సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. త్వరలోనే భూముల లెక్కలకు ముగింపు పలకబోతున్నామని సీఎం ఉద్ఘాటించారు. భూముల లెక్కలు తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.. అందుకే భూరికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. మంగళవారం ఉదయం శాసనసభలో భూరికార్డుల ప్రక్షాళనపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. భూరికార్డుల ప్రక్షాళనపై అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని సీఎం స్పష్టం చేశారు. భూ రికార్డుల ప్రక్షాళనపై సుమారు 30 నుంచి 40 సమావేశాలు ఏర్పాటు చేసి సమీక్షించి నిర్ణయం తీసుకున్నామన్నారు. నూటికి నూరు శాతం పారదర్శకతతో భూరికార్డుల ప్రక్షాళన జరుగుతుందన్నారు.
ఇప్పటి వరకు జరుగుతున్న ప్రక్షాళనలో రెండు భాగాలుగా భూరికార్డుల ప్రక్షాళన జరగుతుందని సీఎం చెప్పారు. భూములకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు, ఫారెస్ట్, కోర్టు పరిధిలో ఉన్న భూముల జోలికి పోవద్దని అధికారులకు సూచించామన్నారు. అదే విధంగా కుటుంబ సభ్యుల మధ్య భూవివాదాలు ఉండే వాటి వద్దకు అధికారులు వెళ్లడం లేదని పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండే భూములను ప్రక్షాళన చేయమని అధికారులకు సూచించామని తెలిపారు.
గత ప్రభుత్వాల వల్లే
భూముల వివరాలు, రికార్డుల గురించి రైతులు పడే కష్టాలకు అంతు లేదన్నారు సీఎం. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి దాపురించిందన్నారు. కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలంలో ఒక్కొక్క గ్రామంలో చాలా భయంకరమైన నిజాలు బయటపడ్డాయని సీఎం తెలిపారు. భూముల లెక్కల్లో ఎక్కడా రాతలకు, కొలతలకు సంబంధం లేకుండా ఉందన్నారు. ఇదంతా గత ప్రభుత్వాలు భూరికార్డులను ప్రక్షాళన చేయకపోవడమేనని సీఎం చెప్పారు. డిసెంబర్ 31 కల్లా తొలి విడద భూముల ప్రక్షాళన పూర్తవుతుందని తెలిపారు. వెబ్‌ల్యాండ్ పరిస్థితి అయితే చిత్రవిచిత్రమని చెప్పారు. భూముల లెక్కలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని సీఎం తెలిపారు. శామీర్‌పేట మండలంలోని లకా్ష్మపూర్ గ్రామానికి రెవెన్యూ మ్యాప్ లేదన్నారు. భూరికార్డులకు.. వాస్తవాలకు చాలా తేడా ఉందన్నారు. భూ కబ్జాలు, డబుల్ రిజిస్ట్రేషన్స్ జరిగాయని తెలిపారు. నకిలీపాసుపుస్తకాలతో పైరవీకారులు చెలరేగిపోయారని సీఎం పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment