ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళన అనంతరం వివాదాలున్నాయంటూ పార్ట్–బీలో చేర్చిన భూముల లెక్కలు ఎప్పుడు తేలుతాయో అంతుపట్టడం లేదు. గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభమైన భూరికార్డుల ప్రక్షాళన అనంతరం రాష్ట్రంలో 2.3 కోట్లకు పైగా ఎకరాల్లోని భూముల్లో ఉన్న 1.42 కోట్ల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమికి గాను ఏటా పెట్టుబడి సాయం కింద ఎకరాలకు రూ.8 వేలను ప్రభుత్వం అందిస్తుండగా, వివాదాస్పద భూములను పక్కన పెట్టారు. రాష్ట్రంలో తొలిసారి ఈ ఏడాది మేలో రైతుబంధు కింద నగదు సాయమందగా, 5 నెలలైనప్పటికీ వివిధ పని ఒత్తిడుల కారణంగా రెవెన్యూ యంత్రాంగం ఈ భూముల లెక్కలను తేల్చలేకపోయింది. దీంతో ఈ భూముల్లో సాగు చేస్తున్న ప్రస్తుత రైతులకు ఏటా రూ.500 కోట్లపైగానే పెట్టుబడి సాయం నిలిచిపోతోంది.
కొత్త ప్రభుత్వం కొలువుదీరాకే..: వివాదాస్పద భూములను పరిష్కరించే ప్రక్రియ ప్రారంభం కాకముందే ఎన్నికలు రావడంతో రెవెన్యూ యంత్రాంగం అంతా ఇప్పుడు అటువైపు దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే వివాదాస్పద భూముల లెక్కలు తేలుతాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దీంతో పెట్టుబడి సాయం కింద ఆ భూములకు నగదు అందాలంటే ఎన్నికలైపోయేంతవరకు ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment