తొలిరోజు 3,47,250 ఎకరాలు
► రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన భూ రికార్డుల ప్రక్షాళన
► హైదరాబాద్ మినహా మిగతా 30 జిల్లాల్లో ప్రక్రియ మొదలు
► 1,389 బృందాలు.. 1,389 గ్రామాల్లో గ్రామసభలు
► ఇంటింటికీ వెళ్లి రికార్డుల పరిశీలన
► మంచి స్పందన ఉందంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళన శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. హైదరాబాద్ మినహా 30 జిల్లాల్లో ప్రారంభమైన ఈ ప్రక్రియలో మొత్తం 1,389 బృందాలు పాల్గొన్నాయి. తొలిరోజు 1,389 గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించడంతోపాటు ఇంటింటికీ వెళ్లి రికార్డులను కూడా పరిశీలించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 3,47,250 ఎకరాలకు సంబంధించిన భూ రికార్డుల పరిశీలన పూర్తయింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది. గ్రామసభలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారని, తొలిరోజు స్పందన ఆశాజనకంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
నివాసేతరులు కూడా..
భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా నివాసేతరులు కూడా గ్రామాలకు వెళ్లి రికార్డులను సరి చేసుకోవాలని రెవెన్యూ యంత్రాంగం స్పష్టం చేస్తోంది. గ్రామసభ జరిగే రోజు హాజరు కావాలని, లేదంటే గ్రామంలో రెవెన్యూ బృందాలు ఉండే 10 రోజుల్లో ఒక రోజు గ్రామానికి వెళ్లి రికార్డులను సరి చూసుకుని.. అవసరమైతే సరి చేయించుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. గ్రామాలకు దూరంగా, ఇతర రాష్ట్రాల్లో ఉండే వారికి వీఆర్‌వోలు సమాచారం ఇస్తారని, దాని ఆధారంగా ప్రక్షాళన కార్యక్రమానికి హాజరు కావాలని చెబుతున్నారు. నివాసేతరుల కోసం ప్రతిరోజు సంబంధిత గ్రామంలో సాయంత్రం 5–6 గంటల మధ్య రెవెన్యూ బృందం ఉంటుందని, ఆ సమయంలో రికార్డులను సరి చూసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రవాస తెలంగాణవాసుల కోసం ‘ఈ–ప్రక్షాళన’
ఇక ప్రవాస తెలంగాణవాసుల కోసం ‘ఈ–ప్రక్షాళన’కార్యక్రమం చేపట్టాలని రెవెన్యూ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. గ్రామాల్లో ప్రవాసుల భూములకు ఉండే కాపలాదారులు లేదంటే వారి బంధువుల ద్వారా రికార్డులను సరి చేయించుకోవచ్చని, ఏవైనా అభ్యంతరాలుంటే సదరు జిల్లా యంత్రాంగానికి ఈ మెయిల్ ద్వారా నివేదించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. లేదంటే ‘మాభూమి’పోర్టల్‌లోకి వెళ్లి అక్కడ తమ భూమి వివరాలు తెలుసుకోవచ్చని, అక్కడ తేడా ఉంటే వెంటనే ఈ మెయిల్ ద్వారా తెలియజేయాలని పేర్కొంటున్నారు. సదరు ప్రవాసుల ఈ మెయిల్ అడ్రస్‌లను రెవెన్యూ కార్యాలయాల్లో ఇచ్చినా ఆన్‌లైన్ 1–బీ ప్రతులను మెయిల్ ద్వారా పంపుతామని, వారు కూడా అదే మెయిల్ ద్వారా మార్పు, చేర్పులను ప్రతిపాదించవచ్చని చెబుతున్నారు. ఈ విధానాన్ని ఒకటి రెండు రోజుల్లో అమల్లోకి తెస్తామని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
భూ వివాద రహిత గ్రామం ల్యాగలమర్రి
సాక్షి, జగిత్యాల: రెవెన్యూ రికార్డుల శుద్ధీక రణ, నవీకరణ కార్యక్రమం తొలిరోజే జగి త్యాల జిల్లా పెగడపల్లి మండలం ల్యాగల మర్రి గ్రామం తొలి భూవివాదరహిత గ్రా మంగా రికార్డు సృష్టించింది. గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, ఆర్డీవో డాక్టర్ గంటా నరేందర్ శుక్రవారం పర్యటిం చారు. దరఖాస్తుల రూపంలో వచ్చిన 113 సమస్య లకు పరిష్కార పత్రాలు, పట్టాలు ఇచ్చి ల్యాగలమర్రిని భూవివాదరహిత గ్రామం గా ప్రకటించారు.
వీటిలో 49 విరాసత్.. భూ రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లలో వచ్చిన సమస్య లు 62, రెండు ఓఆర్‌సీ పట్టాలను అర్హులైన లబ్ధిదారులకు అంద జేశారు. జమీన్ బందీ, సాదాబైనామా రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ ప్రక్రియలో భాగంగా ల్యాగలమర్రిలో మొత్తం 1,036 వివిధ రకాల సమస్యలపై దరఖాస్తులు అందాయి. వీటన్నింటిని పరిశీలించి పరి ష్కార మార్గాలను చూపించారు. కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ రెవెన్యూ రికార్డులను శుద్ధీకరించిన ల్యాగల మర్రి మాదిరిగానే జగిత్యాలను భూవివాద రహిత జిల్లాగా త్వరలోనే ప్రకటిస్తామని ఆశా భావం వ్యక్తం చేశారు.