పాస్‌బుక్ రద్దుతో భరోసా మాయం | With the cancellation of ensuring ate Pass Book | Sakshi
Sakshi News home page

పాస్‌బుక్ రద్దుతో భరోసా మాయం

Published Wed, Jun 29 2016 12:20 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

With the cancellation of ensuring ate Pass Book

జూలై 1 నుంచి చెల్లుబాటులో లేనట్టే..
భూమి రికార్డులు సక్రమంగా లేకుండానే అనుచిత నిర్ణయం
ఆన్‌లైన్‌లో పేర్లు  తారుమారు చేసే అవకాశం
తప్పుడు నిర్ణయం   అంటున్న రైతులు

 

మచిలీపట్నం : పట్టాదార్, టైటిల్ డీడ్ పుస్తకాలు రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించటం రైతుల్లో గుబులు పుట్టిస్తోంది. జూలై 1వ తేదీ నుంచి పట్టాదారు, టైటిల్ డీడ్‌లు రద్దవుతాయని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. జూలై 1 నుంచి ఆన్‌లైన్ ద్వారానే భూమికి సంబంధించి క్రయవిక్రయాలు, రుణాలు పొందడం తదితర పనులు జరుగుతాయని చెప్పడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని రద్దు చేసేందుకు టీడీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని రైతులు ఆరోపిస్తున్నారు. పట్టాదారు పాస్ పుస్తకం చేతిలో ఉంటే పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు దానిని ఆధారంగా ఎక్కడైనా అప్పు లభించే అవకాశం ఉండేదని, ప్రభుత్వ నిర్ణయంతో ఆ భరోసా కోల్పోతున్నామని రైతులు అంటున్నారు.

 
ఆన్‌లైన్‌లోనే వివరాలట..

జూలై 1 నుంచి పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తాతలు, తండ్రుల నాటి నుంచి వచ్చిన అనువంశిక ఆస్తులు తమ పేరుతో లేకున్నా భూమి వారి వారసుల వద్దే ఉంది. ఈ తరహా భూములు కొన్నింటికి పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చినా టైటిల్ డీడ్‌లో (ఆర్‌వోఆర్)లో నమోదు చేయలేదు. ప్రస్తుతం ఈ రెండింటిని రద్దుచేసి ఆన్‌లైన్‌లో ఉన్న వివరాల ఆధారంగా భూమి క్రయవిక్రయాలు తదితర వ్యవహారాలను చూసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటివరకు పట్టాదారు పాస్ పుస్తకం చేతిలో ఉంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి పంట రుణం తీసుకునే వారమని రైతులు అంటున్నారు. వీటిని రద్దుచేస్తే పంట రుణం తీసుకునే ప్రతిసారీ రెవెన్యూ కార్యాలయంలోని వీఆర్వో, ఆర్‌ఐ, డెప్యూటీ తహశీల్దార్ చుట్టూ తిరగాల్సిందేనని రైతులు అంటున్నారు. రెవెన్యూ సెటిల్‌మెంట్ రిజిస్ట్రేషన్ (ఆర్‌ఎస్‌ఆర్), అడంగల్‌లో సర్వే నంబర్లను, రైతుల పేర్లను మార్చడానికి ఆన్‌లైన్‌లో సులువుగానే ఉందని, ఎవరైనా అసలు రైతు కాకుండా వేరే రైతుల పేర్లతో భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

 

రైతుల హక్కును గుంజుకోవడమే
రైతుకు భరోసాగా ఉన్న పట్టాదారు, టైటిల్ డీడ్‌ను రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించటం రైతుల హక్కును ప్రభుత్వం గుంజుకోవడమే. ఆన్‌లైన్‌లో భూమి వివరాలు ఒక రోజులోనే మార్పు జరిగిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు కంప్యూటర్‌పై అంతగా పరిజ్ఞానం లేని పరిస్థితి. రోజూ మీ-సేవా కేంద్రానికి వెళ్లి భూమి తన పేరున ఉందో, లేదో చూసుకునే వీలు రైతులకు లేదు. ఈ అంశంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి. రైతుల హక్కును రెవెన్యూ అధికారుల చేతిలో పెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎవరిదైనా భూమి పేర్లను మార్పు చేసి బడాబాబులు విక్రయిస్తే చిన్న రైతులు ఆ భూమి తమదేనని కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితులు వస్తాయి.  - ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్

 

తొందరపాటు నిర్ణయం
పట్టాదారు, టైటిల్ డీడ్‌లను ప్రభుత్వం రద్దు చేస్తామని చెప్పడం తొందరపాటు నిర్ణయం. భూమికి సంబంధించిన పూర్తిస్థాయి వివరాలు అడంగల్, రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సక్రమంగా లేవు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నా, టైటిల్ డీడ్ ఇవ్వలేదు. ఈ తరహా వ్యవహారాన్ని ఎలా చక్కబెడతారో ప్రభుత్వం చెప్పట్లేదు. భూమికి సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో 80శాతం తప్పులతడకగానే ఉంది. ఇవేమీ గ్రహించని ప్రభుత్వం జూలై 1 నుంచి పట్టాదారు, టైటిల్ డీడ్‌లను రద్దు చేస్తామని చెప్పడం రైతులకు అన్యాయం చేయడమే. భూమి వివరాలను సక్రమంగా కంప్యూటరీకరించి అప్పుడు టైటిల్ డీడ్, పట్టాదారు పుస్తకాలను రద్దు చేస్తామని ప్రకటించాలి.  - వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీమంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement