4,500 గ్రామాల్లో ఎగిరిన డ్రోన్లు | Successful re-survey of lands Andhra Pradesh | Sakshi
Sakshi News home page

4,500 గ్రామాల్లో ఎగిరిన డ్రోన్లు

Published Mon, Aug 15 2022 4:10 AM | Last Updated on Mon, Aug 15 2022 8:50 AM

Successful re-survey of lands Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: భూముల చరిత్రను తిరగరాస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రీ సర్వే చురుగ్గా సాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 17,460 గ్రామాల్లోని 1.22 లక్షల చదరపు కిలోమీటర్లకు గాను.. 4,547 గ్రామాల్లోని  25 వేల చదరపు కిలోమీటర్లలో డ్రోన్‌ సర్వే పూర్తయింది. 22.43 లక్షల ఎకరాల భూములను కొలిచారు. డ్రోన్ల ద్వారా తీసిన ఫొటోలను మెరుగు పరిచి ఇచ్చే ఓఆర్‌ఐ (ఆర్థో రెక్టిఫైడ్‌ ఇమేజెస్‌)లు 2,101 గ్రామాలకు సంబంధించినవి సర్వే బృందాలకు అందాయి.

ఈ బృందాలు వాటిని, క్షేత్ర స్థాయిలో భూములను పోల్చి చూస్తూ రీ సర్వే ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి ఈ జనవరి నాటికి కేవలం 1,118 గ్రామాల్లో మాత్రమే డ్రోన్‌ సర్వే పూర్తయింది. కరోనా కారణంగా గత సంవత్సరం సుమారు వెయ్యి గ్రామాల్లో మాత్రమే డ్రోన్‌ సర్వే చేయగలిగారు. కానీ ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ నిర్దేశించడం, సీఎం వైఎస్‌ జగన్‌ రీ సర్వేపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంలో 7 నెలల్లో 3,500 గ్రామాల్లో డ్రోన్‌ సర్వేను పూర్తి చేయగలిగారు. ఇంకా వేగంగా చేసేందుకు డ్రోన్ల సంఖ్యను రెట్టింపు చేస్తున్నారు. ప్రస్తుతం 20 డ్రోన్లు వినియోగిస్తుండగా, సెప్టెంబర్‌ నుంచి కొత్తగా మరో 20 డ్రోన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. 

18 లక్షల ఎకరాల్లో క్షేత్ర స్థాయి నిజ నిర్ధారణ
► డ్రోన్‌ సర్వే ద్వారా ఇచ్చిన ఓఆర్‌ఐలను సంబంధిత రైతుల సమక్షంలో భూమిపైన సరిహద్దులతో పోల్చి చూసే గ్రౌండ్‌ ట్రూతింగ్‌ (క్షేత్ర స్థాయి నిజ నిర్ధారణ) ప్రక్రియ సుమారు 1,600 గ్రామాల్లో పూర్తయింది. ఈ గ్రామాల్లో 18 లక్షలకుపైగా ఎకరాల్లో గ్రౌండ్‌ ట్రూతింగ్‌ను పూర్తి చేశారు. 
► ఈ సంవత్సరం జనవరి నాటికి కేవలం 310 గ్రామాల్లో 2.6 లక్షల ఎకరాల్లో మాత్రమే గ్రౌండ్‌ ట్రూతింగ్‌ను చేయగలిగారు. కానీ ఆగస్టు నాటికి 1,600 గ్రామాల్లో 18 లక్షల ఎకరాల్లో గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పూర్తయిందంటే సర్వే ఎంత వేగంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. 

1,100 గ్రామాల్లో సరిహద్దుల నిర్ధారణ     
► గ్రౌండ్‌ ట్రూతింగ్‌ తర్వాత చేపట్టే గ్రౌండ్‌ వాలిడేషన్‌ (సరిహద్దుల నిర్థారణ) 1,100 గ్రామాల్లో పూర్తయింది. 9 లక్షల ఎకరాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. జనవరి నాటికి 260 గ్రామాల్లో మాత్రమే గ్రౌండ్‌ వాలిడేషన్‌ చేశారు. ఆ తర్వాత సర్వే వేగం పుంజుకోవడంతో తక్కువ సమయంలోనే 800 గ్రామాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. 
► మరోవైపు రీ సర్వే సుమారు వెయ్యి గ్రామాల్లో పూర్తయింది. ఈ గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు 13 నోటిఫికేషన్లు కూడా జారీ చేశారు. ఈ గ్రామాల్లో 8 లక్షల ఎకరాలకు సంబంధించి సర్వే పూర్తవడంతో ఆ గ్రామాల్లో కొత్త భూ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. జనవరి నాటికి 110 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తి కాగా, ప్రస్తుతం వెయ్యి గ్రామాల్లో పూర్తయింది.  
► గ్రౌండ్‌ వాలిడేషన్‌ పూర్తయ్యాక ఇప్పటి వరకు రైతులు, భూ యజమానుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల అభ్యంతరాలు వచ్చాయి. మొత్తం 5.50 లక్షలకుపైగా ల్యాండ్‌ పార్సిల్‌లో కేవలం 3 శాతం మాత్రమే అభ్యంతరాలు వచ్చాయి. వాటిలో 95 శాతానికిపైగా అభ్యంతరాలను మొబైల్‌ మెజిస్ట్రేట్‌ బృందాలు పరిష్కరించాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement