రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలకెత్తుకున్న భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా భూమి యాజమాన్య హక్కులపై రైతులకు స్పష్టత ఇవ్వడంతో పాటు ఏళ్లుగా పరిష్కారం కాని భూ సమస్యలను పరిష్కరిస్తోంది. వారసత్వం, హక్కులను కచ్చితంగా నిర్ధారించడం, సాదా బైనామాలపై క్రయ విక్రయాలను క్రమబద్ధీకరించడం, పేరు మార్పిడి వంటి పనుల ద్వారా భూ రికార్డులను సరిచేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మొదటిసారి భూ రికార్డుల నమోదు ఎప్పుడు జరిగింది... భూమిపై రైతుకు ఎప్పుడు హక్కు వచ్చింది.. దానిని ఎప్పుడు రికార్డు చేశారనే అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది.
– సాక్షి, హైదరాబాద్
నిజాం హయాంలో రికార్డులు అస్తవ్యస్తం...
నిజాం హయాంలో రైతులకు భూములపై హక్కుల రికార్డు సరిగా జరగలేదు. నిజాం పాలనలో పరిపాలనా యూనిట్లయిన జాగీర్లలో కొన్ని చిన్నవి, పెద్దవి ఉండటం వల్ల ఆదాయ, వ్యయాల్లో సారూప్యత ఉండేది కాదు. వికారుల్ ఉమ్రా వార్షికాదాయం రూ. 27.83 లక్షలుంటే కల్యాణీ జాగీర్ ఆదాయం కేవలం రూ. 2.43 లక్షలు మాత్రమే ఉండేది. ఆదాయం తక్కువగా ఉండటం, వ్యయానికి హద్దులు లేకపోవడం, సర్వే సెటిల్‌మెంట్లు సరిగా జరగకపోవడంతో భూ రికార్డుల నిర్వహణ సక్రమంగా జరగలేదని చరిత్రకారులు చెబుతున్నారు. కొందరు రైతులు పన్నులు కట్టలేక భూములను కూడా వదులుకునేవారని, ఇప్పుడు కారిజ్‌కాతా కింద నమోదైన ప్రభుత్వ భూములన్నీ రైతులు అప్పుడు వదిలేసినవేనని రెవెన్యూ వ్యవహారాలపై పట్టున్న అధికారులు చెప్పే మాట.
విలీనంతో మారిన పరిస్థితి...
హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసిన తర్వాత అప్పటి భారత ప్రభుత్వం పరిస్థితులను చక్కదిద్దడంపై దృష్టి పెట్టింది. తెలంగాణలోని పలు సంస్థా నాలు, జాగీర్లకు ఉన్న అధికారాలను రద్దు చేసి అధీనంలోకి తెచ్చుకునేం దుకు 1358 ఫస్లీ ప్రకారం హైదరా బాద్ జాగీర్ల రద్దు రెగ్యులేషన్‌ను తీసుకు వచ్చింది. దీని ప్రకారం నిజాం రాష్ట్రంలోని జాగీర్లు, సంస్థానాలు, ఇలాకాలు, ఎస్టేట్లు, పాయోగాలన్నీ రద్దయ్యాయి. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నుంచి అధికారాన్ని తీసుకున్న జనరల్ కె.ఎన్.చౌదరి పాలనలోనే ఎల్.ఎన్. గుప్తా ఆ«ధ్వర్యంలో జాగీర్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేశా రు. జాగీరు గ్రామాల్లోని భూముల హక్కులను జాగీర్దార్ల నుంచి రైతులకు బదలాయించాలని, రికార్డుల్లో జాగీర్దార్లకు బదులు రైతు పేర్లు రాయా లని 18–10–1949న ఆయన ఉత్తర్వులిచ్చారు.
జాగీర్దార్లు లేదా వారి బంధువుల పేర్లు రాయ వద్దని, చనిపోయిన వారి స్థానంలో వేరే పేర్లు కూడా రాయకూడదని (పౌతీ చేయకూడ దని), ఎలాంటి పత్రాలు అవసరం లేకుండానే కాస్తులో ఉన్న (సాగు చేస్తున్న) రైతులను పట్టాదార్లుగా గుర్తిం చి వారి పేర్లు రికార్డుల్లో నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. అప్పుడు తొలిసారిగా తెలంగాణలో రైతులకు పూర్తిస్థాయిలో తమ భూములపై హక్కులు ఏర్పడ్డాయి. ఎల్.ఎన్. గుప్తా కేవలం 14 రోజుల్లోనే నిజాం పాలనలోని ఫ్యూడల్ వ్యవస్థను పెకిలించడం విశేషం.
పహాణీల తయారీ మొదలు...
హైదరాబాద్ రాష్ట్రం 1954–55లో ప్రత్యేక మార్గద ర్శకాలతో ఖాస్రా పహాణీలను తయారు చేసింది. దీని ప్రకారం కాస్తులో ఉన్న వ్యక్తిని ఎలాంటి పత్రాలు అడగ కుండానే హక్కుదారుడిని చేయాలని ఆదేశించింది. దీంతో మరోసారి రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన జరిగి ఖాస్రా పహాణీలను తయారు చేశారు. ఈ ఖాస్రా పహాణీలు రెవెన్యూ గ్రామాలు, సర్వే నంబర్ల వారీగా ఉన్నాయి. ఖాస్రాలు లేని చోట తర్వాత చెస్సలా పహాణీలు తయారు చేశారు. తర్వాత వాటిని ఆన్‌లైన్ చేశారు. మళ్లీ ఇప్పుడు భూ రికార్డుల ప్రక్షాళన పేర రైతులకు భూములపై హక్కులు కల్పిస్తూ కొత్త పహాణీలను తయారు చేస్తున్నారు. మరి ఈ పహాణీలకు ఏం పేరు పెడతారో... భూ రికార్డుల చరిత్రను ఎలా తిరగరాస్తారో వేచి చూడాల్సిందే.