pattadar
-
త్వరలో పట్టాదారు కార్డులు
సాక్షి, అమరావతి: నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలకు చెక్ పెట్టేందుకు ప్రతి రైతు/భూ యజమానికి ఏటీఎం కార్డు తరహాలో పట్టాదారు కార్డులు అందజేయాలని రెవెన్యూ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ ప్రతిపాదిత కార్డు పాన్‌కార్డు పరిమాణంలో ఉండి.. దానిపై భూ యజమాని పేరు, చిరునామా ఉంటుంది. చిన్న డిజిటల్ చిప్ అమర్చడం వల్ల కార్డును స్వైప్/స్కాన్ చేస్తే సదరు రైతుకు ఏ గ్రామం/పట్టణంలోని ఏయే సర్వే నంబర్లలో ఎంత భూముందో కనిపిస్తుంది. భద్రత ప్రమాణాలతో కూడిన పట్టాదారు కార్డు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇది ఎలా ఉండాలి? ఒక్కో దానికి ఎంత ఖర్చవుతుంది? అనే అంశాలపై రెండు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. పారదర్శకంగా టెండర్లు నిర్వహించి తక్కువ ధరకు పొందేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. నకిలీలకు అడ్డుకట్ట వేసేలా రెవెన్యూ శాఖలో భూ రికార్డులు తప్పుల తడకలుగా ఉన్నందున ప్రక్షాళన చేయాలని రెవెన్యూ శాఖ ఇప్పటికే మార్గదర్శకాలిచ్చింది. వచ్చే ఏడాది మే నెలాఖరుకి రికార్డుల్ని పూర్తిగా స్వచ్ఛీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పూర్తైన వెంటనే పట్టాదారు పాసు పుస్తకం స్థానంలో కార్డులు ఇస్తారు. నకిలీలకు, ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ‘సాక్షి’కి తెలిపారు. -
ఆర్‌ఎస్‌ఆర్‌లో ‘చుక్కలు’ పునః పరిశీలన
అనెగ్జర్–5ను రివైజ్డ్ చేయాలని సీసీఎల్ఏ ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): రీ సెటిల్మెంటు రిజిస్టర్(ఆర్ఎస్ఆర్)లో గ్రామాలు, సర్వే నెంబరు వారీగా పట్టాదారు స్థానంలో చుక్కలున్న భూముల గుర్తింపును మరోసారి పరిశీలించాలని రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వ భూముల వివరాలను 5 రకాల జాబితాల్లో చేర్చారు. ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కలున్న వాటిని అనెగ్జర్– 5లో చేర్చి ప్రభుత్వానికి పంపారు. చుక్కలున్న కొన్ని సర్వే నెంబర్లను అనెగ్జర్ – 5లో పెట్టకుండా అవగాహన లోపంతో రెవెన్యూ సిబ్బంది అ¯ð గ్జర్ 1లో పెట్టి అసైన్డ్ భూములుగా చూపారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో జాబితాను రివైజ్డ్ చేసి పంపాలని సీసీఎల్ఏ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు త్వరలోనే జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తహసీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్ఓలను జిల్లా కేంద్రానికి రప్పించి ఆర్‌ఎస్‌ఆర్‌లో ఉన్న చుక్కల భూములను ఏ జాబితాలో పెట్టారో పరిశీలింపజేస్తారు. అనెగ్జన్–1లో ఉన్న చుక్కల భూములను అనెగ్జర్–5లోకి తీసుకువస్తారు. చుక్కలున్న భూముల్లో 1955కు ముందు క్రయ,విక్రయాలకు సంబంధించి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో రిజిష్ట్రేషన్లు జరిగిన భూములను ప్రయివేటు భూములుగా ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉంది. రివైజ్డ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటుందని అధికారవర్గాల సమాచారం.