సాదా.. ఇక సీదా
► భూ రికార్డుల ప్రక్షాళనలో అధికారికం కానున్న సాదాబైనామాలు
►రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులు11,19,000
►అధికారులు ఆమోదించిన సర్వే నంబర్లు6,18,424
►అధికారులు తిరస్కరించిన దరఖాస్తులు9,49,000
సాక్షి, హైదరాబాద్
చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న సాదాబైనామాల సమస్యకు భూ రికార్డుల ప్రక్షాళన పరిష్కారం చూపుతోంది. తెల్లకాగితాలపై జరిపిన భూముల క్రయవిక్రయ లావాదేవీల (సాదాబైనామాల)ను అధికారికం చేయడం ద్వారా భవిష్యత్తులో తిరిగి ఈ సమస్య తలెత్తకుండా రెవెన్యూ శాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రెవెన్యూ వర్గాలు ఆమోదించిన 6,18,424 సర్వే నంబర్లలోని భూములను రెవెన్యూ రికార్డుల్లో చేర్చి, ఆన్‌లైన్ పహాణీలను అందజేయనున్నారు. తర్వాత కొత్త పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్‌లు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఆమోదం పొందినవాటన్నింటికీ..
కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందే రాష్ట్ర ప్రభుత్వం సాదాబైనామాల క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపట్టింది. అయితే జిల్లాల విభజన సమయంలో రెవెన్యూ వర్గాలకు పనిభారం పెరిగి.. ఈ ప్రక్రియలో జాప్యం జరిగింది. కానీ మూడు నెలల కింద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పని వేగిరం చేసి.. కొత్త జిల్లాల వారీగా సాదాబైనామాల దరఖాస్తులన్నింటినీ పరిష్కరించారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 11.19 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 15.68 లక్షల సర్వే నంబర్లకు సంబంధించిన భూములున్నాయి.
దీంతో ఒక్కో సర్వే నంబర్‌ను ఒక కేసుగా పరిగణించిన రెవెన్యూ అధికారులు... 6,18,424 సర్వే నంబర్ల పరిధిలోని దరఖాస్తులను ఆమోదించారు. 9.49 లక్షలకుపైగా దరఖాస్తులను తిరస్కరించారు. కబ్జాలో లేకపోవడం, విక్రయ లావాదేవీ జరిగినా వారసులు అంగీకరించకపోవడం, కొన్ని ప్రభుత్వ భూములకు సంబంధించిన సర్వే నంబర్లు ఉండడం, కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉండడం వంటి అంశాల కారణంగా ఆ దరఖాస్తులను తిరస్కరించామని.. ఏ సమస్యా లేని దరఖాస్తులను ఆమోదించామని అధికారులు తెలిపారు. అయితే ఆమోదం పొందిన సాదాబైనామాలకు కొత్త పాస్ పుస్తకాలు, టైటిల్‌డీడ్స్ ఇవ్వలేదు. ఈ–పాస్ పుస్తకాలను ఇవ్వాలన్న ఆలోచనతో నిలిపివేశారు.
ప్రక్షాళన ప్రక్రియతో..
తాజాగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో ఇంటింటికీ వచ్చి పాస్‌బుక్కులు చూసి రికార్డులు నమోదు చేసుకుంటున్నారు. దీనితో సాదాబైనామాల ద్వారా భూములు సంక్రమించిన రైతుల వద్ద పాస్ పుస్తకాలు లేకపోవడంతో ఆందోళనలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఆమోదం పొందిన సాదాబైనామా సర్వే నంబర్లన్నింటికీ ప్రక్షాళనలో భాగంగా ఆన్‌లైన్ పహాణీలు అందజేస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయా సర్వే నంబర్లు, రైతుల పేర్లు, విస్తీర్ణం తదితర అంశాలను రికార్డుల్లో నమోదు చేశామని స్పష్టం చేస్తున్నారు.
జోరుగా ఏర్పాట్లు
భూ రికార్డుల ప్రక్షాళన కోసం అన్ని జిల్లాల రెవెన్యూ యంత్రాంగం చురుకుగా పనిచేస్తోంది. ఈనెల 15 నుంచి ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లలో తలమునకలైంది. అధికారులు మండలాల్లోని గ్రామాలను గ్రూపులుగా విభజిస్తున్నారు. ఆ గ్రూపుల ప్రకారం ప్రక్రియ నిర్వహిస్తామని, ఏ మూడు గ్రామాల్లో సర్వే జరిపినా మండలంలోని యంత్రాంగమంతా అక్కడే ఉంటుందని చెబుతున్నారు. ఇక నల్లగొండ జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభమైన రోజే.. 30కిపైగా గ్రామాలను 100 శాతం ప్రక్షాళన పూర్తయిన గ్రామాలుగా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. కోర్టు కేసులున్నవి మినహా అన్ని భూముల రికార్డులను సరిచేయనున్నారు.