ప్రాంతాల్లో 1,300 ఓట్ల కన్నా ఎక్కువ ఉన్న చోట్ల కొత్త పోలింగ్‌స్టేషన్లను గుర్తించాలని సోమవారమే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. దీనికితోడు ఈ నెల 26న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన వెలువడనుంది. అనంతరం అభ్యంతరాలు, క్లెయిమ్‌లు, తొలగింపు, నమోదు ప్రక్రియను ఫిబ్రవరి 22 వరకు చేపట్టి తుది జాబితా ప్రకటిస్తారు. ఈలోపు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పుడు తహసీల్దార్లను పాత స్థానాలకు బదిలీ చేసినా మళ్లీ లోక్‌సభ ఎన్నికల సమయంలో బదిలీలు అనివార్యమవుతాయి. ఈ నేపథ్యంలో పార్ట్‌–బీలో చేర్చిన భూములను సరిదిద్దే ప్రక్రియలో తప్పుదొర్లే అవకాశం తోపాటు జాప్యం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  

బదిలీలు చేయాలి
ఎన్నికల సందర్భంలో తహసీల్దార్లను సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారు. అప్పటి నుంచి కుటుంబాలకు దూరంగా ఉండి తహసీల్దార్లు విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఇప్పుడు మళ్లీ లోక్‌సభ ఎన్నికల పేరుతో తహసీల్దార్ల బదిలీలను నిలిపివేయడం వారి మానసిక ఆందోళనకు కారణమవుతోంది. ప్రభుత్వం సహృదయంతో స్పందించి తహసీల్దార్లను ఎన్నికల ముందున్న స్థానాలకు బదిలీ చేయాలి.      
– వంగా రవీందర్‌రెడ్డి, అధ్యక్షుడు,  తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement