సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల విస్తీర్ణం పెరిగిపోతోంది.. రికార్డుల్లో ఉన్న భూమి కంటే ఎక్కువగా ఉంటోంది.. భూములు పెరగడమే మిటి అనుకుంటున్నారా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా... ఇప్పటివరకు ఆన్‌లైన్ రికార్డుల్లో నమోదుకాని భూముల వివరాలు వెల్లడవుతున్నాయి. దాంతో రికార్డుల్లో ఉన్నదానికంటే ఎక్కువగా భూవిస్తీర్ణం నమోదవుతోంది. ఒక్క వరంగల్ అర్బన్ జిల్లాలోనే దాదాపు 10 వేల ఎకరాలకుపైగా భూమి అదనంగా గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే తరహా పరిస్థితి ఉందని.. మొత్తంగా రికార్డుల ప్రక్షాళన పూర్తయ్యే నాటికి ఏడెనిమిది లక్షల ఎకరాల మేర అదనంగా భూములు నమోదుకావచ్చని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆన్‌లైన్ పహాణీల్లో లేవు..
రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి భూరికార్డుల ప్రక్షాళన ప్రారంభమైంది. ఇప్పటివరకు ఒక్క వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రక్రియ పూర్తయింది. అయితే ఈ జిల్లాలో రికార్డుల్లో ఉన్న భూమి కన్నా ఎక్కువ భూమి లెక్కతేలింది. ఇక్కడ 2,77,004 సర్వే నంబర్ల పరిధిలో 2,98,600 ఎకరాల భూములు ఉన్నాయని ప్రభుత్వ ఆన్‌లైన్ పహాణీలు చెబుతున్నాయి. రెవెన్యూ యంత్రాంగం ఆ రికార్డుల ప్రకారమే.. జిల్లాలోని 124 గ్రామాల రైతులకు 1బీ నోటీసులిచ్చి రికార్డులను పరిశీలించింది. అయితే పరిశీలన పూర్తయ్యాక చూస్తే జిల్లాలో 2,81,248 సర్వే నంబర్లు ఉన్నాయని, మొత్తం భూవిస్తీర్ణం 3,09,325 ఎకరాలని తేలింది. అంటే 10 వేల ఎకరాలకుపైగా భూములు అదనంగా తేలాయి.
వరంగల్ అర్బన్‌లో ప్రక్రియ పూర్తి
వరంగల్ అర్బన్ జిల్లాలో భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం పూర్తయింది. ఆ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దాదాపు మూడు లక్షల ఎకరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అయితే రాష్ట్రంలోనే అత్యధికంగా వివాదాలున్న భూములు ఈ జిల్లాలోనే తేలడంతో.. ఇప్పుడు వాటిని సరిచేసి నమోదు చేసే పనిలో పడ్డారు. భూరికార్డుల ప్రక్షాళన అనంతరం ఇక్కడ ఎలాంటి పొరపాట్లు లేని భూములు 1,72,281 ఎకరాలుగా.. రికార్డులు సరిచేయాల్సినవి 1,37,043 ఎకరాలుగా తేల్చారు. సరిచేయాల్సిన వాటిలోనూ 90 శాతాన్ని సులువుగానే పరిష్కరించవచ్చని.. అసైన్డ్, కోర్టు కేసులు, సాదాబైనామా కేసులు మాత్రం పెండింగ్‌లో పడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
అసలీ భూమి ఎక్కడిది?
ప్రభుత్వ ఆన్‌లైన్ రికార్డుల్లో లేకుండా అదనంగా వచ్చిన భూమి ఎక్కడిదనే కోణంలో అధికారులు పరిశీలించి.. ఆ భూముల డేటా ప్రభుత్వ వర్గాల వద్ద లేదని గుర్తించారు. రెవెన్యూ అధికారులు భూరికార్డుల పరిశీలన కోసం గ్రామాలకు వెళ్లినప్పుడు.. కొందరు రైతులు వచ్చి తమ భూమి నోటీసులు ఇవ్వలేదంటూ రికార్డులు (పాస్‌బుక్‌లు, ఇతర డాక్యుమెంట్లు) చూపించడంతో రెవెన్యూ అధి కారులు కంగుతినాల్సి వచ్చింది. అయితే ఆ రికార్డులను రెవెన్యూ వర్గాల వద్ద ఉన్న సేత్వార్, ఖాస్రా పహాణీల ఆధారంగా పరిశీలిస్తే.. వాస్తవంగానే ఆ భూమి ఉందని, కానీ ఆన్‌లైన్ రికార్డుల్లోకి ఎక్కలేదని తేలింది. దీంతో మళ్లీ ఆ రైతులకు నోటీసులిచ్చి వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేశామని అధికారులు చెబుతున్నారు. భూరికార్డుల నిర్వహణ వ్యవస్థ (ఎల్‌ఆర్‌ఎంఎస్) నుంచి వెబ్‌ల్యాండ్ పోర్టల్‌కు రాష్ట్రంలోని భూముల డేటా మారినప్పుడు కొన్ని సర్వే నంబర్లను చేర్చలేదని వారు పేర్కొంటున్నారు. కొన్ని భూములకు సంబంధించి వివాదాలు ఉండటంతో ఆన్‌లైన్ పహాణీల్లో నమోదు చేయకుండా వదిలేశారని.. ఇప్పుడా రైతుల భూములను అధికారికంగా రికార్డుల్లో నమోదు చేస్తున్నామని చెబుతున్నారు.
ఇప్పటివరకు జరిగిన ‘ప్రక్షాళన’ గణాంకాలు
రాష్ట్రంలోని మొత్తం సర్వే నంబర్లు 1,78,59,552 (2,40,68,290 ఎకరాలు)
పరిశీలన పూర్తయినవి 1,00,83,799 (1,36,43,419 ఎకరాలు)
అన్ని అంశాలు సరిగా ఉన్నవి 70,52,345 (88,34,422 ఎకరాలు)
సరిచేయాల్సినవి 30,31,454 (48,08,997 ఎకరాలు)
వ్యవసాయేతర భూములుగా తేలినవి 2,29,642 (3,12,500 ఎకరాలు)
Comments
Please login to add a commentAdd a comment