భూ రికార్డుల్లో తప్పుల కుప్పలు | more mistakes telangana land survey records | Sakshi
Sakshi News home page

భూ రికార్డుల్లో తప్పుల కుప్పలు

Published Sun, Sep 24 2017 1:09 AM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM

more mistakes telangana land survey records - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో పాతుకుపోయిన లోపాలెన్నో భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా బయటికి వస్తున్నాయి. దశాబ్దాల తరబడి నిర్లక్ష్యం, అవినీతి, అవకతవకల కారణంగా రెవెన్యూ రికార్డులు అడ్డదిడ్డంగా మారిపోయిన పరిస్థితి వెలుగులోకి వస్తోంది. ఈ నెల 15 నుంచి ప్రారంభమైన భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ సందర్భంగా... అసలు కంటే కొసరు సమస్యలు ఎక్కువగా వస్తుండటంతో రెవెన్యూ యంత్రాంగం ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆపసోపాలు పడుతోంది. రికార్డుల ప్రక్షాళనలో సాధారణంగా ఎదురవుతాయని భావించిన సమస్యల కన్నా.. ఇతర సమస్యలు, ముఖ్యంగా క్లరికల్‌ తప్పిదాలు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా 22 శాతం మేర తప్పులు నమోదవుతుండడం

అంచనా వేయనివే ఎక్కువ
భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా ఎలాంటి తప్పులు గుర్తించవచ్చనే అంచనాతో రెవెన్యూ శాఖ 25 కాలమ్‌లతో ఒక టేబుల్‌ను రూపొందించింది. అందులో మొత్తం గణాంకాలకు సంబంధించిన కాలమ్‌లు పోను మరో 20 కాలమ్‌లలో తప్పులు నమోదు చేస్తున్నారు. అందులో ఫలానా తప్పులుండే అవకాశముందని రెవెన్యూ శాఖ అంచనా వేసినవి 70 శాతమేకాగా.. రెవెన్యూ వర్గాలకు కూడా అంతుచిక్కని తప్పులు 30 శాతానికి పైగా గుర్తిస్తుండడం గమనార్హం. తొమ్మిది రోజులుగా సాగుతున్న భూ రికార్డుల ప్రక్షాళనలో మొత్తం 1.08 లక్షల సర్వే నంబర్లలో తప్పులున్నాయని గుర్తించగా... అందులో 33 శాతానికిపైగా ముందుగా సిద్ధం చేసిన జాబితాలో లేని తప్పులే. ఇందులో ముఖ్యంగా డబుల్‌ రిజిస్ట్రేషన్లు, సర్వే నంబర్లనే మార్చేయడం, వ్యవసాయ యోగ్యం కాని భూములను వ్యవసాయ భూములుగా చూపడం, సాగుదారుల పేర్లలో తప్పులు ఉండడం వంటివి బయటపడుతున్నాయి. లంచాలకు ఆశపడి రికార్డులను తారుమారు చేసినందునే ఇలాంటి తప్పులు జరిగాయని ప్రక్షాళనలో పాలుపంచుకొంటున్న జిల్లాస్థాయి సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు.

నిర్లక్ష్యం బట్టబయలు
ఇంతకాలం రెవెన్యూ యంత్రాంగం చేసిన నిర్లక్ష్యమంతా రికార్డుల ప్రక్షాళనలో బయటపడుతోంది. ఇందుకు క్లరికల్‌ తప్పిదాలే నిదర్శనం. మొత్తం సవరించాల్సిన రికార్డుల్లో 23.4 శాతం ఇవే ఉండడం గమనార్హం. ఇందులో పట్టాదారుల పేర్లలో క్లరికల్‌ తప్పిదాలు 20 శాతానికి పైగా ఉండగా.. సర్వే నంబర్ల నమోదులో తప్పిదాలు మరో మూడు శాతం ఉన్నాయి. ఇక భూములున్న దానికన్నా రికార్డుల్లో ఎక్కువ తక్కువలుగా విస్తీర్ణమున్న సర్వే నంబర్లు కూడా 12 శాతం వరకు ఉన్నాయి. రికార్డుల నమోదు, మార్పుల సమయంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ స్థాయిలో తప్పులు నమోదవుతున్నాయనే అభిప్రాయాలున్నాయి.

సక్రమంగా ఉన్న భూములు తక్కువే!
కానీ భూ రికార్డుల ప్రక్షాళన సాగుతున్న కొద్దీ సక్రమంగా ఉన్న సర్వే నంబర్ల శాతం తగ్గిపోతూనే ఉంది. ప్రక్షాళన జరిగితే కోర్టు కేసులు పోను దాదాపు 95 శాతం సక్రమ భూములు ఉంటాయని ప్రభుత్వం భావించింది. కానీ మొదటి నాలుగు రోజుల సర్వేలో అది 84 «శాతంగా నమోదుకాగా.. తొమ్మిది రోజులు పూర్తయ్యే సరికి 78.6 శాతం రికార్డులే సక్రమంగా ఉన్నట్లు తేలింది. దీంతో మిగతా 21 శాతం సర్వే నంబర్లలోని లోపాలను సవరించే ప్రక్రియ ఎలా జరుగుతుందో, అందులో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయోననే సందేహాలు తలెత్తుతున్నాయి.

ఆ జిల్లాల్లో మరింత దారుణం
అటవీ విస్తీర్ణం ఉన్న ఆరు జిల్లాల్లో మూడింట రెండువంతుల రికార్డులు మాత్రమే సక్రమంగా ఉన్నాయని తేలింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో సగటున 25.8 శాతం సర్వే నంబర్ల వివరాలు తప్పుగా నమోదయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్‌లో 34.5, కొత్తగూడెంలో 34.7, భూపాలపల్లిలో 46.6, ఆసిఫాబాద్‌లో 21.2, మహబూబాబాద్‌లో 30.4, మంచిర్యాలలో 21.1, నాగర్‌కర్నూల్‌లో 15.7 శాతం రికార్డుల్లో తప్పులు గుర్తించారు.

చుక్కలు చూపుతున్న భూపాలపల్లి
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో రికార్డులను పరిశీలిస్తున్న రెవెన్యూ యంత్రాంగానికి చుక్కలు కనిపిస్తున్నాయి. ములుగు, భూపాలపల్లి రెవెన్యూ డివిజన్లతో 20 మండలాలున్న ఈ జిల్లాలో ఏకంగా సగం వరకు రికార్డులు తప్పుల తడకేనని తేలింది. ఇక్కడ ఇప్పటివరకు 2,123 సర్వే నంబర్లలోని రికార్డులను పరిశీలిస్తే 990 రికార్డుల్లో తప్పులున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా చనిపోయిన వారి పేరిట పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఉండడం, పట్టాదారుల పేర్లు సరిపోలకపోవడం వంటివి ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

తొమ్మిది రోజుల ‘ప్రక్షాళన’గణాంకాలివే..
పరిశీలించిన మొత్తం సర్వే నంబర్లు:      4,88,684
సక్రమంగా ఉన్నవి:   3,84,563
తప్పులు నమోదయినవి: 1,04,121
కోర్టు కేసులున్నవి: 656
పట్టాదారుల పేర్లు సరిపోలనివి: 5,475
చనిపోయినవారి పేర్లపై ఉన్నవి: 15,513
పట్టాదారుల పేర్లలో క్లరికల్‌ తప్పిదాలున్నవి: 20,848
ఆన్‌లైన్‌లో నమోదుకాని మ్యుటేషన్లు: 4,538
రికార్డుల కన్నా ఎక్కువ, తక్కువగా ఉన్న భూములు: 12,201
సర్వే నంబర్లలో క్లరికల్‌ తప్పిదాలున్నవి: 3,523
వ్యవసాయేతర భూములు: 6,826
ఇతర తప్పిదాలున్నవి: 33,188

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement