
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న భూమిని కేటగిరీల వారీగా విభజించి కోడింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూ రికార్డుల ప్రక్షాళన పూర్తయిన చోట వ్యవసాయేతర భూములనూ పక్కాగా ఫార్మాట్ రూపంలో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. రహదారులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు.. ఇలా 33 కేటగిరీలుగా విభజించి సర్వే నంబర్ల వారీగా నమోదు చేయాలని కలెక్టర్లకు పంపిన ఉత్తర్వుల్లో సీఎస్ ఎస్పీసింగ్ పేర్కొన్నారు. మొదటి విడత గ్రామాల్లో ప్రక్షాళన పూర్తయినందున సంబంధిత ప్రక్రియను రికార్డు చేసి త్వరగా ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు.
భవిష్యత్ రెవెన్యూ లావాదేవీలు సులభం..
భూ రికార్డుల ప్రక్షాళనతో పాటు భవిష్యత్ రెవెన్యూ లావాదేవీలూ సులభంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే సర్వే నంబర్ వారీగా వ్యవసాయేతర పనులకు విని యోగిస్తున్న భూముల్లో ఏముందో పక్కాగా రికార్డు చేస్తోంది. దీని వల్ల భవిష్యత్ లావాదేవీల్లో వ్యవసా యేతర భూములు ఏ సర్వే నంబర్‌లలో ఎందుకు వినియోగిస్తున్నారో గుర్తించడం సులువవుతుందని, పక్కా రికార్డుల నమోదు వల్ల భూ వినియోగం, యాజమాన్య హక్కులకు సంబంధించి సమస్యలు రాకుండా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో రెండు సార్లు సమావేశమైన సీఎస్.. శాఖల వారీ ఆస్తులు, భూముల వివరాలను నమోదు చేయించుకోవాలని ఆదేశించారు. తమ దగ్గరున్న సమాచారాన్ని కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు పంపాలని కూడా సూచించారు. ఈ సమాచారానికి తోడు రెవెన్యూ యంత్రాంగమూ ప్రక్షాళనకు వెళ్లినప్పుడు వ్యవసాయేతర భూముల వివరాలను రికార్డు చేస్తోంది.
మొత్తంగా 33 కోడ్‌లు
వ్యవసాయేతర భూముల రికార్డుల కోసం 33 కోడ్‌లను ప్రభుత్వం సూచించింది. వాటిలో రహదారులు, రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులూ ఉన్నాయి. ఇక విద్యాసంస్థలు, ఆస్పత్రులు, పెట్రోల్ బంకులు, గోడౌన్లు, పరిశ్రమలను ప్రభుత్వ, ప్రైవేట్ కేటగిరీల్లో కాకుండా ఒకే కేటగిరీలో నమోదు చేయాలని కలెక్టర్లకు పంపిన ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు.
కోడ్‌ల లిస్టు ఇదే..
1) పంచాయతీరాజ్ రోడ్లు, 2) జాతీయ రహదారులు, 3) ఆర్‌అండ్‌బీ రోడ్లు, 4) స్థానిక సంస్థల రోడ్లు, 5) రైల్వే లేన్/ రైల్వే స్టేషన్, 6) ఇళ్లు, 7) కాలనీలు, 8) లే అవుట్లు, 9) ఇళ్ల స్థలాలు, 10) విద్యాసంస్థలు, 11) దేవాలయాలు, ప్రార్థన మందిరాలు, 12) రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, 13) కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, 14) స్థానిక సంస్థల కార్యాలయాలు, 15) ఆస్పత్రులు/సబ్‌సెంటర్లు, 16) తాగునీటి ట్యాంకులు, 17) శిఖం భూములు, 18) సాగునీటి కాల్వలు, 19) చెరువులు, కుంటలు, నాలాలు, 20) శ్మశాన వాటికలు, 21) డంపింగ్ యార్డులు, 22) విద్యుత్ సబ్‌స్టేషన్లు, 23) వ్యవసాయ మార్కెట్ యార్డులు, 24) కోల్డ్ స్టోరేజీలు/గోడౌన్లు, 25) ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు, 26) సినిమా థియేటర్లు, 27) పరిశ్రమలు, 28) పెట్రోల్ బంకులు, 29) కోళ్ల/డెయిరీ ఫాంలు, 30) ఎయిర్‌పోర్టులు/స్ట్రిప్‌లు, 31) గనులు, 32) సామాజిక అడవులు, 33) ఇంకేదైనా.