సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూముల రీ సర్వే ప్రాజెక్టు విజయవంతమవడంతో వివిధ రాష్ట్రాలు దాన్ని బెస్ట్ ప్రాక్టీస్‌గా తీసుకుంటున్నాయి. తాజాగా పుదుచ్చేరి ప్రభుత్వం ఏపీ రీసర్వేపై తమ రెవెన్యూ అధికారులకు అవగాహన కల్పించింది. డైరెక్టరేట్ ఆఫ్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగాధికారులతో భూమి రికార్డులకు సంబంధించిన అంశాలపై సోమవారం ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించింది.
ఈ వర్క్‌షాప్‌లో హైబ్రిడ్ టెక్నాలజీతో ఆధునిక భూముల సర్వే అనే అంశంపై ఏపీ ప్రభుత్వం తరఫున సర్వే సెటిల్మెంట్ శాఖలో పనిచేస్తున్న సర్వే అకాడమీ వైస్ ప్రిన్సిపాల్ సీహెచ్‌వీఎస్‌ఎన్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డ్రోన్లు, విమానాలతో ఆధునిక రీతిలో రాష్ట్రంలోని 1.25 చదరపు కిలోమీటర్ల ఏరియాలో రీ సర్వే జరుగుతున్న విధానం, ఇప్పటికే 2 వేల గ్రామాల్లో విజయవంతంగా రీ సర్వే పూర్తి చేసి ఆ గ్రామాలకు సంబంధించిన డిజిటల్ రికార్డులు అందుబాటులోకి తేవడం, అక్షాంశాలు, రేఖాంశాలతో రైతుల హద్దులు నిర్ధారించడం.. వారి భూముల్లో హద్దురాళ్లు పాతడం, 7 లక్షల మందికిపైగా రైతులకు హక్కు పత్రాలు పంపిణీ, 20 వేలకుపైగా భూ వివాదాలను పరిష్కరించడం వంటి పలు అంశాలను ఆయన ఈ వర్క్‌షాప్‌లో వివరించారు.
దేశ చరిత్రలో బ్రిటీష్ ప్రభుత్వం తర్వాత తొలిసారి భూములను రీ సర్వే చేయడం వల్ల ఎదురైన సవాళ్లు, వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్లిన విధానం, ప్రతి భూ కమతానికి ఆధార్ నంబర్‌లా విశిష్ట సంఖ్యను కేటాయించడం వంటి విషయాలను విశ్లేషించి చెప్పారు. రీ సర్వే ద్వారా రైతులకు వారి భూములపై స్పష్టమైన హక్కులు కల్పించడమేకాకుండా రాళ్లు పాతడం ద్వారా రక్షణ కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో జరుగుతున్న భూముల రీ సర్వే దేశానికే మోడల్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదని, ఏ రాష్ట్రమైనా భూమి రికార్డుల నిర్వహణ, రీ సర్వేలో కచ్చితంగా ఏపీ వైపు చూడాల్సిన పరిస్థితి ఉందన్నారు.
ఆధునిక టెక్నాలజీ, రికార్డుల నిర్వహణలో బెస్ట్ మోడల్
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కి చెందిన బీఎన్ యుగంధర్ సెంటర్ ఫర్ రూరల్ స్టడీస్ (బీఎన్‌వై–సీఆర్‌ఎస్) ఆధ్వర్యంలో ఈ వర్క్‌షాప్ నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ల్యాండ్ రీసోర్సెస్‌లు వివిధ రాష్ట్రాల్లో భూ పరిపాలన, నిర్వహణకు సంబంధించిన అంశాలపై వివిధ రాష్ట్రాలకు శిక్షణ ఇవ్వడం, విధానపరమైన సిఫారసులు చేసే బాధ్యతను(బీఎన్‌వై–సీఆర్‌ఎస్)కి అప్పగించింది.
ఈ సెంటర్ ఏపీలో రీసర్వేను బెస్ట్ ప్రాక్టిస్‌గా గుర్తించడమేకాకుండా ఇందుకు వినియోగిస్తున్న ఆధునిక టెక్నాలజీ, రికార్డుల నిర్వహణలో బెస్ట్ మోడల్‌గా సిఫారసు చేస్తోంది. అందులో భాగంగానే పలు రాష్ట్రాలకు భూముల వ్యవహారాలపై అవగాహన, రీ సర్వే గురించి శిక్షణ ఇచ్చేందుకు ఏపీ అధికారులను ఆహ్వానిస్తోంది. గత నెలలో ఉత్తరాఖండ్ అధికారులకు డెహ్రాడూన్‌లో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఇలాగే ఏపీ అధికారులతో ప్రజెంటేషన్ ఇప్పించగా, తాజాగా పుదుచ్చేరి వర్క్‌షాప్‌లోనూ ఏపీ రీ సర్వేను ఒక టాపిక్‌గా పెట్టి దానిపై అవగాహన కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment