![Department of Revenue has decided in principle to issue Pattadar cards - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/17/FERMER_CARD.jpg.webp?itok=CoU8CDNB)
సాక్షి, అమరావతి: నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలకు చెక్ పెట్టేందుకు ప్రతి రైతు/భూ యజమానికి ఏటీఎం కార్డు తరహాలో పట్టాదారు కార్డులు అందజేయాలని రెవెన్యూ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ ప్రతిపాదిత కార్డు పాన్‌కార్డు పరిమాణంలో ఉండి.. దానిపై భూ యజమాని పేరు, చిరునామా ఉంటుంది. చిన్న డిజిటల్ చిప్ అమర్చడం వల్ల కార్డును స్వైప్/స్కాన్ చేస్తే సదరు రైతుకు ఏ గ్రామం/పట్టణంలోని ఏయే సర్వే నంబర్లలో ఎంత భూముందో కనిపిస్తుంది. భద్రత ప్రమాణాలతో కూడిన పట్టాదారు కార్డు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇది ఎలా ఉండాలి? ఒక్కో దానికి ఎంత ఖర్చవుతుంది? అనే అంశాలపై రెండు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. పారదర్శకంగా టెండర్లు నిర్వహించి తక్కువ ధరకు పొందేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
నకిలీలకు అడ్డుకట్ట వేసేలా
రెవెన్యూ శాఖలో భూ రికార్డులు తప్పుల తడకలుగా ఉన్నందున ప్రక్షాళన చేయాలని రెవెన్యూ శాఖ ఇప్పటికే మార్గదర్శకాలిచ్చింది. వచ్చే ఏడాది మే నెలాఖరుకి రికార్డుల్ని పూర్తిగా స్వచ్ఛీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తైన వెంటనే పట్టాదారు పాసు పుస్తకం స్థానంలో కార్డులు ఇస్తారు. నకిలీలకు, ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment