సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం మొత్తం మీద సగటున గ్రామానికి 420 మంది రైతులు, 1,156 ఎకరాల సాగు భూమి ఉన్నట్లు తేలింది. రైతు సమగ్ర సర్వే ఆధారంగా తాజాగా రూపొందించిన నివేదిక వివరాలను వ్యవసాయశాఖ వెల్లడించింది. ఏఈవోల సహకారంతో మొత్తం 10,733 రెవెన్యూ గ్రామాల్లో రైతు సమగ్ర సర్వే చేసిన సంగతి తెలిసిందే. నివేదిక ప్రకారం రాష్ట్రంలోని సగం గ్రామాలు వెయ్యి ఎకరాలలోపు సాగుభూమి కలిగి ఉన్నాయి. ఇందులో 500 ఎకరాలలోపు గ్రామాలు 3,161 ఉండగా, సగటున గ్రామానికి 149 మంది రైతులున్నారు.
ఈ విభాగంలో సగటున ఒక్కో గ్రామంలో 323 ఎకరాలున్నట్లు తేలింది. రాష్ట్రంలోని 30 శాతం గ్రామాల్లో 500 ఎకరాల్లోపే సాగు భూమి ఉన్నట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. అలాగే 501–1000 ఎకరాల వరకు ఉన్న గ్రామాలు 2,820 ఉండగా... ఈ విభాగంలో సగటున ఒక్కో గ్రామంలో 283 మంది రైతులు, 695 ఎకరాల సాగు భూమి ఉన్నట్లు తేలింది. అలాగే 5,981 గ్రామాలు వెయ్యి ఎకరాలలోపే సాగు విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి. అలాగే 1001 నుంచి 2 వేల ఎకరాల వరకు సాగుభూమి ఉన్న గ్రామలు 3,101 ఉండగా, వీటిలో 16.50 లక్షల మంది రైతులు మొత్తం 43.94 లక్షల ఎకరాల భూమి కలిగి ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. 4,501–5,000 ఎకరాలున్న గ్రామాలు 62 మాత్రమే ఉన్నాయి. 5వేల ఎకరాల పైగా ఉన్న గ్రామాలు 106 వరకున్నాయి.
తగ్గిన రైతుల సంఖ్య...: రైతు సమగ్ర సర్వే ప్రకారం రైతుల సంఖ్య 45.10 లక్షలుకాగా వారి వద్ద 1.24 కోట్ల ఎకరాల సాగు భూమి ఉన్నట్లు తేలింది. అయితే వ్యవసాయశాఖ వద్ద ఇప్పటివరకు ఉన్న రికార్డుల ప్రకారం రైతుల సంఖ్య 55 లక్షలు ఉండగా, రైతు సమగ్ర సర్వేలో మాత్రం ఆ సంఖ్య 45 లక్షలకు పడిపోవడంపై గందరగోళం నెలకొంది. 10 లక్షల మంది రైతులు ఎలా తగ్గారో అంతుబట్టడంలేదు. భూ పత్రాలలో పేరు మార్పిడి జరగకపోవడంతో కొత్తగా వచ్చే వారి పేర్లు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన తరువాత సాగుభూమి, రైతుల సంఖ్యపై స్పష్టత వస్తుందని అంటున్నారు.
420 మంది రైతులు..1,156 ఎకరాలు
Published Mon, Dec 11 2017 3:32 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment